Friday, December 3, 2010

మంత్రుల్లో అసంతృప్తి చూస్తుంటే అధికారానికి ఎంతగా అలవాటు పడ్డారో- దత్తాత్రేయ

హైదరాబాద్; శాఖల కేటాయింపుల పట్ల మంత్రుల్లో అసంతృప్తి చూస్తుంటే వారు అధికారానికి ఎంతగా అలవాటు పడ్డారో తెలుస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందులో కేవలం ధనార్జనే ప్రతిబింబిస్తోందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది కేవలం రాజకీయ సర్దుబాటు కోసం నిర్మాణం చేసిన మంత్రివర్గమే కానీ పని ప్రాధాన్యత బేరీజు వేసుకుని చేసింది కాదన్నారు. గతంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చినవారినీ తీసుకున్నారని చెప్పారు. నాయకుడినే ధిక్కరించిన విచిత్ర మంత్రివర్గమని, ఇటువంటిది ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు కనపడలేదని అన్నారు. మొదటి రోజు రాత్రే అపశకునం జరిగితే సజావుగా జరుగుతుందని ప్రజలు నమ్మగలరా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో సమిష్టి బాధ్యత ఉంటుందని, కానీ ఇది బాధ్యత లేని మంత్రివర్గమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అతి ప్రధానమైన సమస్యలు అనేకం ఉంటే మంత్రులను సర్దిపుచ్చుకోడానికే సమయం సరిపోతుందన్నారు. 'టీజీ వెంకటేష్ రాయలసీమ ఉద్యమం చేశారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు తెలంగాణ ఏర్పడకపోతే రాజీనామా చేస్తానన్నారు. దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌లు హైదరాబాద్ రాష్ట్రం కావాలన్నారు. ఇన్ని వైరుధ్యాలున్న మంత్రి వర్గాన్ని ఎవరు కాపాడతారు' అని ప్రశ్నించారు. ఇది అతుకుల బొంత క్యాబినెట్ అని, రౌతు మారాడేకానీ.. గుడ్డిగుర్రం మారలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నాయకుడు లేకుండా.. దిక్సూచిలేని నావలాగా మారిందన్నారు. రాష్ట్రం అధోగతి పాలుకావడానికి అధిష్టానానిదే బాధ్యతఅని, అలాగే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా బాధ్యత వహించాలని అన్నారు.

No comments:

Post a Comment