Monday, July 30, 2012

రైలు ప్రమాదమా? విద్రోహచర్యా?


నెల్లూరు సమీపంలో జరిగిన రైలు దుర్ఘటన ప్రమాదమా? విద్రోహుల ఘాతుకమా? సాక్షులు చెప్తున్న కథనంతో ఈ సందేహాలు కలుగుతున్నాయి. కుట్ర కోణంపైనా ఉన్నతాధికారులు దృష్టిసారించారి. పూర్తిస్థాయి విచారణలో నిజాలు బయటకొస్తాయని చెప్తున్నారు.ఈ మంటలు ప్రమాదం కారణంగానే ఎగిసిపడుతున్నాయా? ఇది ప్రమాదం మాటున సంఘ విద్రోహ శక్తులు ఆడిన నెత్తుటి క్రీడా?
తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైందనే తొలుత అందరూ భావించారు. కానీ.. కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్నికీలలు ఎగిసిపడే ముందు పేలుడు శబ్దాలు వినిపించాయని ప్రయాణికులు చెప్తుండడంతో కొత్త సందేహాలు తలెత్తాయి. ఈ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలిచ్చారు. ప్రయాణికులిచ్చిన సమాచారమే కీలకంగా మారింది. పేలుడు ఎలా సంభవించిందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. S-11లో ముగ్గురు అనుమానితులు సంచరించినట్టు కొందరు చెప్తున్నారు. దీంతో.. అన్‌రిజర్వ్డ్‌ ప్రయాణికులపై టీటీలను విచారణ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.నెల్లూరు రైల్వే స్టేషన్ వరకు అంతా సవ్యంగానే ఉన్నా.. కొన్ని నిమిషాల వ్యవధిలో ఇంత పెద్ద ప్రమాదం ఎలా సంభవించిందన్నది మిస్టరీగా మారింది.
నెల్లూరులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ -చైన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైల్లో తెల్లవారుజామున సుమారు 4.45గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్ది సేపట్లోనే ఎస్-11 బోగీలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ఏమి జరుగుతోందో తెలుసుకునే లోగా మంటలు వేగంగా విస్తరించడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు.
ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. 20మంది ప్రయాణికులు ఒక డోర్ ఓపెన్ చేసుకుని దిగిపోయారని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. మంటలు ఇంతర బోగీలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది గ్యాస్  కట్టర్ సాయంతో బోగీని రైలు నుంచి వేరు చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
విద్యుదాఘాతంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రమాద సమయంలో బోగీలో 72మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతున్నందున  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పది మంది క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
అటు రైలులో మంటలు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బోగీలో ఉన్న 15మంది ప్రయాణికులు బయటకు దూకారు. వీరిలో ఒకరు మృతి చెందగా మిగతా వారిని చికిత్స నిమిత్తం జైభారత్ ఆస్పత్రికి తరలించారు. రైలు ప్రమాదంలో గాయపడిన 22మందిని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో చెన్నైకు చెందిన బన్సల్, సరళ, ఖమ్మంకు చెందిన శ్రీనివాస్, ఉదయభాస్కర్ గా గుర్తించారు. వీరిలో సరళ, బన్సల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాల్సి ఉందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో సాంబశివరావు తెలిపారు.
 రైలు బోగీని పరీక్షించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన బోగీ నుంచి 15మంది వరకు సురక్షితంగా బయటపడ్డారని నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. ప్రమాద సమయంలో రైలు సుమారు 120కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరోవైపు ప్రమాదస్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉండటంతో భారీ ప్రమాదం జరగకుండా నివారించగలిగామన్నారు. మొత్తం 14మంది బయటపడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఇంకా ఎక్కువగానే సురక్షితంగా బయటపడి ఉంటారని ఆయన చెప్పారు. 
తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. నెల్లూరు హెల్ప్ లైన్ నెంబర్లు - 0861-2345863, 2345864, 2345865,2345866. విజయవాడ హెల్ప్ లైన్ నంబర్లు -0866-2576924,2575038. సికింద్రాబాద్ 040-27786723, 27700868. కాగా మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున రైల్వేశాఖ పరిహారం ప్రకటించింది. 
 ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి: సహాయక చర్యలకు ఆదేశం
 రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించాలని నెల్లూరు కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ వైద్యబృందాలు, అంబులెన్సులు ఘటనాస్థలం దగ్గర ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

Tuesday, July 24, 2012

సమ్మెకు దిగిన విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు ...


స్టీల్‌ప్లాంట్‌ పరిసరాల్లో 144 సెక్షన్‌








ఒకరోజు సమ్మెకు దిగిన విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు


విశాఖ ఉక్కు కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. ఉక్కు పరిశ్రమలో ప్రైవేటు పెట్టుబడులను నిరసిస్తూ ఒకరోజు సమ్మెకు దిగారు. ఈ సమ్మెలో సుమారు 40 వేల మంది కార్మికులు పాల్గొంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిసరాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. అటు స్టీల్‌ప్లాంట్‌ లోనికి వెళ్లే కార్మికులను బీసీ గేటు వద్ద కార్మిక సంఘాల నేతలు అడ్డుకుంటున్నారు. కార్మికుల సమ్మెతో పలు విభాగాలు మూతపడటంతో ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది. ఒకరోజు సమ్మెతో స్టీల్‌ప్లాంట్‌కు సుమారు 100 కోట్ల నష్టం వాటిల్లనుంది. సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో సమ్మెకు సంఘీభావం తెలుపుతూ వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. లాభాల బాటలో పయనిస్తున్న స్టీల్‌ప్లాంట్‌.. దశలవారీగా ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందంటూ కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

Sakshi::Full Story

Sakshi::Full Story

Thursday, July 12, 2012

టీడీపీ నేత బండారు ఆమరణ నిరాహార దీక్ష......


టీడీపీ నేత బండారు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఫార్మాసిటీ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. తాడి గ్రామాన్ని తరలించాలని... ముత్యాలమ్మపాలెం మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్లకు అధికారులు స్పందించకపోవడంపై ఆందోళనకారులు మండిపడ్డారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తెరిచిన పరిశ్రమలపై దాడులు చేశారు. కార్మికులు హాజరుకాకుండా అడ్డుకున్నారు. మరోవైపు రాంకీ ప్రతినిధులు, పరిశ్రమల యాజమాన్యాలతో ఆర్డీవో వరదరాజులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 




















రాంకీ ఫార్మా సిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలించాలని, ముత్యాలమ్మపాలెం మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండారు దీక్ష చేపట్టి మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో తెల్లవారుజామున ఐదు గంటల నుంచే తాడి, ముత్యాలమ్మపాలెం గ్రామస్థులు కర్రలు పట్టుకుని శిబిరం వద్దకు చేరుకున్నారు. ఫార్మాసిటీకి రాకపోకలు జరిగే రహదారులను పూర్తిగా స్తంభింపజేశారు. కార్మికులతోపాటు ఫార్మా ఉద్యోగులెవ్వరినీ విధులకు వెళ్లనీయలేదు. అలాగే వివిధ పనుల నిమిత్తం అటుగా వెళ్లే వారిని సైతం వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో తమను నిలుపు చేయడాన్ని కొందరు ద్విచక్ర వాహనదారులు ప్రశ్నించడంతో వారిపైకి దూసుకువెళ్లారు. దీంతో కొన్నిసార్లు స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అక్కడే వున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి వాహనదారులను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఇదేపరిస్థితి కొనసాగింది. కొన్ని ఫార్మా కంపెనీల్లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారన్న సమాచారం మేరకు మత్స్యకారులంతా ఆయా కంపెనీలపై కర్రలతో దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ కంపెనీకి చెందిన పూల కుండీలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గాజువాక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పలరాజు తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ఆందోళనకారులను అక్కడ నుంచి పంపివేశారు. కాగా, సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మత్స్యకార మహిళలంతా రాంకీ గేటును దాటి లోపలకు దూసుకొని పోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీక్షలో కూర్చున్న ముత్యాలమ్మపాలెం మాజీ సర్పంచ్ ముత్యాలు శిబిరం నుంచి కిందకు దిగి ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో శాంతించారు. నీరసించిన బండారు ఆరోగ్యం బండారు ఆమరణ నిరాహార దీక్ష బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. బండారు బాగా నీరశించిపోయారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు, రాత్రి 7.30 గంటలకు వైద్యులు రత్నకుమార్, రాజన్నలు పరీక్షలు నిర్వహించారు. బీపీ తగ్గడంతోపాటు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా వున్నాయని, దీనిప్రభావం ఆరోగ్యంపై పడుతుందని వైద్యులు తెలిపారు. తక్షణమే బండారుకు ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వుందన్నారు. దీనికి బండారు ససేమిరా అన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా బండారు తనదైన శైలిలో మత్స్యకారులనుద్దేశించి మాట్లాడుతూ చైతన్యపరిచారు. ఇదిలావుండగా బండారు ఆరోగ్యం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. దీక్ష ప్రారంభించి ఇప్పటికే మూడు రోజులు గడవడంతో ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీక్షకు పలువురు సంఘీభావం బండారు చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని పలువురు సందర్శించి, సంఘీభావం తెలిపారు. అనకాపల్లికి చెందిన దాడి రత్నాకర్, జీవీఎంసీ 55వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పాల అచ్చిలనాయుడు, వాసుపల్లి గణేశ్‌కుమార్, భరణికాన రామారావు, హర్షవర్దన్, మాజీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, లేళ్ల కోటేశ్వరరావు, ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ పప్పు రాజారావు, బీసీ ర్రాష్ట కార్యదర్శి మూర్తియాదవ్, తదితరులు బండారుకు మద్దతును తెలియజేశారు. బండారు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఫార్మా కంపెనీల్లో నిలిచిన ఉత్పత్తి మత్స్యకారుల ఆందోళనలో భాగంగా బుధవారం ఫార్మాసిటీలోని పలు కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులను విధుల్లోకి వెళ్లనివ్వలేదు. దీంతో పలు కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. గతంలో ధర్నాలు జరిగినప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇలాంటి చర్యల వలన ప్రమాదాలు కూడా జరగవచ్చని కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Friday, July 6, 2012

సీబీఐ జేడీ ఉంటారా? ఊడతారా!!?


రాష్ట్రంలో ఇప్పుడంతా కేసుల హవా నడుస్తోంది. పలువురు ప్రముఖులు విచారణ ఎదుర్కుంటుండటం, కొందరు జైళ్ళలో ఉండటం లాంటి వాటి నేపథ్యంలో వాటన్నిటికీ కీలక సూత్రధారి అయిన సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణపై అందరి దృష్టీ పడింది. ఆయన పదవీకాలం గతనెలతోనే పూర్తి కావటంతో లక్ష్మీనారాయణను కొనసాగిస్తారా లేక వెనక్కి పంపుతారా అనే చర్చ జరుగుతోంది. జగన్‌ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఓబుళాపురం మైనింగ్‌ లాంటి అత్యంత కీలక మైన కేసుల నిగ్గు దేల్చే బాధ్యతను లక్ష్మీనారాయణ తీసుకున్నారు. 

వాటి విచారణ, ఆధారాల సేకరణ, చార్జిషీట్ల నమోదు వంటి కీలక పరిణామాలన్నీ సాగుతు న్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్‌, ఐఏఎస్‌ అధికారులు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ లాంటి వారం తా చంచల్‌ గుడా జైలులో ఉన్నారు. ఈ కేసులు ఎంతకాలం కొనసాగుతాయో తెలియని స్థితి. ఇదే సమయంలో దీనికి రాజకీయ రంగు కూడా అలుముకుంటున్నది. ఒకవేళ లక్ష్మీనారాయణను మరో ఏడాది పాటు కొనసాగిస్తే తమపై కాంగ్రెస్‌ కక్ష సాధింపు నిజమే అని తేలిపోయిందంటూ జగన్‌ పార్టీ ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. వెనక్కి పంపించినా కష్టమే. జగన్‌ వర్గం చేసిన ఒత్తిడికి తలొగ్గారన్న అపప్రథను కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ నాయకత్వం ఎదుర్కోవలసి ఉంటుంది. 

దానితో పాటు ఎప్పటికైనా కాంగ్రెస్‌తో జగన్‌ కుమ్మక్కు అవుతారని తాము చెబుతున్న మాటలు నిజమయ్యాయంటూ విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తారా లేక వెనక్కి తిప్పి పంపుతారా అనేది ఆసక్తికర పరిణామంగా మారింది. లక్ష్మీనారాయణ ను 2006 జూన్‌లో డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి పంపించారు. అది ముగిసిన తర్వాత మరో ఏడాది పాటు  పొడిగించారు. ఇంతలోనే ఈ కేసులన్నీ వెలుగులోకి వచ్చాయి. వాటిని నిగ్గుదేల్చే పని లక్ష్మీనారాయణ సారథ్యంలో సాగుతోంది. కేసులు నడి మధ్యలో ఉండగా ఆయన డిప్యుటేషన్‌ గడువు పూర్తి కావటంతో దాని పొడిగింపుపై ఆసక్తి ఏర్పడింది. సీబీఐ మాన్యువల్‌ ప్రకారం అధికారి ఎంత సమర్థుడైనా డిప్యుటేషన్‌ను  రెండవసారి పొడిగించటం కుదరదు. అదీగాక ప్రతిష్ఠాత్మకమైన ఈ పదవిని దక్కించుకు నేందుకు ఇప్పటినుంచే పలువురు ఐపీఎస్‌ ఆఫీసర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

లక్ష్మీనారాయణ పదవీ కాలం ముగిసిపోయినందున ఆయనను వెనక్కి పిలిపించాలని వైకాపా గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తోంది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళిన బృందం బుధవారం ప్రధానమంత్రిని కలిసి ఈ డిమాండ్‌నే ముందు పెట్టింది. శరద్‌ యాదవ్‌, ఏబీ బర్దన్‌, శరద్‌పవార్‌ లాంటి వారినీ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ ను కలిసినప్పుడూ ఈ మాటలే చెప్పింది. ఇంతటి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో లక్ష్మీనారాయణ పదవీకాలాన్ని పొడిగిస్తే వైకాపా నాయకులు కాంగ్రెస్‌ నాయకత్వంపై విమర్శల దూకుడు మరింత పెం చుతారు. ఒక రకంగా కాంగ్రెస్‌ నాయకత్వానికి ఇది ఇబ్బందికర పరిణామమే.

success news

Wednesday, July 4, 2012

ఎన్ టి పిసి...అయిపోయింది...ఇకఫార్మా సిటీ వంతు !!?




ఫార్మాసిటీని ఆనుకుని ఉన్న తాడి గ్రామాన్ని తరలించడంపై మొదలైన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఈ గ్రామాన్ని తరలించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చాలాకాలంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ భుజాన కెత్తుకుంది. ఈ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు వెనక్కు తగ్గేది లేదని, ఇందుకోసం ఆమరణ దీక్షకు దిగుతానని టిడిపి నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే కలెక్టర్‌కు, ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వివాదం మరింత జఠిలమైంది. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్  అధికార బృందాన్ని ఫార్మాసిటికీ పంపించారు.
ఫార్మాసిటీ కాలుష్యంతో తాడి గ్రామం ఇబ్బంది పడుతోందన్నది అఖిలపక్ష నాయకుల ఆరోపణ. ఇందులో పాత అసెస్‌మెంట్ల ప్రకారం 570 కుటుంబాలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 900కు చేరుకుంది. ఈ గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలించాలని కోరుతూ చాలా కాలంగా అఖిలపక్షం ఆందోళన చేస్తోంది. 2008లో ప్రభుత్వం స్పందించి పెదముషిరివాడ గ్రామంలోని సుమారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి, వీరిని అక్కడికి తరలించాలని సూచించింది. ఇది కార్యరూపం దాల్చలేదు. తాడి గ్రామాన్ని తరలించాలంటే 2007లో అంచనాల ప్రకారం 100 కోట్ల రూపాయలు కావల్సి ఉంటుంది. ఇప్పుడు అది 250 కోట్ల వరకూ చేరుకుంది.
వివాదం ఇలా కొనసాగుతుండగా, ఫార్మాసిటీ గ్రీన్ బెల్ట్ అంశం తెరమీదకు వచ్చింది. గ్రీన్ బెల్ట్‌ను ఫార్మాసిటీ బౌండరీలో నిర్మించాలా? లేక బౌండరీకి అవతల 500 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలా? అన్నది ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఈ కేటాయింపులపైనే అప్పటి వుడా వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి సిబిఐకి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ ఫార్మా బౌండరీకి అవతల గ్రీన్ బెల్ట్ నిర్మించాల్సి వస్తే, రాంకీ మరో 400 నుంచి 500 ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు తాడి గ్రామం కూడా ఆ 500 మీటర్ల పరిధిలోకే వస్తుంది. రాంకీ యాజమాన్యం ఆ స్థలాన్ని సేకరించడానికి ముందుకు రాలేదు. ప్రస్తుతం ఉన్న తాడి గ్రామాన్ని తరలించే బాధ్యతను చేపట్టాలంటూ ఎపిఐఐసి 2007లోనే రాంకీ యాజమాన్యానికి లేఖ రాసింది. ఇందుకు అప్పట్లో 67 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అంత మొత్తాన్ని వెచ్చించేందుకు రాంకీ ముందుకు రాలేదు. 2012 లెక్కల ప్రకారం ఈ భూమిని సేకరించి, ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి గ్రామాన్ని తరలించాలంటే 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇంత మొత్తాన్ని రాంకీ భరించేందుకు సిద్ధంగా లేదు. ఎపిఐఐసి కూడా దీనిపై మోనం వహించడంతో వివాదం ముదిరింది.
ఇప్పటివరకూ ఈ విషయమై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఇప్పుడు టిడిపి ఒంటరిగానే ఈ ఉద్యమాన్ని నడపాలని నిర్ణయానికి వచ్చింది. ఈనెల 9వ తేదీ నుంచి బండారు సత్యనారాయణ మూర్తి ఆమరణ దీక్షకు దిగాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బండారు  సక్సెస్ న్యూస్ తో మాట్లాడుతూ ఈ విషయంలో ఎవరేం చెప్పినా గ్రామస్థులకు న్యాయం జరిగే వరకూ తాను వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. తాడి గ్రామాన్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమిని సేకరించి, తరువాత ఎందుకు మోనంగా ఉండిపోయిందని ప్రశ్నించారు.

రోజురోజుకూ ఈ వివాదం ముదురుతుండడంతో జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ జోక్యం చేసుకున్నారు. ఎపిఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సత్యనారాయణను, జెడ్.ఎం. యతిరాజును, ఇజెడ్‌ఎం ప్రసాద్‌ను, కాలుష్య నియంత్రణ మండలి ఇ.ఇ. మహ్మద్ అలీఖాన్‌ను, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయసారథిని తహశీల్దార్ పాండురంగారెడ్డిని ఫార్మాసిటీకి పంపించారు. రాంకీ సిఇఓ లాల్‌కృష్ణ, కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ జిఎం వీరారెడ్డి, రాంకీ ఎజిఎం ప్రకాష్‌రెడ్డితో అధికారుల బృందం పలు అంశాలపై చర్చలు జరిపింది. తాడి గ్రామానికి కాలుష్య సమస్య లేదన్నది రాంకీ వాదన. వివాదం మరింత జఠిలం కాకుండా చూడాల్సిందిగా అధికారుల బృందం సూచించినట్టు తెలుస్తుంది,

ఇక కొత్త ఏపీపీఎస్సీ


యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యుపిఎస్‌సి) తరహాలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎపిపిఎస్‌సి)ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో ఇప్పటికే మూడు కమిటీలను వేసిన ప్రభుత్వం అందుకు అనుగుణమైన కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ సిసిఎల్‌ఎగా ఉన్నపుడు ఆమె అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫార్సులపై ప్రభుత్వం దృష్టి సారించింది. సిఫార్సులపై మరింత అధ్యయనం చేసి పది పదిహేను రోజుల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. దాని ప్రకారం ఇక మీదట రాష్ట్రంలో గ్రూప్-1బి క్యాడర్ ఏర్పాటవుతుంది. గతంలో వీటిని గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా వ్యవహరించేవారు. వాటిని గ్రూప్-1బి కిందకు తీసుకొస్తారు. గ్రూప్-2లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు యథాతథంగా కొనసాగుతాయి. ప్రతి ఏటా సెప్టెంబర్ 30నాటికి వివిధ శాఖల్లోని పోస్టులను గుర్తించడం, మార్చి 31నాటికి షెడ్యూలు ప్రకటించడం, షెడ్యూలు ప్రకారం ఏటా రిక్రూట్‌మెంట్ నిర్వహించడం సంస్కరణల్లో ప్రధాన భాగంగా ఉంటాయి. ఇంటర్వ్యూల్లోనూ, లిఖిత పరీక్షల నిర్వహణలోనూ పలు మార్పులు తీసుకొస్తున్నారు. ఎపిపిఎస్‌సి పనితీరు- సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ సమర్పించిన నివేదికపై మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. విస్తృతంగా చర్చించిన మీదట నివేదికపై మరింత అధ్యయనం చేసి వీలైనంత తొందరలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యును ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎపిపిఎస్‌సి చైర్మన్ రేచల్ ఛటర్జీ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, సర్వీసు సెక్రటరీ బి వెంకటేశ్వరరావు, న్యాయశాఖ కార్యదర్శి ఆర్ దామోదర్‌లు పాల్గొన్నారు.
కొత్తగా తీసుకొచ్చే గ్రూప్-1బి క్యాడర్‌లోకి మున్సిపల్ కమిషనర్లు, ఎసిటిఓలు, డిప్యూటీ తహసీల్దార్‌లు, సహకార శాఖ సబ్ రిజిస్ట్రార్‌లు, సహాయ కార్మిక శాఖ
అధికారులు, పంచాయతీరాజ్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు, ఎక్సైజ్ సబ్ ఇనస్పెక్టర్లు వస్తారు. అయితే గ్రూప్-1కు, గ్రూప్-1బి సర్వీసులకు కామన్ పరీక్ష నిర్వహిస్తారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకుడు, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారి, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకుడు, పోలీసు కమ్యూనికేషన్స్ డిఎస్పీ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల్లో మైనింగ్ ఇంజనీరింగ్ సెక్షన్ హెడ్‌లు, పోలీసు సర్వీసులో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ రిపోర్టర్లు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి, సహాయ గిరిజన సంక్షేమ అధికారి, సహాయ వెనుకబతడిన తరగతుల సంక్షేమ ాధికారి, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సహాయ లెక్చరర్లు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెకర్చర్ల పోస్టులకు సైతం ఇక మీదట ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో ఉన్నా, ఎగ్జిక్యూటివ్ తరహా పోస్టులకూ ఇక మీదట ఇంటర్వ్యూలు నిర్వహించాలనేది మరో ప్రతిపాదన. వీటిలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఎపిఆర్‌ఓ, మహిళా సంక్షేమ శాఖ సూపర్ వైజర్లు, చిల్ట్రన్ హోమ్ సూపరింటెండెంట్ తదితర పోస్టులు ఉంటాయి. మిగతా పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు. అన్నీ రాత పరీక్ష ఆధారంగానే జరుగుతాయి. కొత్తగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇండియన్ మెడిసిన్‌లో మెడికల్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, వ్యవసాయాధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు పోస్టులను కూడా ఎపిపిఎస్‌సి పరిధిలోకి తెస్తారు. డైరెక్టు రిక్రూట్‌మెంట్‌కు అవసరమయ్యే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ప్రతి ఏటా రిక్రూట్‌మెంట్ జరిగేలా ప్రణాళిక ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం క్యాలండర్ ఆఫ్ రిక్రూట్‌మెంట్‌ను ప్రతి ఏడాది మార్చి 31నాటికి ఎపిపిఎస్‌సి ఆమోదిస్తుంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏర్పడబోయే ఖాళీల జాబితాతో నవంబర్ 30 నాటికి ఆయా శాఖలు సర్వీసు కమిషన్‌కు అందజేయాల్సి ఉంటుంది.
డైరెక్టు రిక్రూటీస్ ప్రమోషన్ల విషయంలో నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ, రోస్టర్ పాయింట్లు పాటిస్తున్నదీ లేనిదీ వంటి అంశాల పరిశీలనకు వీలుగా ముసాయిదా డిపిసి ప్రతిపాదనలను ఆయా శాఖలు సర్వీసు కమిషన్‌కు అందిస్తాయి. ఎపిపిఎస్‌సి రిక్రూట్‌మెంట్స్‌కు ఇప్పటికే అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, వికలాంగ ఉద్యోగాలకు ఇచ్చిన వయోపరిమితి సడలింపునకు అదనంగా సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకా అదనపు వయస్సు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కమిటీ అభిప్రాయపడింది.
ఎపిపిఎస్‌సి నిర్వహించే రాత పరీక్షలకు అభ్యర్థులు ఎన్నిసార్లు హాజరుకావచ్చనే అంశంపై యుపిఎస్‌సి నిబంధనలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. సర్వీసు కమిషన్ రిక్రూట్‌మెంట్‌లకు అవసరమైన నిధులను విడుదల చేయడానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అంగీకరించారు. సర్వీసు కమిషన్ రిక్రూట్‌మెంట్‌లను మరింత మెరుగుపర్చడానికి, వేగవంతం చేయడానికి కొత్తగా కంప్యూటర్ సెల్‌ను ఏర్పాటు చేస్తారు.
ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటుకు సంబంధించి కమిషన్ చైర్మన్, ఇద్దరు సభ్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంటర్వ్యూ బోర్డులో ఒకరు లేదా ఎక్కువమంది సబ్జెక్టు నిపుణులను నియమించే అధికారం చైర్మన్ /సబ్‌కమిటీ ఆమోదించిన ఒక ప్యానల్ /శాఖాధిపతులకు ఉంటుంది. ఇంటర్య్వూ మార్కులను ఇచ్చే విధానంపై కూడా ఈ సబ్ కమిటీ కమిషన్‌కు సలహా ఇస్తుంది.
ఎపిపిఎస్‌సి పనితీరు -సంస్కరణలపై సిఫార్సు చేయడానికి అప్పటి సిసిఎల్‌ఎ మిన్నీ మాథ్యూ అధ్యక్షతన కమిటీని గతంలోనే వేశారు. దీనిలో సభ్యులుగా పివి రమేష్,సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జిఎన్ ఫణికుమార్,  సర్వీసు కమిషన్ కార్యదర్శి పూనం మాలకొండయ్య, దామోదర్‌, వెంకటేశ్వరావు లు ఉన్నారు.

Sunday, July 1, 2012

మత్స్యకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం

త్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పదిహేన్ రోజుల్లోగా తిక్కవానిపాలెం మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూడాలని ఎన్‌టీపీసీ యాజమాన్యాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఎన్‌టీపీసీ వల్ల బాధితులైన మత్స్యకారులను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ, షర్మిలాలు ఆదివారం ఉదయం విశాఖ జిల్లాలోని తిక్కవానిపాలెంలో వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు.ఎన్‌టీపీసీ వల్ల మత్స్యకారులు బాధితులుగా మారారని కావున న్యాయం అందించేందుకు యాజమాన్యం సత్వరం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా మత్స్యకారులు వైఎస్‌విజయమ్మకు వినతి పత్రాన్ని సమర్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రె స్ పార్టీ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తుందని వైఎస్ విజయమ్మ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.