Saturday, December 25, 2010

ఉల్లి మరింత ఘాటు

న్యూఢిల్లీ : ఉల్లి ధర మరింత ఘాటెక్కింది. చెన్నై రిటైల్ మార్కెట్‌లో మంగళవారం కేజీ రూ. 85కు చేరింది. మిగతా మహానగరాల్లోనూ రూ. 50-80 మధ్య పలికింది. ఇప్పట్లో ధర తగ్గించలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మార్కెట్ నియంత్రణపై నిస్సహాయత వ్యక్తం చేసింది. ధర ఘాటు మరో మూడు వారాల వరకు కొనసాగనుందని ‘ఉల్లి’ పేల్చింది. పరిస్థితిని కాస్తయినా చక్కదిద్దేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. ధర తగ్గించేందుకు పటిష్ట, సత్వర చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఈ రెండు శాఖలకు లేఖలు రాసింది. ‘ధరను అందుబాటులో ఉంచాలని ప్రధాని కోరారు. పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. హోల్‌సేల్, రిటైల్ ధరల గురించి కూడా ఆయన లేఖల్లో ప్రస్తావించారు’ అని ఓ అధికారి చెప్పారు. ధర పెరుగుదలపై కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కూడా స్పందించారు. ‘రెండు, మూడు వారాల వరకు ఉల్లి ధర భారీగానే ఉండబోతోంది. ఆ తర్వాత కాస్త ఉపశమనం ఉంటుంది’ అని ఢిల్లీలో అన్నారు. ఉల్లి ఎగుమతులపై నిషేధం వల్ల ధరలు తగ్గుతాయన్నారు. ధర పెరుగుదలకు కారణాలేమిటో కూడా వివరించారు. ‘మహారాష్టల్రోని నాసిక్ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల నుంచి రెండు మూడువారాల్లో పంట రావాలి. తర్వాత ధరలు తగ్గుతాయి’ అని అన్నారు. విదేశాల నుంచి దిగుమతి గురించి ఇప్పుడేమీ ఆలోచించట్లేదన్నారు. పాక్ నుంచి సోమవారం 450 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నామని, పంజా బ్ సరిహద్దులో కేజీ ధర రూ. 18-20 మధ్య ఉందని తెలిపారు. కాగా, అక్రమ ఉల్లి నిల్వలపై దాడులు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ రిటైల్ మార్కెట్లో ఉల్లి రూ. 70-80, ముంబైలో 55-60, కోల్‌కతాలో రూ. 60-70 మధ్య పలికింది. కొన్ని రోజుల కింద ఈ నగరాల్లో ఉల్లి రూ. 35-40 మధ్య ఉండేది. ఉల్లి ధర చుక్కలనంటడానికి కారణం ప్రభుత్వ విధానాలేనని బీజేపీ సహా పలు విపక్షాలు విరుచుకుపడ్డాయి. యూపీఏ ప్రభుత్వం పూర్తిగా మార్కెట్ శక్తులకు లొంగిపోయిందని, ఫలితంగా ఉల్లితోపాటు పలు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఢిల్లీలో ఆరోపించారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని దుయ్యబట్టారు. అధికధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పార్లమెంటు తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆర్థిక విధానాలు, కాంగ్రెస్ దుష్పరిపాలన వల్లే ఉల్లి ధర మండుతోందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఉల్లి ధర కొండెక్కిందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోపించారు. అధిక ధరలకు తాము వ్యతిరేకమని యూపీఏ భాగస్వామ్య పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పార్థా ఛటర్జీ కూడా నిర్మొహమాటంగా చెప్పారు. 

No comments:

Post a Comment