Saturday, December 4, 2010

అసంతృప్తిని తొలగించేందుకు దశలవారీ చర్యలు

హైదరాబాద్;శాఖల కేటాయింపుపట్ల కొంతమంది మంత్రుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే అంశంపై ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అసంతృప్త మంత్రులతో గురువారం జరిపిన చర్చల సందర్భంగా ఇప్పటికిప్పుడు శాఖలను మార్చడం సాధ్యం కాదని, కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. శాఖల కేటాయింపులో కొన్నిలోపాలు జరిగిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి అంగీకరించారు. మంత్రుల అసంతృప్తిని తొలగించేందుకు దశలవారీ చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు, ఇందులోభాగంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్‌లకు అదనపు శాఖలను కేటాయించాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసిన అనంతరం మంత్రి వట్టి వసంతకుమార్ బాధ్యతలను చేపట్టనున్నారు. ఆ తర్వాతనే అదనపు శాఖల్ని కేటాయించాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. మంత్రి ధర్మానకు విద్యుత్, మంత్రి వట్టి వసంతకుమార్‌కు వాణిజ్య పన్నుల శాఖలను అదనంగా కేటాయించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. శాఖల కేటాయింపులో మంత్రి ధర్మానకు రోడ్లు, భవనాల శాఖను కేటాయించగా ఇప్పుడు అదనంగా విద్యుత్ శాఖను అప్పగించే అవకాశం ఉంది. అలాగే మంత్రి వట్టి వసంతకుమార్‌కు పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖలను కేటాయించగా ఇప్పుడు అదనంగా వాణిజ్య పన్నుల శాఖను కేటాయించే అవకాశం ఉంది. విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖలు రెండూ ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి. కాగా మంత్రి బొత్స సత్యనారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశం ఉంది.ఇదిలావుంటే, ప్రాధాన్యత కలిగిన శాఖను కేటాయించలేదంటూ అసంతృప్తితో రగిలిపోయిన వసంతకుమార్ కాస్త మెత్తబడ్డారు. ప్రాధాన్యత కలిగిన శాఖ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేసిన వట్టి, తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యిక్షురాలు సోనియాను కలిసి వచ్చిన అనంతరం మంత్రి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సోనియాను కలిసేందుకు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లతో కలిసి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం వట్టితో మంత్రులు బొత్స, ధర్మాన, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పిసిసి ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం భేటీ అయ్యారు. వట్టితో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవికి చేసిన రాజీనామాను వట్టి ఉపసంహరించుకుంటారని, జిల్లా అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని రాజీనామాను ఉప సంహరించుకోనున్నారని ప్రకటించారు. అయితే ఆంధ్రభూమి ప్రతినిధితో వట్టి మాట్లాడుతూ, తన రాజీనామా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సోనియాను కలిసిన తరువాత ఆమె ఏనిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అసంతృప్త మంత్రులు శాఖల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయం గురించి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌కు ఫ్యాక్స్‌లో తమ విశే్లషణ వివరాలు గురువారం పంపించారు. అదే వివరాలను లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావుకు కూడా పంపించి ఆహ్మద్ పటేల్‌కు వివరించాలని కోరారు. ఈమేరకు గురువారం ఆయన ఆహ్మద్ పటేల్‌ను కలిసి వివరించారు. కావూరి శుక్రవారం ఉదయం నగరానికి వచ్చిన నేపథ్యంలో వట్టి, బొత్స, ధర్మానలతో సమావేశమయ్యారు. కాపు కులానికి చెందిన చిరంజీవి పార్టీ పెట్టడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన తమపై తీవ్ర ఒత్తిడి వచ్చిందని వారు వివరించారు. కాపు కులస్థులు అందరూ తమను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి చిరంజీవి పార్టీలో చేరాలని, లేనిపక్షంలో ఎన్నికల్లో తమను ఓడిస్తామని చెప్పారని వివరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో ఎంత ఒత్తిడి వచ్చినా వదల్లేదని, ఎన్నికల్లో చిరంజీవితో పోరాడి గెలుపొందామని వారు వివరించారు. 

No comments:

Post a Comment