Thursday, June 20, 2013

ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం


రదలతో విలవిలలాడిన ఉత్తరాఖండ్ లో సహాయ చర్యలు చేపడుతున్నారు. వాన తెరిపి ఇవ్వడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఇదో జలవిలయం కనీవినీ ఎరుగని జల ప్రళయం కుండపోతగా వర్షం కురిసింది. భాగిరథీ, మందాకిని, అలకనంద పేరేదైనా గంగమ్మ ఉగ్రరూపందాల్చింది. గంగ యమున దాని ఉపనదులు ఏకమైపోయాయి. ఉత్తరాఖండ్ లో ఊళ్లకు ఊళ్లనే ముంచేశాయి. 

ముందస్తుగా వచ్చిన రుతుపవనాలు ఉత్తరాఖండ్ ను ఊహించని దెబ్బ తీశాయి. ఈ స్థాయిలో రాష్ట్రాన్ని ముంచెత్తడం 90ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అందుకే దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఉత్తరాఖండ్ సర్కార్ కేంద్రాన్ని కోరింది.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తరాఖండ్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్రం నుంచి 145 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

రెండు రోజులుగా వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి 22ఆర్మీ హెలికాప్టర్లు దిగాయి. ఉత్తరాఖండ్ లో చిక్కుకుపోయిన 10వేల మందిని కాపాడి సహాయ శిబిరాలకు తరలించారు. మరో 60వేల మంది ఇంకా వరదల్లోనే చిక్కుకున్నారు. కేవలం కేదార్ నాథ్  కొండపైనే 50 మరణించారు. రెండు వారాల క్రితం ఓం నమశ్శివాయ మంత్రాలతో మార్మోగిన కేదార్ నాథ్  కొండ ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. కొండపైకి అనునిత్యం ప్రయాణికుల్ని తీసుకువెళ్లే మూగజీవాలు కూడా గల్లంతయ్యాయి. మొత్తం 5వేల గుర్రాలు, వాటి మాలీల ఆచూకీ తెలియడం లేదు. కేవలం కేదార్ నాథ్ కు వెళ్లే మార్గంలోనే 5 వేల మంది టూరిస్టులు చిక్కుకున్నారు. బద్రీనాథ్ కొండపైన 5 వేల మంది యాత్రికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

చార్ ధామ్ యాత్రలో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్  షిండే తెలిపారు. రాకపోకల పునరుద్ధరణకు సైన్యం, ఇండో టిబెటిన్  సరిహద్దు భద్రతా సిబ్బంది శ్రమిస్తున్నారు

ఉత్తరా ఖండ్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. యాత్రకని వెళ్లి వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్ల పరిస్థితి  దయనీయంగా ఉంది. కొందరి క్షేమ సమాచారం తెలిసినా మరికొందరి జాడే లేదు. వారి వివరాలు తెలీక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాదాపు మూడు వేల మంది తెలుగువారు చార్ ధామ్ యాత్రకు వెళ్లి ఉంటారని అంటున్నా అనధికారికంగా ఈ లెక్క పదివేలకు పైనే ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు తెలుగువారి సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ని ఉత్తరాఖండ్ పంపించింది

Saturday, June 1, 2013

గ్లోకెమ్‌ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం


విశాఖలో(పరవాడ) తృటిలో తప్పిన ముప్పు 
కాలిబూడిదైన ఫార్మా కంపెనీ
బాంబుల్లా పేలిన రియాక్టర్లు, రసాయనాల ట్యాంకులు
గజగజ వణికిన చుట్టు పక్కల ప్రాంతాలు
పరవాడ మొత్తం కమ్ముకున్న దట్టమైన పొగలు
తీవ్ర వాయు కాలుష్యంతో నరకయాతనపడ్డ ప్రజలు














సాయంత్రం(30-05-2013)  4 నుంచి తెల్లవారి 03 గంటల దాకా చెలరేగిన మంటలు
సుమారు 60 కోట్ల మేర ఆస్తినష్టం.. తప్పిన ప్రాణనష్టం
విశాఖ పరవాడలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. గ్లోకెమ్‌ ఫార్మా కంపెనీలో సాయంత్రం 4 గంటకు చెలరేగిన మంటలు తెల్లవారి 03 ప్రాంతంలో అదుపులోకి వచ్చాయి. ఫ్యాక్టరీ మొత్తం బుగ్గిపాలైంది. ఆస్తినష్టం సుమారు 60 కోట్ల మేర  ఉంటుందని సమాచారం.  ప్రాణనష్టం ఏమీ జరగ లేదు. అయితే.. ప్రమాదం ధాటికి చుట్టుపక్కల ప్రాంతాలు వణికిపోయాయి. విశాఖ పరవాడ ప్రాంతం(రాత్రంతా) తెల్లవారే దాకా గజగజ వణికిపోయింది. ఎప్పుడు ఏమవుతుందా అని భయం గుప్పిట్లో కాలం వెళ్లదీసారు.
 ఇక్కడ స్థానికంగా ఉన్న గ్లోకెమ్‌ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో... ఫ్యాక్టరీలోని అన్ని బ్లాకులు బుగ్గి పాలయ్యాయి. రసాయనాలు నిల్వ ఉంచిన వేర్‌హౌజ్ లో  మొదట మంటలు చెలరేగి.. క్రమంగా ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.కంపెనీలోని రియాక్టర్లు..రసాయనాల ట్యాంకులు బాంబుల్లా పేలాయి. వేర్‌హౌజ్‌లో కార్బోహైడ్రేడ్లు నిల్వ ఉంచడంతో వాటికి నిప్పు అంటుకుని ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. తీవ్ర వాయుకాలుష్యంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నరకయాతన పడ్డారు. 
ఫ్యాక్టరీ మొత్తం తగలబడ్డాక కానీ.. మంటలు అదుపులోకి రాలేదు. సాయంత్రం నాలుగు గంటకు మొదలైన మంటలు తెల్లవారి 03 గంటల దాకా  నిప్పులు కక్కాయి. గ్లోకెమ్‌లో ప్రమాదం జరగ్గానే ముందు జాగ్రత్త చర్యలుగా  చుట్టుపక్కల కంపెనీలు మూసి వేశారు. భారీ స్థాయిలో రసాయనాలు నిల్వ ఉంచడం.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే  ఇంత భారీ ప్రమాదం సంభవించిందని నిపుణులంటున్నారు.ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్, మంత్రి గంటా వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ భారీ అగ్ని ప్రమాదంలో  ఎలాంటి ప్రాణనష్టం లేదని జిల్లా కలెక్టర్ శేషాద్రి వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ భారీ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరగక పోవడం తో అథికారులు ఊపిరి పీల్చుకున్నారు ,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుకుంటున్నారు.