Wednesday, December 22, 2010

ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న "దీక్షా"కాలం

వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం "మూడు దీక్షలు ఆరు బంద్"లతో గడగడలాడిపోతోంది. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన పగ్గాలను చేపట్టి నాలుగు నెలలు తిరగకుండానే వైఎస్సార్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇక అప్పట్నుంచి రాష్ట్రంలో రకరకాలు ఉద్యమాలు, ఆ వెంటనే దీక్షలు... అటు పిమ్మట కదిలిస్తే బంద్‌లు. ఇదీ రాష్ట్రంలోని పరిస్థితి.
రాజకీయ కురువృద్ధునిగా పేరు గాంచిన రోశయ్యను పీఠాన్ని అధిష్టింపజేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుదామన్న కాంగ్రెస్ హైకమాండ్‌కు అనూహ్యరీతిలో అనేక చిక్కులు ఎదురయ్యాయి. గత ఏడాది డిసెంబరులో తెరాస చీఫ్ కేసీఆర్ తెలంగాణాకోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను వణికించారు.
ఆ వేడిలో కేంద్రం తెలంగాణాపై ప్రకటన చేయడం, ఆ వెంటనే సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు రేగడంతో రాష్ట్రం అతలాకుతలమైంది. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఏడాది లోపు ప్రకటన చేస్తామని చెప్పడంతో అటు తెలంగాణా ఇటు సీమాంధ్రలో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఆ వెంటనే వైఎస్ జగన్ ఓదార్పు. 
ఈ ఓదార్పు యాత్ర ప్రభుత్వానికే పెను సవాల్‌గా మారింది. ఈ యాత్రపై అధిష్టానం, జగన్‌ల మధ్య చోటుచేసుకున్న అభిప్రాయభేదాలు తీవ్రరూపం దాల్చి జగన్ కాంగ్రెస్ నుంచి వైదొలిగే పరిస్థితి తలెత్తింది. పార్టీ నుంచి వెలుపలికి వచ్చిన జగన్ అవిశ్రాంతంగా రాష్ట్రంలో... ముఖ్యంగా కోస్తాంధ్రను చుట్టేస్తున్నారు. మొన్నటి వర్షాల్లో దెబ్బతిన్న రైతులను పరామర్శించిన జగన్, నష్టపోయిన రైతులకు రూ. 5 వేలు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆ వెంటనే ప్రభుత్వం తన డిమాండ్‌కు అనుగుణంగా స్పందించకుంటే 48 గంటలు దీక్ష చేపడతానని ప్రకటించారు. 
అంతకుముందే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూనే రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తమ పార్టీ చేసిన డిమాండ్‌ను తీర్చాలని నిరవధిక దీక్షకు పూనుకున్నారు. అటు బాబు ఇటు వైఎస్ జగన్ దీక్షల దెబ్బకు అదిరిపోయిన ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పరిహారాల చిట్టాను అటు టీవీల్లోనూ ఇటు పత్రికల్లోనూ ఏకరవు పెడుతోంది.
ఎంత చేసినా తాము చేసిన డిమాండ్లన్నీ పూర్తిగా నెరవేరిస్తేనే దీక్షను విరమిస్తామని తెదేపా అంటుంటే, కృష్ణానది తీరంలో 48 గంటల లక్ష్యదీక్షను చేస్తున్న జగన్ దీక్ష మాత్రం రైతులకై చేసేదిగా కాక రాజకీయ దీక్షగా మారిందనే అపప్రదను మూటగట్టుకుంటోంది. మొత్తమ్మీద తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసమే బాబు - జగన్‌లు ఈ "దీక్ష"ల నాటకాలాడుతున్నారని అధికార పార్టీ విమర్శిస్తోంది. మరి ప్రజల మాటేమిటో...?!!

No comments:

Post a Comment