Monday, December 6, 2010

వైఎస్ఆర్ లేని లోటును భర్తీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

      ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం శరవేగంగా పరుగులు తీస్తున్నారు. దివంగత నేత డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన, చేయాలనుకున్న పథకాలను ఒక్కొక్కటిగా కార్యరూపంలోకి తీసుకు వస్తూ ప్రజలకు వైఎస్ఆర్ లేని లోటును మరిపించే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్ఆర్ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్ ఆశయాలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని రంగారెడ్డి జిల్లా తాండూరులో పర్యటిస్తున్న కిరణ్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.ఎన్ని కష్టనష్టాలెదురైనా ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా రూ. 4,500 కోట్లు ఖర్చు చేస్తోందని, అది గత ఏడాది గరిష్టంగా రూ. 6 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. ఈ ఉచిత విద్యుత్ పథకం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా కొనసాగించి తీరుతామని కిరణ్ చెప్పారు.గడచిన ఐదేళ్ళలో 51 లక్షల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం పూర్తయిందని, మరో 14 లక్షల ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. రంగారెడ్డిలో పదికోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రాజీవ్ గృహకల్ప నివాసాలు, రెండు కోట్ల రూపాయలతో ప్రణాళికతో శంకుస్థాపన చేసిన సబ్ స్టేషన్ నిర్మాణం వంటి వైఎస్‌ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తుచేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

No comments:

Post a Comment