Saturday, December 4, 2010

తిరుపతి;ఈ నెల 17న వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 6 గంటల నుండి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందని టిటిడి ఇఓ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది శుక్రవారం రావటంతో ఆ రోజున స్వామివారి మూలవిరాట్టుకు అభిషేకం సమర్పణ కార్యక్రమాలు నిర్వహించవలసి ఉన్నందున మూడు గంటలు ఆలస్యంగా దర్శనం ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 6 నుండి 7 గంటల మధ్య విఐపిల దర్శనం ఉంటుందన్నారు. విఐపి దర్శనం కేవలం 1500 పాసులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు తెలిపారు. ఇక సామాన్య భక్తుల సర్వదర్శనం, కాలినడక దివ్యదర్శనం ఒకే సారి ఉదయం 7 గంటల నుండి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుందన్నారు. ఇక వైకుంఠ ద్వారాలు ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకూ తెరిచే వుంటాయని తెలిపారు. వైకుంఠ ద్వాదశినాడు 18వ తేదిన కూడా ఈ అవకాశం ఉంటుందన్నారు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనాన్ని కల్పించడం లేదన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున వికలాంగులకు, వృద్ధులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ఎటువంటి ప్రత్యేక దర్శనాన్ని కల్పించడం లేదన్నారు.తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం మంగళ, బుధవారాల్లో అమలుచేస్తున్న లఘు దర్శనం ఇకముందు కూడా కొనసాగిస్తామని టిటిడి ఇఓ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. 85 వేల మంది భక్తుల్లో ఏ వందమందో అసహనం వ్యక్తం చేస్తున్నారని ఈ విధానాన్ని మార్చాలనుకోవటం సరి కాదన్నారు. ఎవైనా లోటుపాట్లు వుంటే వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

No comments:

Post a Comment