Monday, December 20, 2010

రైతుకు న్యాయం జరిగేవరకూ నిరాహారదీక్ష ఆగదు,

రైతుకు న్యాయం జరిగేవరకూ నిరాహారదీక్ష ఆగదు,
నన్ను బలవంతంగా ఎత్తుకువచ్చారు,
ఇది పోలీసుల దమననీతికి నిదర్శనం,
ప్రభుత్వపద్ధతిపై చంద్రబాబు ఆగ్రహం
హైదరాబాద్; రైతు సమస్యలు తీరేవరకూ నిరాహారదీక్ష ఆగదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు స్పష్టం చేశారు. సోమవారం తె ల్లవారుఝామున పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసి తీసుకువచ్చారని, ఇది పోలీసుల దమననీతికి నిదర్శనం అని ఆయన తీవ్రంగావిమర్శించారు.
నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబును అరెస్టు చేయడానికి పోలీసులు ఆదివారం రాత్రే మూడుసార్లు ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు తమ వ్యూహాన్ని వాయిదా వేసుకున్నారు. అనంతరం తెల్లవారుఝామున పోలీసులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులమధ్య బాబును అరెస్టు చే సి నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.ఆస్పత్రిలో సైతం బాబు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన దీక్ష విరమించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆయన త్రోసిపుచ్చారు. రైతులకు న్యాయం జరిగేవరకూ దీక్ష కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఆస్పత్రినుంచే బాబు రైతులకు ఒక బహిరంగా లేఖ రాస్తూ ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని, తెలుగుదేశం మీ వెన్నంటి ఉంటుంది అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని సంఘటితంగా ఎదిరించి డిమాండ్లు సాధించుకుందాం అని కూడా ఆయన ఆ లేఖలో పిలుపు ఇచ్చారు.
హైడ్రామా నడుమ చంద్రబాబు దీక్ష భగ్నం, అరెస్టు
క్షీణించిన ఆరోగ్యం.. నిమ్స్‌కు తరలింపు
రైతు సమస్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షను పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. అనంతరం అరెస్ట్ చేశారు. బాబు ఆరోగ్య పరిస్థితి క్షీణంచటంతో నిమ్స్‌కు తరలించారు. చంద్రబాబును తరలిస్తున్న సమయంలో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది.నేతలు పోలీసులను అడ్డుకోవడంతో స్వల్ప లాఠీచార్జీ జరిగింది. ఈ ఘటనలో పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు గాయాలయ్యాయి. ఈ తోపులాటలో చంద్రబాబు తనయుడు నారాలోకేష్ నాయుడుని కూడా పోలీసులు ఈడ్చీవేశారు. దీంతో లోకేష్ నుదిటిపై స్వల్పగాయమయింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో పోలీసులు నిర్లక్షంగా ప్రవర్తించడంతో ఆయనను స్ట్రెచర్‌పై తరలిస్తుండగా జారిపడ్డారు.బాబుపై ఐపీసీ సెక్షన్ 309 కింద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయగా, అరెస్ట్‌ను అడ్డుకున్నందుకుగాను నారా లోకేష్, దీక్ష శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గత అర్ధరాత్రి నుంచి దీక్షా శిబిరం వద్ద పోలీసులు జరిగిన ఘటనకు, అరెస్టులు, కేసుల నమోదుకు నిరసనగా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, సోమవారం రాష్ట్రవ్యాప్తబంద్‌కు పిలుపునిచ్చారు. కాగా చంద్రబాబు అరెస్ట్‌ను సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్ పార్టీ నేతలు ఖండించారు. ఈరోజు బంద్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. బంద్ విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు నారాయణ, రాఘవులు, మందకృష్ణ మాదిగలు పిలుపు నిచ్చారు.

No comments:

Post a Comment