Sunday, December 12, 2010

జలయజ్ఞంలో ఎంతనొక్కారు...?

ఇప్పటికే రెండుసార్లు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖలు సంధించి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీమంత్రి, పరకాల శాసన సభ్యురాలు కొండా సురేఖ తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ఆప్తమిత్రుడైన కె.వి.పి. పై ఘాటైన విమర్శలతో లేఖాస్త్రం సంధించారు. మా శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అనేమాట వైఎస్‌ఆర్‌ చెబితే ఆయన ప్రాణస్నేహితుడైన కెవిపి రాంచందర్‌రావు ఆ మహావృక్షంక్రింద కలుపుమొక్కగా మారారని సురేఖ ఘాటైన విమర్శలు చేశారు. ఈమేరకు కెవిపి రాంచందర్‌రావుకు రాసిన నాలుగుపేజీల సుదీర్ఘ లేఖను ఆమె శుక్రవారం పత్రికలకు విడుదలచేశారు. కెవిపి వ్యవహారశైలిని, నైతికతను, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఆమె లేఖలో తూర్పారపట్టారు. వరంగల్‌ జిల్లాలో జగన్‌వర్గీయురాలిగా ముద్రపడిన ఏకైక శాసన సభ్యురాలుగా, వైఎస్‌ కుటుంబానికి విధేయురాలుగా ఉంటున్న సురేఖ తాజాగా కెవిపిపై విమర్శనాస్త్రాలు సంధించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.వైఎస్సార్‌ బలహీనతను తన రాజకీయ, ఆర్ధిక ఉన్నతికోసం కెవిపి వాడుకున్నారని, వైఎస్సార్‌ను నమ్మించి వంచించిన విశ్వాస ఘాతకుడు కె.వి.పి అని ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ సలహదారుగా ఉండి ప్రభుత్వానికీ, ప్రజలకు చేసిన సూచనలు, సలహాలు ఏమిటన్నది ప్రజలకు తెలపాలని ఆమె కెవిపిని డిమాండ్‌ చేశారు. కేవలం కాంట్రాక్టులు ఇప్పించడం, జలయజ్ఞం కార్యక్రమంలో ఎన్ని కంపెనీలకు ఏవిధంగా కాంట్రాక్టులు ఇప్పించి ఎంత దండుకున్నారో ప్రాణస్నేహితునికి కూడా తెలియనివ్వకుండా తెలివిగల బ్రోకరుగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. నమ్మినవాళ్లకు ఎంతైనా, ఏదైనా చేస్తారన్న వైఎస్సార్‌ బలహీనతను బూచిగా చూపి జలయజ్ఞానికి తూట్లు పొడిచి కోట్ల రూపాయలు సంపాదించి దివంగత మహానేతకు చెడ్డపేరు తెచ్చారని కె.వి.పిపై సురేఖ నిప్పులుచెరిగారు. ఏనాడైనా ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే ఏ ఒక్క సలహానైనా ఇవ్వగలిగారా అని ఆమె ఈ సందర్భంగా ప్ర శ్నించారు.ప్రజాధనాన్ని దోచుకునే విధంగా కెవిపి సలహాలు ఇచ్చి ప్రజల సొమ్మును ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసని సురేఖ స్ఫష్టంచేశారు. భద్రత సలహాదారులుగా ఉన్న కెవిపి దివంగత నేత హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించినప్పుడు ఏం చేశారని ఆమె ఈ సందర్భంగా నిలదీశారు. ఒక ముఖ్యమంత్రి భద్రత చూసుకోవడంలో విఫలమైన కెవిపి వైఎస్‌ మరణానంతరం కూడా ఆ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని సురేఖ ప్రశ్నించారు.. వైఎస్సార్‌ మరణించాడన్న బాధ లేకున్న జగన్‌ను సీఎం చేయాలని సంతకాల సేకరణ చేపట్టి ఆయనను అప్రతిష్టపాలు చేసింది తానేనని ఎందుకు బహిరంగంగా ఒప్పుకోవడం లేదని, జగన్‌సంతకాలు చేయించారని దుష్ప్రచారం జరుగుతున్న ఆ ప్రచారాన్ని వైఎస్సార్‌ స్నేహితునిగా ఎందుకు ఖండించకలేకపోయారని కూడా సురేఖ కె.వి.పిని నిలదీశారు. పదవీ వ్యామోహంతో వైఎస్సార్‌ మరణం తర్వాత అదేపదవిలో ఉంటూ ఢిల్లీలో హైకమాండ్‌ వద్ద, రాష్ట్రంలో రోశయ్య దగ్గర ఉంటూ పార్టీని సర్వనాశనం చేశాడని, జలయజ్ఞానికి తూట్లు పొడుస్తూ తప్పుడు సలహాలు ఇస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆమె విమర్శించారు.''కనీసం వార్డుసభ్యుడుగా ఏనాడైనా పోటీ చేసి గెలిచారా, ప్రజలతో మీకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా..ఎప్పుడైనా సామాన్యప్రజలు మీదగ్గరకు వస్తారా''..అంటూ ఆమె కె.వి.పిని నిలదీశారు. వార్డుమెంబర్‌గాపనికిరాని వ్యక్తిని కేవలం సన్నిహితుడన్న మమకారంతో వైఎస్‌ఆర్‌ మిమ్మల్ని రాజ్యసభకు పంపింది వాస్తవం కాదా.. అని ఆమె ప్రశ్నించారు. ఎందుకూ పనికిరాని కె.వి.పిని డాక్టర్‌ చదివించి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా క్యాబినెట్‌ ర్యాంక్‌ ఇచ్చిన దివంగత వైఎస్సార్‌ కుటుంబంపై గత 13 నెలల కాలంలో వస్తున్న విమర్శలను చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఎందుకూ పనికిరాని మీలాంటి వాళ్లను అందలం ఎక్కిస్తే ఒక స్నేహితునికి ఇచ్చే నివాళి ఇదేనా అని సురేఖ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఫ్రెండ్‌షిప్‌రోజున మీఇద్దరి విషయమై ప్రచురితమైన వ్యాసం చదివి గర్వపడ్డానని, ప్రస్తుతం మీలాంటి నయవంచక నైతిక విలువలు లేని స్నేహితుడు ప్రపంచంలో పగవారికి కూడా ఉండ్డొద్దని తాను, రాష్ట్ర ప్రజలంత భావిస్తున్నారని సురేఖ ఆ లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్‌ భద్రత సలహాదారునిగా ఆయమ మరణానికి కారణమైన మీరు తన భర్త కొండా మురళీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల భద్రత విషయంలో గన్‌మెన్లను తగ్గించడమే సలహాదారులుగా మీ పనేనా అని ఆమె ప్రశ్నించారు. నీతి, నిజాయితీ మానవత విలువలు ఉంటే వైఎస్‌ సీఎం కాకముందు మీ ఆస్తి ఎంత,ప్రస్తుతం మీ ఆస్తి ఎంత...? జలయజ్ఞంలో ఎంత నొక్కారు, కుటీల నీతితో ప్రాణస్నేహితుని కుటుంబాన్ని చీల్చడానికి ఎత్తువేసింది మీరుకాదా, వైఎస్‌. వివేకానందరెడ్డి ఢిల్లీ వెళ్లే ముందు రోజు మీ ఇంట్లో చర్చలుజరపలేదా..అధిష్ఠానానికి మీరు పావుగా ఉపయోగపడలేదా..పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎన్ని ముడుపులు ఇచ్చారు అన్న ప్రశ్నలకు ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని సురేఖ ఆ లేఖలో డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment