Friday, August 24, 2018

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్‌నయ్యర్ కన్నుమూత....

 ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్ కులదీప్‌నయ్యర్ కన్నుమూశారు. 1923 ఆగస్టు 14న జన్మించిన ఆయన ఉర్దూ పత్రిక అంజుమ్‌లో జర్నలిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. ఇందిరాగాందీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అరెస్టు అయి జైలుకు వెళ్లారు. బ్రిటన్ రాయబారిగా పనిచేశారు. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు.
కులదీప్ నయ్యర్ (జ. ఆగస్టు 14 1923, మ. ఆగష్టు 23 2018 ) భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు మరియు రచయిత. తన జీవితకాలంలో చాలాకాలం వామపక్ష రాజకీయ విశ్లేషకులుగా ఉన్నాడు. ఆయన 1997లో భారత పార్లమెంటు లోని రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు.
ఆయన బ్రిటిష్ ఇండియా లోని పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోట్ లో 1923 ఆగస్టు 14న జన్మించాడు. ఆయన తల్లిదంద్రులు పూరన్‌దేవి మరియు గుర్బక్ష్ సింగ్. లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. ఆనర్స్ పూర్తిచేసాడు. తరువాత లాహోర్ లోని లా కళాశాలలో ఎల్.ఎల్.బి పూర్తి చేసాడు,1952 లో ఆయన నార్త్‌వెస్ట్ విశ్వవిద్యాలయం లోని మెడిల్ల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుండి జర్నలిజం చదివాడు,
నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టరుగా పనిచేసాడు. 1975-77 లలో భారత ఎమర్జన్సీలో అరెస్టు అయ్యాడు.ఆయన మానవహక్కుల ఉద్యమకారుడు మరియు శాంతి ఉద్యమకారుడు. 1996లో ఐక్యరాజ్యసమితికి వెళ్ళిన భారతీయ సభ్యులలో ఒకడు. ఆయన 1990లో గ్రేట్ బ్రిటన్ హై కమీషనరుగా నియమింపబడ్డాడు. 1997 ఆగస్టులో భారత పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభకు నామినేట్ చేయబడ్డాడు.

ఆయన 14 భాషలలోని 80 వార్తాపత్రికలలో "ఆప్-ఎడ్" (ఆపోజిట్ టు ద ఎడిటోరియల్) లో రచనలు చేసాడు, అనేక కాలమ్స్ రాసాడు. ఆయన వ్రాసిన పత్రికలలో "ద డైలీ స్టార్", "ద సండే గార్డియన్,"ద న్యూస్ పాకిస్తాన్,"ద స్టేట్స్‌మన్(ఇండియా)",ఎక్స్‌ప్రెస్ ట్రిబూన్(పాకిస్తాన్)" "డాన్ (పాకిస్తాన్)",అనేవి ముఖ్యమైనవి. తెలుగు దినపత్రిక ఈనాడులో లోగుట్టు శీర్షికన ఆయన వ్యాసాలు ప్రచురితమౌతూంటాయి.
2000 సంవత్సరం నుండి ప్రతీ యేటా ఆయన భారత, పాకిస్తాన్‌ల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అమృత్ సర్ లోని ఆట్టారి- వాగా ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నాడు.
శిక్షాకాలం పూర్తయ్యాక కూడా విడుదల కాని భారతదేశ జైళ్ళలో ఉన్న పాకిస్తానీ ఖైదీలు, పాకిస్తాన్ లో ఉన్న భారత ఖైదీలను విడిపించడం కోసం నయ్యర్ పనిచేస్తున్నాడు.నయ్యర్ రాజకీయ వ్యాఖ్యాతగా ప్రస్తుత రాజకీయ సమస్యలపై తన అభిప్రాయాలను వ్రాస్తున్నాడు. ఆయన అన్నా హజారే చేసిన ఉద్యమానికి మద్దతు తెలిపాడు. 1971లో తూర్పు పాకిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలపై పాకిస్తాన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పకపోవటాన్ని నిరసించాడు. పాకిస్తాన్ దురాగతాలే చివరికి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసాయి. భారతదేశానికి పాకిస్తాన్ నుండి స్మగుల్ అవుతున్న మాదకద్రవ్యాల పట్ల కూడా పాకిస్తాన్‌ను నిరసించాడు.





Wednesday, August 22, 2018

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్

సైరా నరసింహారెడ్డి టీజర్

చిరంజీవి బర్త్ డే(ఆగష్టు 22) సందర్భంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. భారత ప్రజలమీద అప్పటి బ్రిటీష్ పాలకుల దాష్టీకాల్ని తెరమీద చూపిస్తూ వాటిని ధైర్యంగా ఎదురొడ్డి నిలిచే ధీరుడి పాత్రలో చిరంజీవి కనిపించారు. భారీ సెట్టింగులతో కూడిన నిర్మాణ విలువలు టీజర్ లో కనిపిస్తున్నాయి. వ్యాపారం నిమిత్తం భారతదేశంలోకి ఎంటరైన ఆంగ్లేయులు యావత్ దేశాన్ని హస్తగతం చేసుకుని పాలిస్తున్న తరుణంలో చెలరేగిన మొట్టమొదటి భారతీయుల తిరుగుబాటుగా టీజర్ లో చెప్పారు.  తెలుగు ప్రజల గడ్డ అయిన రాయలసీమ ప్రాంతంలో స్థానికుడైన సైరా నరసింహారెడ్డి బ్రిటీషర్లపై చేసిన వీరోచిత పోరాటం ఈ సినిమా కథాంశం. ఆగష్టు 21 ఉదయం గం.11.30కు ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
చిరంజీవి 151వ సినిమా అయిన సైరా దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని.. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్  నిర్మిస్తున్నారు. రేసుగుర్రం సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేస్తారు.




Syeraa Teaser

Friday, August 17, 2018

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికు ఘన నివాళి


భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికు ఘన నివాళి
భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి (1924-2018) గురువారం సాయంత్రం ఢిల్లీలోని అఖిల భారత
వైద్య విజ్ఞాన సంస్థలో పరమపదించారు. వాజపేయి గురువారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. వాజపేయి మరణంతో బీజేపీతోపాటు ఇతర పార్టీల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. గత జూన్ నుండి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
 వాజపేయి మరణం పట్ల రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, బీజేపీతోపాటు ఇతర పార్టీల అధినాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. మూడుసార్లు ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వాజపేయి దాదాపు పదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2009లో క్రియాశీల
రాజకీయాల నుండి తప్పుకున్న వాజపేయి లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015లో వాజపేయిని భారతరత్న అవార్డుతో సత్కరించారు. వాజపేయి మొదటిసారి 1996లో ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగారు. రెండోసారి 1998లో మరోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టి 11 నెలలు మాత్రమే కొనసాగారు. అయితే 1999లో ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు మాత్రం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగిన మొదటి కాంగ్రెసేతర నాయకుడయ్యారు. తన అద్భుతమైన ప్రసంగాలతో దేశ ప్రజల ప్రేమాభిమానాలను
చూరగొన్న వాజపేయి మంచి కవి. ఆయన రాసిన ఒక గేయంలో ‘వెనకనుండి దాడి చేయకుండా ధైర్యంగా ముందునుండి తనపై దాడి చేయాలి’ అంటూ మృత్యువును ఆహ్వానించటం గమనార్హం. దేశ భక్తికి మారుపేరైన వాజపేయి హిందూత్వాన్ని సమర్థించటంతోపాటు ఇతర మతాల పట్ల కూడా సమభావాన్ని ప్రదర్శించి అందరి గౌరవాభిమానాలు సంపాదించుకున్న మహోన్నత నాయకుడు. 1939లో రాష్ట్రీయ స్వయ సేవక్ సంఘ్‌లో చేరిన
ఆయన ఆఖరు శ్వాస వరకు ఆర్‌ఎస్‌ఎస్ విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు. రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వెంటనే అణు పరీక్షలు నిర్వహించిన వాజపేయి ఆ వెంటనే పాకిస్తాన్‌తో సంబంధాలు
పెంచుకునేందుకు అత్యున్నత స్థాయిలో కృషి చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన ఆఫీస్‌కు పార్థివ దేహాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో

అంతిమసంస్కారాలు నిర్వహిస్తారు. మరోవైపు మాజీ పీఎం వాజ్‌పేయి మరణంతో 20 రాష్ర్ట ప్రభుత్వాలు, ఆఫీసులకు, స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించడం గమనార్హం.