Saturday, December 18, 2010

రైతు సమస్యలకు బాసటగా బాబు నిరవధిక దీక్ష


         రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు
        తిలకం దిద్ది హారతి ఇచ్చిన సతీమణి భువనేశ్వరి 
       రైతుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానంలో
      మార్పు రావాలని చంద్రబాబు డిమాండ్‌
      పసుపుమయమైన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌
ముందు ప్రకటించిన విధంగానే రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిరవధిక నిరాహారదీక్షను శుక్రవారం ఇక్కడి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌(ఆదర్శ్‌నగర్‌)లో ప్రారంభించారు. ఉదయం 10.20 నిమిషాలకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఓ చెట్టు కింద దీక్షను ప్రారంభించగా, సంఘీభావంగా మరో పదిమంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు చంద్రబాబుతో పాటు దీక్షలో కూర్చున్నారు. చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఉదయం 8.30 గంటలకు సతీమణి భువనేశ్వరి చంద్రబాబుకు నుదుట తిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చి దీక్షకు సాగనంపారు. తనయుడు నారా లోకేష్‌, కోడలు బ్రాహ్మణి, బావమరిది, లోక్‌సభ సభ్యుడు హరికృష్ణ చంద్రబాబు ప్రయాణించే వాహనం దగ్గరకు వచ్చి వీడ్కోలు పలికారు. అక్కడినుంచి నేరుగా అసెంబ్లిdకి వచ్చి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాక అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్ళి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావుకు ఘననివాళులర్పించి అక్కడి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు వెంటరాగా, చంద్రబాబు దీక్షలో కూర్చున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రధాని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. పార్టీ సీనియర్లు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్‌గౌడ్‌, నాగం జనార్దనరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, విజయరామారావు, తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, పయ్యావుల కేశవ్‌, రేవంత్‌రెడ్డి, వై.ఎల్లారెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి, అరవింద్‌కుమార్‌గౌడ్‌, వర్ల రామయ్య, గరికపాటి మోహన్‌రావు, తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పిఎల్‌ శ్రీనివాస్‌, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు దీక్షా శిబిరంలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. వేలాదిగా నాయకులు, కార్యకర్తలు దీక్షా శిబిరానికి తరలిరావడంతో ఆదర్శ్‌నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ అంతా పసుపుమయమైంది.

కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పులు రావాలి : చంద్రబాబు

నిరవధిక నిరాహారదీక్షలో కూర్చున్నాక చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు రావలసిన అవసరం ఉందని ఆయన డిమాండ్‌ చేశారు. విధి లేని పరిస్థితుల్లో తాను గాంధీబాటలో నిరవధిక దీక్షలో కూర్చున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా తనను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. రైతులను ఆదుకోవాలని గత ఏడు రోజులుగా అనేక విధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోవడంతో విధి లేక దీక్ష బాట పట్టానని చంద్రబాబు పేర్కొన్నారు. శాంతియుత మార్గాన్ని ఎంచుకొని నిరాహారదీక్ష చేస్తున్నానని, కనీసం ప్రభుత్వంలో ఇప్పటికైనా మార్పు వచ్చి పేద రైతులను, ప్రజలను ఆదుకుంటుందన్న విశ్వాసం ఉందని ఆయన అన్నారు. వర్షాలు, తుఫాను, వాయుగుండం, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000, వాణిజ్య పంటలు పండించిన రైతులకు రూ.15,000 పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, భారత ఆహారసంస్థను తక్షణమే రంగంలోకి దింపాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో రైతాంగం ముందెన్నడూ లేనంతగా కష్టాల్లో ఉందని, చరిత్రలో ఎప్పుడూ రానంతంగా విపత్తు వచ్చిపడిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాదిలోనే ఐదుసార్లు తుఫాన్లు, వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అరవై లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని చెప్పారు. మరోవైపు పంటలకు తెగుళ్ళు కూడా వచ్చాయని, అయితే తెగుళ్ళ నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వరదల వల్ల పంటలన్నీ సర్వనాశనమయ్యాయని, రైతులకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, వరికి ఎకరాకు రూ.15,000 ఖర్చు పెట్టగా, వాణిజ్య పంటలకు రూ.30,000 నుంచి 40 వేల రూపాయలు ఎకరాకు రైతులు ఖర్చు పెట్టారని చంద్రబాబు చెప్పారు. పొగాకు, మిరప పంటలకు అయితే రూ.70 వేల నుంచి 80 వేలు ఖర్చుచేశారని, ఇందులో రైతులు కొంతమంది ఉండగా, కౌలుదారులు కూడా ఉన్నారని ఆయన అన్నారు. వ్యవసాయంపై రైతులు ఖర్చు పెట్టే డబ్బే కాకుండా పదినుంచి ఇరవై వేల రూపాయలు కౌలుకు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన విపత్తు వల్ల రైతులు, కౌలుదారులు ఇద్దరూ పూర్తిగా మునిగిపోయారనీ, దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, వారి కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, చేతి వృత్తులు, కులవృత్తులు కూడా వర్షాల వల్ల బాగా దెబ్బతిన్నారని, వారిని అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయాలకతీతంగా పోరాడుతున్నా..

తాను చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు ఎటువంటి రాజకీయాలు లేవని, రైతులను ఆదుకునేందుకే ఈ దీక్షను ప్రారంభించానని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా తాము పోరాడుతున్నామనీ, రాజకీయ లబ్ధి ఎంతమాత్రం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు లేవని, తాము కోరుతున్నది న్యాయమైన డిమాండ్లు అని గుర్తుచేశారు. సున్నితమైన రైతు సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలన్నదే తన లక్ష్యమని, ఈ లక్ష్యసాధనలో ప్రతిఒక్కరు తనతో కలిసి రావాలని ఆయన కోరారు.

బాబు అరెస్టుకు యత్నం

అడ్డుకున్న ఎమ్మెల్యేలు లీ స్పీకర్‌ అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్న

రైతుల సమస్యలపై ప్రభుత్వ చర్యను ఖండిస్తూ నిరవధిక నిరాహారదీక్షలో కూర్చునేందుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వస్తున్న తెదేపా అధినేత చంద్రబాబును సెంట్రల్‌జోన్‌ పోలీసులు క్వార్టర్స్‌ ప్రధాన ద్వారం వద్ద అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, రేవంత్‌రెడ్డి, ధూళిపాల నరేంద్ర అడ్డుకోవడంతో డీసీపీ అకున్‌ సబర్వాల్‌ వెనక్కి తగ్గారు. ఎన్‌టిఆర్‌ ఘాట్‌కు వెళ్ళి నివాళులర్పించి అక్కడి నుంచి నేరుగా దీక్షా శిబిరానికి వస్తున్న సమయంలో చంద్రబాబును డీసీపీ సబర్వాల్‌ మరికొంత మంది పోలీసులు అడ్డుకొని అరెస్టు చేస్తామంటూ హెచ్చరించారు. ఇంతలో అక్కడే ఉన్న కేశవ్‌, రేవంత్‌లు చంద్రబాబు వాహన శ్రేణి వద్దకు చేరుకొని తమ నేతను అరెస్టు చేసే అధికారం లేదంటూ ఆయనకు తెగేసి చెప్పారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ప్రజాప్రతినిధులు నివాసం ఉండే ప్రాంతమని, ఈ ప్రాంతం శాసనసభ స్పీకర్‌ పరిధిలో ఉంటుందని, ఒకవేళ అరెస్టు చేయాలంటే స్పీకర్‌ నుంచి అనుమతి తీసుకురావాలని ఎమ్మెల్యేలు డీసీపీకి చెప్పడంతో ఆయన చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టారు. చంద్రబాబు దీక్షకు సంబంధించిన వార్తలను సేకరించేందుకు వచ్చిన పాత్రికేయులను, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేయడంతో ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు రంగప్రవేశం చేశారు. ప్రత్యక్ష ప్రసారాలు ఇచ్చేందుకు సంబంధించిన ఓబి వాహనాలను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనికి అనుమతించమని పోలీసులు హెచ్చరించడంతో పార్టీ నేతలు అడ్డుకొని ఇదెక్కడి నిబంధనలు అంటూ దుయ్యబట్టారు. తమకు ఎలాంటి షరతులు వర్తించవని, ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేశారని, ఎటువంటి అనుమతి లేకుండానే తాము దీక్షను ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని పచ్చిక బయళ్లలో నిరవధిక దీక్షను ప్రారంభించిన చంద్రబాబు ఆ తర్వాత దీక్షకు సంబంధించి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడంతో ఆయన మూడు గంటల తర్వాత ఆ ప్రాంతానికి మారారు. దీక్ష చేసేందుకు అనువైన పెద్ద వేదికను పార్టీ సీనియర్లు గరికపాటి మోహన్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, యనమల రామకృష్ణుడు తదితరులు ఏర్పాటు చేయించారు. తనను చూసేందుకు వచ్చే పార్టీ శ్రేణులను, నాయకులను, కార్యకర్తలను క్యూ ద్వారా వచ్చే ఏర్పాట్లను ప్రత్యేకంగా చేశారు. నిరాహారదీక్ష సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటుచేశారు. ఇందుకోసం ప్రత్యేక కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరిలో ఉన్న చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఎన్‌ఎస్‌జి రక్షణను కూడా పటిష్టం చేశారు. బయట నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని, వ్యక్తులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి శిబిరానికి పోలీసులు పంపిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

No comments:

Post a Comment