Sunday, January 26, 2014

తెలంగాణపై వెనక్కు వెళ్లలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది.తెలంగాణపై కాంగ్రెస్ బిజెపి ది ఒక్కటే మాట...!!!

తెలంగాణపై వెనక్కు వెళ్లలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. మీరు కాకపోతే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది మేమంటూ బిజెపి ఇస్తున్న హామీలు వాళ్లను తెగ టెన్షన్ పెడుతున్నాయి. అందుకే ఎన్నికల్లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లును గట్టెక్కించేందుకు హస్తం పార్టీ స్కెచ్చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు పొడిగించైనా సరే.. మాట నిలబెట్టుకుంటామంటోంది. అటు, విభజనకు ససేమిరా అంటున్న సీఎం కిరణ్‌.. చివరికి రాజ్యసభ ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం జరుగుతున్నా డోన్డ్ కేర్ అంటూ ధిక్కారంతోనే ముందుకెళ్తున్నారు. అధిష్టానం పిలిచినా.. ఢిల్లీ బహుత్ దూర్‌ హై అంటూ తనదైన స్టైల్లో వ్యాఖ్యానిస్తున్నారు. చర్చకు అదనపు సమయం ఇవ్వాలంటూ మరోమారు రాష్ట్రపతికి లేఖ  రాసే ఆలోచనలో ఉన్నారు.

అసెంబ్లీలో చర్చ ముగిసి టి-బిల్లు ఢిల్లీకి చేరడం ఆలస్యం.... వీలైనంత త్వరగా దాన్ని పార్లమెంట్‌లో పట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్‌. ఒకవేళ శాసనసభలో ఓటింగ్ పెట్టి బిల్లు ఓడించి పంపినా.. అంతిమ నిర్ణయం పార్లమెంట్‌కే కట్టబెడుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ దాన్ని ముందుకు నడిపిస్తారని హైకమాండ్ ధీమాగా ఉంది. ఐతే..  ఫిబ్రవరి 5 నుంచి జరుగుతున్న సమావేశాల్లో మొదటి వారం ఇతర కీలక బిల్లుల్ని క్లియర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఫిబ్రవరి రెండవ వారంలో టి-బిల్లు పెట్టేందుకు అందరితోనూ చర్చలు కూడా జరిపారు. బిల్లుపై సవరణలు, ఇతరత్రా అంశాలతో ఇబ్బందులు తలెత్తకుండా వీలైతే సెషన్ పొడిగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ దీనిపై  స్పష్టత కూడా ఇచ్చారు. నిన్నటి కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలోనూ టి-బిల్‌ ప్రస్తావనకు వచ్చినట్టు  సమాచారం.

బిల్లు పాస్ అవ్వాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పెద్దలు అమలు చేస్తున్న వ్యూహం.. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి చేటు తెస్తోంది. ఎవరెన్ని చెప్పినా తన దారి సమైక్యం అంటున్న సీఎం కిరణ్‌.. మళ్లీ హైకమాండ్‌కి హ్యాండ్ ఇచ్చారు. పెద్దల సభకు ఎవర్ని పంపాలో తేలుద్దాం రమ్మని ఢిల్లీ నుంచి పిలుపొచ్చినా.. లైట్ తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఫుల్ బిజీగా ఉన్నాను కాబట్టి రాలేనంటూ మెసేజ్ పెట్టేశారు. మొదట్నుంచి పార్టీ లైన్‌లోనే ఉన్న పీసీసీ చీఫ్ బొత్స మాత్రం.. ఆశావహుల జాబితాతో ఏపీభవన్‌కి చేరారు. ఇవాళ పెద్దల్ని కలిసి అన్ని అంశాలు వివరించనున్నారు. జేసీ లాంటివాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే  ఏం చేయాలన్న దానిపై చర్చించనున్నారు. కిరణ్ రూట్లో వెళ్లి ఓటింగ్‌లో రివర్స్ అయ్యేవాళ్లు ఎంత మందో క్లారిటీ లేనందున.. దీనిపైనా చర్చించనున్నారు. ఐతే, బొత్స తరహాలోనే మరికొందరు సీమాంధ్ర మంత్రులు అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పడం గుడ్డిలో మెల్లనే చెప్పాలి. 

అటు, రాజ్యసభ ఎన్నికల్లో మేముసైతం అంటున్నారు ఏపీఎన్జీవోలు. పార్టీలకు అతీతంగా సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడే వాళ్లను పెద్దల సభకు పంపాలంటున్నారు. ఎత్తుకుపైఎత్తు వేస్తూ.. టి-బిల్లు పాస్ చేసే కసరత్తు చేస్తున్న కాంగ్రెస్‌పై వారు మండిపడుతున్నారు. పార్లమెంట్‌కు బిల్లు వెళ్తే లక్షలాది మందితో జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తామన్నారు అశోక్‌బాబు.

 బిల్లు పాస్ చేసేందుకు అవసరమైతే సెషన్ పొడిగించాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌.. సమైక్యంపై తేడా వస్తే కొత్త పార్టీ జెండా ఎగరేసేందుకు సిద్ధంగా సీఎం కిరణ్‌.. ఇలా పోటాపోటీ వ్యూహాలతో ఫిబ్రవరిని హాట్‌హాట్‌గా మార్చేయబోతున్నారు. మొత్తంగా, వన్‌ ప్లస్ వన్ ఆఫర్ టైప్‌లో.. బిల్లుకు కొత్త పార్టీకి లింకుండడం మరింత కాక పుట్టిస్తోంది.