Sunday, August 23, 2015

సినిమా చేస్తున్నా.....చిరంజీవి...!


ష్టిపూర్తి వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్న మెగాస్టార్ చిరంజీవి తన 60వ బర్త్‌‌డే ని పురస్కరించుకుని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన రాజేకీయ, సినీ విశేషాలను పంచుకున్నారు.తన 150వ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన చిరంజీవి..భారీ అంచనాలు, అసాధారణ పరిస్థితులు ఉన్నందువల్లే కథను ఎంచుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదన్నారు, పూరీ జగన్నాథ్ చెప్పిన కథలో ఫస్టాఫ్ అందరికీ నచ్చిందని, కానీ సెకండాఫ్ పూరికి కూడా నచ్చలేదని చిరు తెలిపారు. కథలో మార్పు చేశాక మా ఇద్దరికీ నచ్చితే ఆయనే (పూరీయే) డైరెక్ట్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు.
 ఇక ప్రేక్షకులు నా నుంచి కోరేది డ్యాన్స్..కాబట్టి డ్యాన్సులు తప్పనిసరి..బన్నీ, రామ్ చరణ్‌‌ల డ్యాన్సుల దూకుడు నిజమే..వాటిని ఛాలెంజింగ్‌‌గా తీసుకుంటా.. కమాన్.. రమ్మనండి.. వాళ్ళని..రఫ్ఫాడిస్తా ..నిజానికి నేను వస్తుంటే వాళ్ళే భయపడుతున్నారు అని మెగా స్టార్ హుషారుగా చమత్కరించారు. సినీ ప్రస్థానం తర్వాత రాజకీయాల్లో కొనసాగుతున్నానని, అయితే ఈ రంగంలో ఏర్పడిన స్తబ్దత వల్లే తాను సినిమా చేయాలని అధిక శాతం మంది ప్రేక్షకులు కోరుతున్నారని ఆయన చెప్పారు. ఈ సమయాన్ని అందుకే వాడుకోవాలని అనుకుంటున్నానని చెప్పిన ఆయన.. రాజకీయాల్లో ఎదురు పోరాటాలు, దెబ్బలు సహజమని, అది నిరంతర పోరాటమని అన్నారు.తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించిన చిరంజీవి-తామిద్దరం ఎప్పుడూ రాజకీయాలగురించి మాట్లాడుకోమని, 
అది తమ మధ్య కుదిరిన ఒప్పందమని తెలిపారు. తన అభిరుచులు, అభిప్రాయాలు నాకన్నా భిన్నమైనవి..అయితే వ్యక్తిగతంగా నాకు  రామ్‌‌చరణ్ ఎంతో పవన్ కళ్యాణ్ కూడా అంతే..పవన్ కూడా నా బిడ్డే అని చిరు వ్యాఖ్యానించారు.కాగా ఏపీకి ప్రత్యేక హోదా గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..ఏపీకి కావలసింది ప్రత్యేక హోదాయేనని, ఎన్ని నిధులు, ప్యాకేజీలు ఇస్తామన్నా అది కేంద్రం దయా దాక్షిణ్యాలపై ఆధారపడినట్టే తప్ప..హక్కుగా సాధించుకోలేమని తాను, తమపార్టీ హోదా కోసం పట్టుబడుతున్నామని ఆయన చెప్పారు. 
కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజు కొంటుందన్న విశ్వాసాన్ని చిరు వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్నారు. గతంలో రెండు సీట్లున్న బీజేపీ అధికారంలోకి వచ్చింది..కాంగ్రెస్ కూడా తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయంగా ఎంతో పరిణతి చెందారని, మీడియా కూడా ఇదే విషయాన్ని అంగీకరించిందని చిరంజీవి చెప్పారు.