Monday, August 27, 2012

జగన్ ఎఫెక్ట్ తో చిరంజీవి బలవుతున్నారా?


కాంగ్రేస్ పార్టీలోని రాజకీయాలకు ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బలికాబోతున్నారా అంటే అవుననే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2014లో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదని... దీంతో చిరంజీవి, ఆయన అభిమానులు ఆశించినట్లుగా ఆయన 'ముఖ్య' కోరిక తీరే అవకాశాలు సన్నగిల్లాయనే వ్యాఖ్యలు ఇప్పటి నుండే వినిపిస్తున్నాయి. సేవే మార్గం - ప్రేమే లక్ష్యం క్యాప్షన్‌తో ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడే ఫెయిల్యూర్ అయ్యారని, ఇక ఆయన లక్ష్యం నెరవేరే అవకాశాలు ఏమాత్రం లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెసులో ఎప్పుడూ గ్రూపు రాజకీయాలు జోరుగా ఉంటాయని, కేవలం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాత్రమే సజావుగా రాష్ట్ర కాంగ్రెసు ఉందని, ఆయనకు ముందు ఆయన తర్వాత కాంగ్రెసు పూర్తిగా కుక్కలు చించిన విస్తరిలాగానే ఉందని, అలాంటి పార్టీలోకి చిరంజీవి వెళ్లడం చేసిన పెద్ద తప్పు అంటున్నారు. సొంత పార్టీ ఉంటేనే ఆయనకు ప్లస్ అయి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెసులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజాధరణ కలిగిన చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలను పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇటీవల కాలంలో చిరంజీవి మాట్లాడుతూ.. తన అభిమానులు తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలపై నేతల మధ్య చర్చ జరుగుతోందట. 2014లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనని అంటున్నారు. కాంగ్రెసు నేతల తీరు చూసినా అది అర్థమవుతుందని చెబుతున్నారు. కొంతకాలం క్రితం మంత్రులు, ఎమ్మెల్యేలు లోకసభ స్థానం వైపు దృష్టి సారించారని, అంతేకాకుండా ఇప్పటికే చాలామంది జగన్ పార్టీలో చేరారని, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఇంకా పెద్ద మొత్తంలో జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
మంత్రివర్గంలోనే ఏడెనిమిది మంది జగన్ వర్గంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని, వారు ఏ క్షణంలోనైనా జగన్ వైపుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు విద్యుత్, ధరల పెరుగుదల వంటి సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని, ఇవన్నీ తరచి చూస్తే కాంగ్రెసుకు 2014లో గడ్డు కాలమేనని చెబుతున్నారు. అలాంటప్పుడు కాంగ్రెసులో ఉన్న చిరంజీవి చేసేదేమీ లేదని, ఆయన అభిమానుల ఆశలు నెరవేరే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. కాంగ్రెసు నేతలలో కూడా వచ్చేసారి తమ పార్టీ గెలుస్తుందనే ఆశలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతో పాటు జగన్ ఎఫెక్ట్ కాంగ్రెసు గెలుపుపై ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెసు పార్టీ గెలిచినా చిరంజీవిని ముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీలో తీవ్ర అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలను కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకే రాష్ట్ర నేతల నుండి అధిష్టానం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏ మేరకు స్వాగతిస్తారనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు.

Sunday, August 26, 2012

ఎస్సీ, ఎస్టీ నిధుల్లో కోత పెట్టబోమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి


స్సీ, ఎస్టీ నిధుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ కోత పెట్టబోమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  సబ్ ప్లాన్ నివేదికను రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీలకు సేవ చేసేది కాంగ్రెస్ పార్టీయేనన్న సిఎం క్షేత్రస్థాయిలో పనులు జరగాలంటే నిఘా తప్పని సరన్నారు.  ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రి వర్గం ఉప సంఘం ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నివేదిక సమర్పించింది. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేసేందుకు సమగ్ర చట్టం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై అధ్యయనానికి ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కేబినెట్ సబ్  కమిటీ భేటీ అయ్యింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్  అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో చర్చించింది. 

అటు సబ్  ప్లాన్  నివేదికను రాష్ట్ర చరిత్రలోనై ఓ మైలురాయిగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ఇప్పటి వరకు వీటిని సక్రమంగా ఖర్చు చేయని మాట వాస్తవేమేనని అంగీకరించారు. ఉప సంఘం అందించిన నివేదికను మంత్రివర్గంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు.  ఇక ముందు ఎస్సీ, ఎస్టీ నిధుల్లో కోత ఉండబోదని ప్రకటించారు. మరోవైపు జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ విజ్ఞప్తి చేశారు. నివేదిక కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్క్ షాపులు నిర్వహించి క్షేత్రస్ఖాయిలో ఎస్సీ, ఎస్టీల సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. నిధులు దుర్వినియోగం కాకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత సబ్  ప్లాన్  నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. 

Sunday, August 19, 2012

గ్రేటర్’ విలీనంపై దుమారం


గర శివార్లలోని 34 గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంపై మరోమారు అగ్గి రాజుకుంది. దీనికి కారణం కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రేటర్ విస్తరణ ఫైలుకు రెక్కలు రావడమే. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరలా ఈ ప్రక్రియకు తెరలేపడంపై (రంగాడ్డిజిల్లా) జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ప్రజల జీవితాలు, మనోభావాలతో ముడిపడి ఉన్న గ్రామాల విలీనంపై తొందరపాటు చర్యలు పనికిరావని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే ముందుగా శివారు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శివారు గ్రామాల ప్రజల నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం అభివృద్ధితో ముడిపెట్టి గ్రామీణ వాతావరణంతో పాటు భిన్న సామాజిక పరిస్థితులు, సెంటిమెంట్లు ఉన్న ప్రజలను జీహెచ్‌ఎంసీలో కలపడం దారునమన్న వాదనలు  బలంగా వినిపిస్తున్నాయి. 

మరోవైపు పెంకుటిళ్లు, అల్పాదాయ వర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్న గ్రామాలను ఉన్న ఫలంగా మహానగరంలో విలీనం చేస్తే తర్వాత ఎదురయ్యే పర్యవసానాలను కూడా గమనించాలని మేథావులు పేర్కొంటున్నారు. వీటన్నింటి కన్నా జిల్లా ఉనికి, స్వయంపాలన తదితర కీలక అంశాలనూ పరిశీలనకు తీసుకోకుండానే ఊరికే అభివృద్ధి అనే ముసుగులో పల్లెలను జీహెచ్‌ఎంసీలో కలపడం అన్యాయమంటున్నారు. దీన్ని ప్రజలెవరూ ఒప్పుకోరని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే, పల్లె ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాలేవీ పట్టించుకోకుండా కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం శివారు గ్రామ పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేసే చర్యలను ప్రతిగటించకపోతే భవిష్యత్తులో జిల్లా ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని విద్యావంతులు, తెలంగాణవాదుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. శివారు గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తే అభివృద్ధి కన్నా ముందు పేదవర్గాల ప్రజలపై పన్నుల భారం ఎక్కువవుతుంథి. 

దీంతో పుట్టిన ఊరిలో ఇప్పటివరకు మూడు పూటలా తిండి ఉన్నా లేకున్నా, కంటినిండా నిద్రపోతున్న వారికి మహానగర మాయా ప్రపంచంలో బతుకు అనునిత్యం నరకమయమవుతుందనేది నూటికి నూరు పాళ్లు నిజం. అభివృద్ధి ముసుగు తొడిగి ఇప్పటికే గ్రేటర్‌లో విలీనం చేసుకున్న శివారు మున్సిపాలిల్లో, మెదక్ జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లో గత రెండున్నరేళ్లుగా కనిపిస్తున్న ప్రగతి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న పుట్టెడు కష్టాలే ఇందుకు తాజా నిదర్శనం. అయితే, ఇన్ని ప్రతిబంధకాలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉండగా, శివారు గ్రామపంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? హైకోర్టు స్టే ఉత్తర్వులు అమల్లో ఉండగా, మున్సిపల్ మంత్రి ఇప్పుడు వీలు కాదని మొత్తుకుంటున్నా..

విలీనానికి ఎవరు తొందరపడుతున్నారు? అసలు ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాల తీర్మాణాలకు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీలో విలీనం ఎవరి కోసం? అని బాధిత గ్రామాల ప్రజలే కాదు, ప్రజాస్వామికవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజల మనోభవాలను పట్టించుకోకుండా, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, ఏకపక్షంగా జీహెచ్‌ఎంసీ విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఆందోళన తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

అడ్డంకులు తొలగిపోకుండానే...
శివారు గ్రామపంచాయతీలను గ్రేటర్‌లో విలీనంపై మొదటినుంచి అభ్యంతరాలు, వివాదాలూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ విషయంలో జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతోనే శివారు గ్రామాల విలీన ప్రక్రియ మొదట్లోనే నిలిచిపోయింది. మరోవైపు ‘గ్రేటర్’ విస్తరణపై స్థానిక ప్రజల మనోభావాలను పట్టించుకోలేదన్న వాదనలూ ఉండనే ఉన్నాయి. అలాగే, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, శివారు గ్రామపంచాయతీల విలీనంపై ప్రతిపాదనలను పలుమార్లు అడ్డగోలుగా మార్చారనే ఆరోపణలు వచ్చాయి. 

ఇందులో ప్రధానంగా  నార్సింగి, శంషాబాద్‌ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. తర్వాత మార్చి రాజేంద్రనగర్ మండంలోని 14 గ్రామపంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కొందరు అప్పట్లోనే కోర్టుకు వెళ్లారు. దీంతో శివారు గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు స్టే విధించింది. ఈ ప్రక్రియపై సమగ్రమైన నివేదికతో కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తానికి ఇలాంటి అవరోధాలతో ‘గ్రేటర్’లో శివారు గ్రామ పంచాయతీల విలీనంతో పాటు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ప్రక్రియ  అర్థాంతరంగా నిలిచిపోయింథి.

అయినా, జిల్లా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో శివారు గ్రామాలపై గ్రేటర్ ముప్పు ఎప్పుడు ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళనల్లోనే ఉండిపోయారు. సరిగ్గా ఈ సమయంలోనే వారికి మున్సిపల్‌శాఖ మంత్రి మహీధర్‌డ్డి ప్రకటన కొండంత ధైర్యాన్నిచ్చింది. శివారు గ్రామాలను ఇప్పట్లో గ్రేటర్‌లో విలీనం చేసే చర్యలు ఉండవని, దాంతోపాటే కొత్త మున్సిపాలిటీల ఏర్పాటూ ఉండదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. దీంతో గ్రేటర్ కత్తి వేలాడుతున్న శివారు 34 గ్రామపంచాయతీల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, మంత్రి ప్రకటనను కూడా పట్టించుకోకుండా, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పెండింగ్‌లో ఉన్న శివారు గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేసే ఫైలును ఆఘమేఘాల మీద ప్రభుత్వానికి పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, 

మొదట్లో పంపిన ప్రతిపాదనలివే..

గ్రేటర్ విస్తరణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం మొదట్లో ప్రతిపాదనలు పంపింది. ఇందులో 6 కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను ప్రతిపాదించింది. ఇందుకు అర్బన్‌లోని 34 గ్రామ పంచాయతీలను కలపాలని నిర్ణయించారు. మరో 16 గ్రామ పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. గ్రేటర్‌లో శివారు గ్రామాలను కలిపేందుకు 5 కిలోమీటర్ల పరిధిని ఎంచుకున్నారు. ఈ లెక్కన శంషాబాద్, ఊట్‌పల్లి, తొండుపల్లి, కోత్వాల్‌గూడలను కలిపి శంషాబాద్‌ను నగర పంచాయతీగా ప్రతిపాదించారు.

అలాగే రాజేంద్రనగర్ మండలంలని నార్సింగి, కోకాపేట్, మంచిరేవుల, గండిపేట, వట్టినాగుల పల్లి, ఖానాపూర్‌ను కలిపి నార్సింగి కేంద్రంగా కొత్త మున్సిపాలిటీగా ప్రతిపాదించారు. ఇబ్రహీంపట్నం, జవహర్‌నగర్, బోడుప్పల్, నాగారం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీలుగా చేయాలని ప్రతిపాదనలు పంపారు. ఇక గ్రేటర్‌లో కలిపి గ్రామ పంచాయతీలకు వస్తే అవి.. సరూర్‌నగర్ మండంలోని మీర్‌పేట, జిల్లెలగూడ, బాలాపూర్, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ, పహడీషరీఫ్, పుప్పాల్‌గూడ, మణికొండ, కిస్మత్‌పూర్, బండ్లగూడ, హైదర్షాకోట్, కుత్బుల్లాపూర్ మండలంలోని ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, కొంపల్లి,దూలపల్లి ఉన్నాయి. (సక్సెస్ న్యూస్ ప్రతినిధి) 

Tuesday, August 14, 2012

జగన్ ఆస్తుల కేసులో మరో మంత్రి కు ఉచ్చు...!!?


వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి ధర్మాన రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే వాన్ పిక్ భూకేటాయింపుల్లో  రెవిన్యూ శాఖ మంత్రి హ‍ోదాలో అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ తన చార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది. వాన్ పిక్ భూ కేటాయింపులకు సంబంధించి అప్పట్లో మొత్తం తొమ్మిది జీవోలు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో ధర్మాన పాత్ర కూడా ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది.

సీబీఐ చార్జ్ షీట్ లో తన పేరు నమోదు చేయడంపై ధర్మాన స్పందించారు. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు  జరిపిన ధర్మాన రాజీనామాకే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అయితే చార్జ్ షీట్ పూర్తి వివరాలు తెలిసే వరకు వేచి ఉండమని ధర్మానను ముఖ్యమంత్రి  కోరినట్టు తెలిసింది. ఢిల్లీ నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  

వాన్ పిక్ కేసులో మరో మంత్రి పేరు తెరమీదకు రావడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర  ఆందోళన చెందుతున్నారు. ధర్మాన రాజీనామా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందోనని అగ్రనేతలు కలవరపడుతున్నారు.  

Monday, August 13, 2012

నేటి నుంచి ఏలూరులో 48 గంటలు విజయమ్మ దీక్ష...


ర్హులైన పేద విద్యార్ధులకు ఉన్నత విథ్య అందాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేటి నుంచి రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఎగ్జిబిషణ్ గ్రౌండ్స్ లో దీక్ష చేయనున్నారు. ఫీజులకు సంబంధఇంచి మంత్రి పితాని చేసిన ప్రకటనలో ఏ స్పష్టతా లేనందున ప్రకటించిన ప్రకారమే దీక్ష యధావిధిగా కొనసాగుతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వేదికపై విజయమ్మతో పాటు 200 మంది కూర్చునేలా తీర్చిదిద్దారు. దీక్షలో పాలు పంచుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఫీజు దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుందని ఆపార్టీ తెలిపింది. ప్రత్యేకంగా విద్యార్ధి సంఘాలు, విద్యార్ధులు, తల్లిదండ్రులు సంఘీభావం తెలుపుతున్నారని ఆపార్టీ వెల్లడించింది. దీక్షకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే ను అరెస్టు చేసిన పోలీసులు


శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం(తెలుగుదేశం) ఎమ్మెల్యే సాయిరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్టు యంత్రాల కాల్చివేత ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. 2010 ఏప్రిల్ 30న జరిగిన ఈ ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

2010 ఏప్రిల్ 30వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజక వర్గంలోని సోంపేటలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. సోంపేటలో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించేదుకు ఎన్ సీసీ కంపెనీ ముందుకు వచ్చింది. ఆ రోజున భూమి పూజ మొదలు పెట్టింది. అయితే మొదట్నించీ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న స్తానికులు తిరగబడ్డారు. పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో నీరు కలుషితం అవుతుందనీ....పంటలు నాశనం అవుతాయంటూ భూమి పూజను అడ్డుకున్నారు.

ఇక గ్రామస్తులపై పోలీసులు ఎదురు దాడి చేశారు. రెండు వర్గాల దాడులతో సోంపేట అల్లాడిపోయింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్తితులు రేపిన సోంపేట ఘటనలో 114 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో పది మందిని అరెస్ట్ చేశారు. ఇక అప్పటి ఆందోళనలో పాల్గొన్న ఇచ్చాపురం ఎంఎల్ఎ సాయిరాజ్ పై కేసు పెట్టారు. రెండేళ్ల విచారణ తర్వాత సాయిరాజ్ పై అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతో ఎంఎల్ఏను అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరు పర్చటంతో ఈ నెల 24వ తేదీ వరకూ రిమాండ్ విధించారు.

Tuesday, August 7, 2012

స్వాతంత్రదినోత్సవం - మన బాధ్యత


స్వాతంత్రదినోత్సవం - మన బాధ్యత


ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక సెలవు దినంగా తప్ప పెద్ద ప్రాముఖ్యత లేకుండా పోయింది, ముఖ్యంగా ఈ కాలం పిల్లలకు. నిజానికి మనం జరుపుకునే పండగలన్నిటిలోనూ అగ్రస్థానం ఆక్రమించగల అర్హత ఉన్న పండగ ఇది. మన ముందు తరానికి తెలిసినంతగా స్వాతంత్రం విలువ, స్వాతంత్రదినోత్సవ గొప్పదనం ఈ తరానికి తెలియదేమో!

ఆగస్టు పదిహేను అనంగానే మూడే పండగలు గుర్తుకు వస్తాయి అవి...

1. స్వాతంత్ర దినోత్సవం
2. గాంధీ జయంతి
3. రమణ మహర్షి పుట్టినరోజు

స్కూల్లో జండా వందనం కాగానే గ్రామాల్లోకి పరిగెత్తేవాళ్ళం, అప్పట్లోచొక్కాలకు పెట్టుకునేందుకు చిన్న పరిమాణంలో గుడ్డతో చేసిన జెండాలు అమ్మేవారు. ఇప్పుడు కూడా కాగితముల తో చేసినవి అమ్ముతున్నారు. మేము అప్పట్లో మా ఇళ్ళకుకు వెళ్ళంగానే మా చొక్కాలకు జండాలు ఉన్నాయో లేవో చూసి లేకపోతే కొనుక్కురమ్మని డబ్బిచ్చి పంపేవారు. జండా పెట్టుకుని వచ్చేదాకా వేరే మాట మాట్లాడనిచ్చేవారు కాదు. తర్వాత స్వాతంత్రం అంటే ఏంటో, అది సాధించడానికి మన వాళ్ళు పడ్డ కష్టలేంటో వివరించి చెప్పి, మేము శ్రద్దగా విన్నామో లేదో ప్రశ్నలేసినిర్ధారించుకుని మరీ చాక్లెట్స్ పెట్టేవారు. ముందు తరానికి  గాంథీ గారంటే ఎంత అభిమానమో! 

'ఏం చేసినా చెయ్యకపోయినా స్వాతంత్ర దినోత్సవం నాడు జండా వందనానికి హాజరయ్యి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని,జనగణమణ పాడుకోవడం మన కనీస విధి, అంటే నానా అడ్డమైన పనులూ చేసేసి జనగణమణ పాడెయ్యమని కాదు,మంచిగా ఉంటూ మనకు వీలైనంతలో పక్కవాడికి సాయం చేస్తూనే మనమిలా స్వతంత్రంగా ఉండడానికి అవకాశం కల్పించిన మహానుభావుల గురించి తల్చుకోవాలి ' అని చెప్పేవారు.

ఇప్పటి పిల్లలకు బాల గంగాధర్ తిలక్ ఎవరో తెలియదు, లాల్ బహుదూర్ శాస్త్రి కూడా తెలియదు, అదే రాం చరణ్ తేజ గురించో, అరుంధతి సినిమా గురించో అడిగితే ఠక్కున చెప్తారు. ఇది మనం నిజంగా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. తల్లిదండ్రులందరూ ఈ విషయంలో బాధ్యత తీసుకుని పిల్లలకు మన స్వాతంత్ర సమరయోధుల గురించి చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పి వాళ్ళ మనసుల్లో నాటుకుంటునేలా చెయ్యాలి. తద్వారా వాళ్ళను తలుచుకున్నవారౌతాము, అలాగే మన పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా అది తోడ్పడుతుంది.

లాల్ బహుదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రి గా పని చేసే రోజుల్లో తమిళనాడు లో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసారు. అది ఆయనకు వృత్తి పట్ల ఉన్న బాధ్యత. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ గారు కోర్టులో కేసు వాదిస్తూ ఉండగా భార్య చనిపోయిందని టెలిగ్రాం వస్తే చదువుకుని జేబులో పెట్టుకుని వాదన పూర్తి చేసారు. అది ఆయనకు వృత్తి పట్ల ఉన్న నిబద్దత, అది ఆయన గుండె నిబ్బరం. అందుకే ఆయనను ఉక్కు మనిషి అయ్యారు. మన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ధైర్యముంటే తుపాకి పేల్చమని తెల్లవాడికి గుండె చూపించారు. అది ఆయన ధైర్యం. ఇలా ఎన్నో స్పూర్తిదాయకమైన సంఘటనలున్నాయి మన దేశభక్తుల జీవితాల్లో. ఇవి మనందరికీ తెల్సిన విషయాలే. కాస్త శ్రద్ద చూపించి పిల్లలకు స్పూర్తి కలిగించేలా ఆ మహనీయుల జీవితాల్లోంచి విశెషాలు చెప్పే బాధ్యత సంతోషంగా తీసుకుందాం.

..............................................................................................జైహింద్!