Tuesday, January 31, 2012

విపక్షనేతకు సారీ చెప్పిన సిఏం కిరణ్


* మండలిలో విపక్షనేత దాడి వీరభద్రరావుకు సీఎం ఫోన్ కాల్
* ఉదయం జరిగిన ఘటనకు సారీ చెప్పిన కిరణ్‌కుమార్‌
* జూడాల సమస్యలపై సీఎంను కలిసేందుకు వచ్చిన దాడి
* క్యాంపు ఆఫీసు లోపలికి అనుమతించని భద్రతా సిబ్బంది
* అవమానంపై విచారం వ్యక్తం చేసిన సీఎం
* సీఎం స్పందనతో దీక్ష విరమించే యోచనలో దాడి


శాసనమండలిలో విపక్షనేత దాడి వీరభద్రరావుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సారీ చెప్పారు. ఈ ఉదయం సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చిన వీరభద్రరావును లోపలికి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. జూడాల సమస్యలపై సీఎంను కలిసేందుకు క్యాంపు ఆఫీస్‌కు వెళ్తే... తన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడాన్ని వీరభద్రరావు తప్పుపట్టారు. ఇది మండలిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం కిరణ్‌ కొద్దిసేపటి క్రితం దాడికి ఫోన్‌ చేసి క్షమాపణలు కోరారు.

Monday, January 30, 2012

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌


* ఇకపై ట్రాఫిక్‌ జామ్‌లు ఉండవు 
* గంటల కొద్దీ ప్రయాణం ఉండదు 
* నో పొల్యూషన్‌.. నో హారన్స్‌ 
* గాల్లో ఎగిరిపోవచ్చు 
* ఏసీ ప్రయాణం 
* ఫ్టైట్‌ జర్నీని తలపించే మెట్రో 
* గంటల కొద్దీ ప్రయాణానికి ముగింపు
* సగం సమయం ఆదా 
* తక్కువ ధరలో లగ్జరీ జర్నీ 
* కిలోమీటర్‌కు ఒక స్టాప్‌ 
* మూడు నిమిషాలకు ఒక ట్రైన్‌ 
* సిటీ మొత్తం కవర్‌ అయ్యేలా రూట్‌మ్యాప్‌ 
* ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ 
* ఆటోమేటిక్‌ ట్రైన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 
* అడ్వాన్స్‌ టెక్నాలజీ 
* ఫైర్‌ ప్రూఫ్‌ కంపార్ట్‌మెంట్స్‌ 
* సీసీ కెమెరాలు 
* 100మంది అంతర్జాతీయ ఇంజనీర్లు 

హైదరాబాదీలు సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమ చిరకాల వాంఛ అయిన మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌కు ఫిబ్రవరిలో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది. మెట్రోతో రాజధాని వాసుల జీవన శైలి అమాంతం మారనుంది. ప్రపంచంలో ఏ మెట్రోకు తీసుపోనంత గొప్పగా మన మెట్రో ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుంటోంది. అతి తక్కువ ధరలో- విలాసవంతమైన, సురక్షితమైన ప్రయాణం సొంతం కానుంది. 

దేశంలోకే విభిన్నమైన మన మెట్రో రైల్‌ ప్రత్యేకతలెన్నో. ఒక్క ప్రాజెక్ట్- ఒకే ఒక్క ప్రాజెక్ట్‌- రాజధాని రూపురేకలను మార్చబోతోంది. నరక ప్రాయమైన నగర ప్రయాణం సుఖమయం అవనుంది. మెట్రో రాకతో... గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్స్‌... పొల్యూషన్‌... రణగొణ ధ్వనుల... రణరంగం నుంచి బయటపడినట్టే. సిగ్నల్స్‌లో గంటల తరబడి వెయిట్‌ చేసే సగటు పౌరుడికి... అమాంతం గాల్లో ఎగిరిపోయి ఈ ట్రాఫిక్‌ నుంచి బయటపడితే ఎంత బాగుండునని ఒక్కసారైనా అనిపించి ఉంటుంది. 

మెట్రో రైల్‌తో ఈ కల నిజం కాబోతోంది. హైదరాబాదీని గాల్లో గమ్య స్థానానికి చేర్చడానికి మెట్రో వస్తోంది. అదీ మరింత వేగంగా.. సౌకర్యంగా. హాయిగా ఏసీ రైల్లో కూర్చొని మీకు నచ్చిన బుక్‌ చదువుకోవచ్చు. లాప్‌టాప్‌ ఆపరేట్‌ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో సౌకర్యాలు మెట్రో సొంతం. ఇప్పుడున్న ట్రాఫిక్‌లో మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌కు ప్రయాణించాలంటే ఎంత లేదన్నా గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. 

అదే మెట్రో అయితే జస్ట్‌ 45మినిట్స్‌లో చేరుకోవచ్చు. అంటే సగం సమయం ఆదా అన్నమాట. అదీ ఎలాంటి అలసట లేకుండా.. హాయిగా.. చల్లగా. అలాగని మెట్రో ప్రయాణం.. ఖరీదైనదేమో అనుకుంటే పొరబాటే. 8 నుంచి 19 రూపాయల మధ్య టికెట్‌ రేట్లను ఫిక్స్‌ చేశారు. ప్రతీ కిలో మీటర్‌కు ఒక స్టాప్‌ ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్‌లో అర నిమిషం పాటు రైల్‌ ఆగుతుంది. రైలు ఆగినప్పుడు మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. 

ప్రతీ మూడు నుంచి ఐదు నిమిషాలకు ఒక ట్రైన్‌ అందుబాటులో ఉంటుంది. అందుకోసం మొత్తం 72 రైళ్లను నడపనున్నారు. దిల్‌సుఖ్‌నగర్, కోఠి, ఇమ్లిబన్‌, ఛార్మినార్‌, ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌, జూబ్లీ బస్‌ స్టేషన్‌, బేగం పేట్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణ గూడా, ఖైరతాబాద్‌, అమీర్‌ పేట్‌, బాలానగర్‌, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, మియాపూర్‌... ఇలా నగరంలోని అన్ని ప్రాంతాలు కవర్‌ అయ్యేలా రూట్‌ మ్యాప్‌ రూపొందించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ డిజైన్‌, టెక్నాలజీలో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ మెయింటెన్‌ చేస్తున్నారు. 

ఆటోమేటిక్‌ ట్రైన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, పట్టాలు తప్పకుండా అడ్వాన్స్‌ టెక్నాలజీ, అగ్ని ప్రమాదాలను తట్టుకునే బోగీలు, సీసీ కెమెరాల నిఘా... ఇలా ఎన్నో ఫీచర్స్‌ అండ్‌ సెక్యూరిటీ మెజర్స్‌... ఫాలో అవుతున్నారు. మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100మంది ప్రముఖ ఇంజనీర్లతో పాటు మూడు కారిడార్లలో నిర్మించే స్టేషన్ల డిజైన్‌ కోసం మూడు దేశాలకు చెందిన టాప్‌ ఆర్కిటెక్ట్స్‌ ను ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ నియమించుకుంది. 

దేశంలోకే కాదు.. ప్రపంచంలోని ఏ మెట్రో రైల్‌కు తీసిపోని విధంగా రూపొందబొతున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ‌... 2014కల్లా భాగ్యనగరం మెడలో మెరవనుంది. 

Thursday, January 26, 2012

రెప్పవాల్చని భద్రత

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉందన్న ఇంటెలిజన్స్ వర్గాల హెచ్చరికలతో దేశ రాజధాని ఢిల్లీ నగరం భద్రతాబలగాల కాపలా మధ్య దుర్భేద్యమైన కోటలాగా మారిపోయింది. ఎన్‌ఎస్‌జికి చెందిన షార్ప్ షూటర్లు, పారా మిలటరీ బలగాలతో పాటుగా సుమారు 25 వేల మంది పోలీసులను ప్రధాన కార్యక్రమం అయిన రిపబ్లిక్ డే పరేడ్ జరిగే ప్రాంతంలో మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా గురువారం ఉదయం 11 గంటల 15 నిమిషాలనుంచి గంట సేపుఢిల్లీ గగన తలాన్ని విమానాల రాకపోకలకు మూసివేసారు. ఎత్తయిన భవానలపైన గురి చూసి కాల్చగల నిపుణులను మోహరించడంతో పాటుగా పరేడ్ సాగే రాజ్‌పథ్‌నుంచి ఎరక్రోట వరకు ఉన్న మార్గంలో జనం కదలికలపై నిఘా పెట్టి ఉంచడానికి 160కి పైగా క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలను ఏర్పాటు చేసారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో మొబైల్ హిట్ టీమ్‌లు, విమాన విధ్వంసక తుపాకులు, ఎన్‌ఎస్‌జికి చెందిన షార్ప్ షూటర్ల నిఘాను ఏర్పాటు చేసారు. కాగా, రైసానా సిల్స్‌నుంచి ఎర్రకోట వరకు రిపబ్లిక్ పరేడ్ సాగే ఎనిమిది కిలోమీటర్ల మార్గం పొడవునా ఢిల్లీ పోలీసు కమాండోలు గట్టి నిఘా పెట్టి ఉంచనున్నారు. రాష్టప్రతి ప్రతిభా పాటిల్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పరేడ్‌లో పాల్గొనే వారినుంచి వందనాన్ని స్వీకరించే రాజ్‌పథ్ వద్ద వివిధ అంచెల భద్రతా వలయాలను ఏర్పాటు చేసారు. రాష్టప్రతితో పాటుగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన థాయిలాండ్ తొలి మహిళా ప్రధాని ఇంగ్లుక్ షినవత్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లోను భధ్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసారు. కాగా, తీవ్రవాదులనుంచి ముప్పు పొంచి ఉన్న జమ్మూ, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా మహారాష్టల్రోని గణతంత్ర దినోత్సవాలకోసం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసారు.

Thursday, January 19, 2012

కొత్త మంత్రులుగా పీఆర్పీకి చెందిన ఇద్దరు నేతల ప్రమాణ స్వీకారం



కొత్తమంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వద్ద సందడి కనిపించడం లేదు. సాధారణ ఏర్పాట్లతో మమ అనేపించేలా ప్రమాణస్వీకారం జరిగింది. పీఆర్పీ కి చెందినవారికి మాత్రమే కేబినెట్ లో బెర్తులు ఖాయం కావడంతో కాంగ్రెస్ నేతలు ప్రమాణ స్వీకారాన్ని సీరియస్ గా తీసుకోలేదు.

కొత్త మంత్రులుగా పీఆర్పీకి చెందిన ఇద్దరు నేతల ప్రమాణ స్వీకారం
రామచంద్రయ్యకు విద్యుత్, గంటాకు కమర్షియల్ శాఖల కేటాయింపు
రాష్ట్ర కొత్త మంత్రులుగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన సి. రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11:43 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 11:50 గంటలకు ముగిసింది. 

రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమం చాలా సాధాసీదాగా ముగిసింది. ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ నేత కృష్ణమూర్తి, మండలి చైర్మన్ చక్రపాణి, చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, అల్లు అరవింద్, నాగబాబుతో పాటు పలువురు మంత్రులు, కొద్దిమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కగా సి. రామచంద్రయ్యకు విద్యుత్, గంటా శ్రీనివాసరావుకు కమర్షియల్ టాక్స్ (వాణిజ్యపన్నులు) శాఖలను కేటాయించినట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

Saturday, January 14, 2012

ఊరంతా సంక్రాంతి...ఊరంతా సంక్రాంతి...ఊరంతా సంక్రాంతి....



 ఊరంతా సంక్రాంతి...











చిరంజీవి వైరాగ్యం !


జనవరి 12 : రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇవ్వాలని అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఎంత చేసినా అధికారుల్లో మార్పు రాదన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అరకులో జరుగుతున్న ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల్లో గడచిన రెండు రోజుల నుంచి చిరంజీవి చురుకుగా పాల్గొంటున్నారు. చివరి రోజైన బుధవారం ఆయన ప్రసంగించారు. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు ప్రసూతి సమయంలో తీవ్ర ఇబ్బందిపడుతున్నారని, ఎనస్థీషియా యూనిట్ లేకపోవడం వలన ఈ సమస్య ఎదురవుతోందని తాను గమనించానని అన్నారు. 
గత మూడు సంవత్సరాలుగా ఈ యూనిట్ గురించి తిరుపతి ఎమ్మెల్యేగా వచ్చిన ప్రతి ఆరోగ్య శాఖ మంత్రినీ కోరుకుంటున్నానని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులను కూడా పదేపదే కోరాను. ఇదిగో మంజూరు చేస్తున్నాం.. అదిగో మంజూరు చేస్తున్నాం అని చెపుతున్నారే తప్ప, ఇప్పటి వరకూ ఆ యూనిట్ రాలేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. నాలాంటి వ్యక్తినే అధికారులు పరిగణలోకి తీసుకోనప్పుడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారులు డిటాచ్‌డ్‌గా పనిచేస్తున్నారే తప్ప, చిత్తశుద్ధితో కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 
బాక్సైట్‌పై ఆచితూచి అడుగేయండి!

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగేస్తేనే మంచిదని అన్నారు. ఖనిజ సంపద అన్యాక్రాంతం చేసే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. బాక్సైట్ తవ్వకాల వలన ఇక్కడ వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందని, దీనివలన నదీ జలాలు కూడా ఇంకిపోయే ప్రమాదం ఉందని అన్నారు. గిరిజనులకు ప్రత్యేకించి మేలు చేయకపోయినా ఫరవాలేదని, వారి జీవన విధానాన్ని దెబ్బతీయకుండ చూడాలని చిరంజీవి అన్నారు. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారని, దీంతో గిరిజన తండాల్లోని జనం మరింత బిక్కుబిక్కుమంటున్నారని అన్నారు. అరకుతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, సినిమా షూటింగ్‌లకు వచ్చినప్పుడు ఇక్కడి అందాలే చూశాను తప్ప, ఆ అందాల వెనుక ఉన్న ఆవేదనను చూడలేకపోయానని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి లేక వీరి బతుకులు ఎంత ఛిద్రమైపోయాయో చూస్తే చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ఇవే సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు సభ్యులు పెద్దగా పట్టించుకోరని, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినప్పుడు సమస్యలకు వచ్చినప్పుడు వాస్తవాలను గమనించగలుగుతామని చిరంజీవి చెప్పారు .

Friday, January 6, 2012

చిరు ఇంటికి గులాం


కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌కు శుక్రవారం చిరంజీవి అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సభ్యులను కూడా ఆయన ఆహ్వానించారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌తోపాటు ఆజాద్‌ వెంట పీపీసీ చీఫ్‌ బొత్స, ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, కేవీపీ, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌, షబ్బీర్‌అలీతోపాటు పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు నేతలు హాజరయ్యారు. హైదరాబాద్‌ వచ్చిన ఆజాద్‌ను మర్యాద పూర్వకంగా చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించినట్లు పీఆర్పీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పీఆర్పీకి ఇస్తామన్న మంత్రి, ఇతర పదవుల విషయంలో ఓ స్పష్టత రావడానికి ఈ అల్పాహార విందు ఉపయోగపడుతుందనేది వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.