Tuesday, December 21, 2010

చంద్రబాబును అగౌరవపరిచే ఉద్దేశం లేదు

ఆయన మా జిల్లా నేత: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ; తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును అగౌరవపరిచే ఉద్దేశం ఎవరికీ లేదని ఆయన ఆరోగ్యం రీత్యానే ఆయనను అరెస్టు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేముందు విలేకరులతో మాట్లాడుతూ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా, ముఖ్యంగా తన జిల్లాకు చెందిన నేతగా ఆయనంటే తనకెంతో గౌరవం ఉన్నదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి ఎంత గౌరవం లభిస్తుందో ప్రతిపక్ష నేతకు కూడా అంతే గౌరవం లభిస్తున్నదని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ఆయనను అరెస్టు చేసినప్పుడు పెనుగులాటలో ఏం జరిగిందో తనకు తెలియదని కిరణ్ అన్నారు. చంద్రబాబుతో తాను స్వయంగా మాట్లాడేందుకు ప్రయత్నించానని, 15 నిమిషాలు ఆయన ప్రక్కన ఉన్నవారు, సిఎస్ఓతో మాట్లాడానని, అయినప్పటికీ ఆయన లైన్‌లోకి రాలేదని కిరణ్ చెప్పారు. ఆరోగ్యమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాగా అవినీతిపై ప్లీనరీ సందేశాన్ని తుచ తప్పకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. పేదలకు చెందాల్సిన పథకాలు వారికే చెందాలని తాను ముఖ్యమంత్రి కాగానే తొలి పత్రికా సమావేశంలో ప్రకటించానని అన్నారు. వ్యవస్థను అవినీతి నుంచి ప్రక్షాళన చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే తగిన సమాచారం ఇవ్వమని పార్టీ కార్యకర్తలకు ప్లీనరీలోసోనియా పిలుపు ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు.కాగా పొగాకు, ప్రత్తి, పామాయిల్ ఇతర పంటలకు జరిగిన నష్టం గురించి రాష్ట్ర ఎంపిలు కెఎస్ రావు, రాయపాటి ప్రభృతులు తనను కలిశారని చెప్పారు. జౌళి శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి, సిసిఐ సిఎండితో కూడా చర్చించానని చెప్పారు. త్వరలో జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్ కూడా కలుసుకుని తగిన పరిష్కారం సాధిస్తామని అన్నారు. 

No comments:

Post a Comment