Saturday, December 25, 2010

రాజా, కల్మాడీ ఇళ్ళల్లో సిబిఐ కి దొరికినవి ? (బ్రేకింగ్ న్యూస్)

స్కాం విలువ ఆధారం గా, మొదట రాజా గారి ఇంట్లో దొరికినవి మనవి చేసుకుంటున్నాను. 

1. గత వారం మోర్ సూపర్ మార్కెట్ లో ఉల్లిపాయలు కొన్న రసీదు. 
2. బోర్డింగ్ స్కూల్ లో చదువుతున్న అబ్బాయి ప్రొగ్రెస్స్ రిపోర్ట్ 
3. కరుణానిధి గారి వంశ వృక్షం ఫోటో కాపీ. 
4. ఓ ఐదేళ్ళ క్రితం కనిమొళి గారు పంపిన గ్రీటింగ్ కార్డు 
5. నగర శివార్లలో ఉన్న ఓ దళిత స్కూలుకు రాజా గారు ఇచ్చిన లక్షా డెభ్భై ఆరువేల రూపాయల (ఈ సంఖ్య ఎక్కడో విన్నట్టుంది ? ) విరాళానికి సంభందించిన రసీదు
6. రోబో ఆడియో కాసేట్ మరియు CD కూడాను. 
7. మధు కోడా నుంచి వచ్చిన ఒక ప్రశంసా పత్రం. 

ఇవి కాక, కరంట్ బిల్లులు, పన్ను రసీదులు, మెడికల్ రిపోర్టులు (రాజా గారివి, మరియు కరుణానిధి భార్య గారివి కూడా), పయనీరు పేపర్ కట్టింగులు, నీరా రాడియా పెళ్లి ఫోటోలు మరియు పెటాకుల ఆర్డరు లభించాయి. ఈ పత్రాల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, సిబిఐ వాటిని జప్తు చేసేందుకు హైకోర్టు అనుమతికోసం ఎదురు చూస్తోంది. సిబిఐ కి ఆ హక్కు లేదని, అది చాలా అన్యాయమని, ఇప్పటికే మానవ హక్కుల సంఘాలు, ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి.
దాదాపుగా కల్మాడి గారి ఇంట్లోనూ, ఇలాంటి పత్రాలే లభించినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఎవరో సోనియా, రాహుల్ పేర్లమీద ఉన్న ఎకౌంటు స్టేట్మెంట్స్ దొరికాయి కానీ, ఆ వివరాలు ఈ కేసుకి సంభందించినవి కావని సిబిఐ తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసుని ఇంకా డీప్ గా శోధించడానికి సిబిఐ ప్రత్యేక బృందం, కల్మాడి గారి అమ్మమ్మ గారి ఊరుకి బయలుదేరినట్టు సమాచారం. అక్కడైనా ఆయన స్టడీ సర్టిఫికేట్, కాండక్ట్ సర్టిఫికేట్ లాంటి కీలక పత్రాలు దొరకాలని ఆశిద్దాం.
ఇప్పుడే అందిన మరో ముఖ్యమైన వార్త, కేవలం స్కాం నాయకుల కోసం అపోలో ఆసుపత్రి వారు ఢిల్లీ లో సిబిఐ ఆఫీసు ప్రక్క సందులో ఓ ప్రత్యేక బ్రాంచ్ ని మొదలు పెడుతున్నారు. అదే విధం గా, నిమ్స్ లో నిరాహార దీక్షల వార్డుని వేరే గా మొదలు పెట్టాలని, ఆ వార్డు కేటరింగు కాంట్రాక్టు నాకే ఇవ్వాలని నేను నా బ్లాగ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.

No comments:

Post a Comment