Wednesday, December 22, 2010

జగన్మోహన్ 'లక్ష్యదీక్ష' ఎఫెక్ట్: కాంగ్రెస్ వెన్నులో వణుకు!!!

ఆయన పేరు వైఎస్.జగన్మోహన్ రెడ్డి. దివగంత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు. వైఎస్ జీవించి ఉన్నంత వరకు తండ్రిచాటు బిడ్డగానే పెరిగారు. బాబాయ్ వైఎస్.వివేకానంద రెడ్డి త్యాగం, తండ్రి ప్రోత్సాహంతో కడప పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ కుటుంబ వారసుడిగానే కాకుండా, రాజకీయ వారసుడిగా తెరచాటున ఎదుగుతున్న సమయంలో తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 

వైఎస్ హఠాన్మరణంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఒక్కసారి మారిపోయాయి. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వందల సంఖ్యలో తనువు చాలించారు. వీరి కుటుంబాలను ఆదుకునేందుకు తాను చేపట్టాల్సిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం ససేమిరా అంది. అయినా.. ఓదార్పు యాత్రను కొనసాగించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కష్టాలను చవిచూశారు. 
చివరకు తన బాబాయ్‌కు మంత్రిపదవి ఆశచూపి వైఎస్ కుటుంబంలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నింది. దీంతో తన ఎంపీ పదవిని తృణప్రాయంగా త్యజించారు. తన తల్లితో కూడా రాజీనామా చేయించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు. మరో 30 లేదా 45 రోజుల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంతలో రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. 
ఈ వర్షాలధాటికి రైతాంగానికి అపారనష్టం వాటిల్లింది. రైతుల పరామర్శ పేరుతో ప్రజల మధ్యకు వెళ్లిన జగన్.. రైతుల పడే కష్టాలు చూసి చలించి పోయారు. అక్కడికక్కడే రైతుల పక్షాన 48 గంటల పాటు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. ఆ సమయం రానే వచ్చింది. విజయవాడ పట్టణంలోని కృష్ణానదీ తీరం లక్ష్య దీక్షకు వేదికగా నిలిచింది. 
దీనికి రాష్ట్ర ప్రజలు, రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నిన్నమొన్నటి వరకు తెరచాటున ఉండి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు లక్ష్యదీక్ష వేదికపై ప్రత్యక్షమయ్యారు. అలా.. ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు వేదికపైకి వచ్చారు. వీరిలో ఒకరిద్దరు తెదేపా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాష్ట్రానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ప్రకటించారు. ఈ సంఖ్య మరో 50 మందికి చేరుకోవచ్చని అంచనా. ఇది కాంగ్రెస్ అధినాయకత్వం వెన్నులో వణుకు పుట్టించింది. ఎలాంటి పదవులు, అధికారంలేని ఒక సాధారణ వ్యక్తి వెనుక ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయింది. పార్టీతో తెగతెంపులు చేసుకున్న ఒక వ్యక్తి వెంట ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండటమేమిటని ముక్కున వేలేసుకుంది. భవిష్యత్‌లో తలెత్తే పరిణామాలపై ఆరా తీసింది. 
ఆ తర్వాత ఆగమేఘాలపై రాష్ట్రానికి చెందిన ఎంపీల బృందం ప్రధానితో సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు 400 కోట్ల రూపాయలను అడ్వాన్స్ నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి చేపట్టిన లక్ష్యదీక్ష తొలి రోజునే తన లక్ష్యాన్ని కొంతమేరకు సాధించిందని చెప్పొచ్చు.

No comments:

Post a Comment