Friday, December 17, 2010

కాంగ్రెస్,తెదేపా దద్దమ్మల వల్ల కాదు.. మనం తెచ్చుకోవాల్సిందే

వరంగల్ ఏర్పాటైన మహాగర్జనలో కేసీఆర్ గర్జించారు. తెలంగాణా బిడ్డల ఐకమత్యాన్ని చూసి కేంద్రం దిగి రావాలన్నారు. రాబోయే ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. అనంతరం మాట్లాడుతూ... "భారతదేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో సమ్మక్క సారక్క శౌర్యమా... రాణీ రుద్రమ దేవి సైన్యమా అని తరలివచ్చిన తెలంగాణా ప్రజలకు అభివాదాలు.2001లో క్రూరమైన రాజ్యం నడుస్తుంది. అప్పట్లో నేను ఉద్యమానికి నడుం బిగించాను. ఆరు నెలల తర్వాత అడ్రెస్ దొరకదన్నారు. పది సంవత్సరాల పాటు అనేక ఆటుపోట్ల నడుమ నేను నడిపిన ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నది మీరే. 
పదేళ్ల తర్వాత హైదరాబాద్ ఫ్రీజోన్ అన్నారు. నేను బతికుండగానే తెలంగాణా బిడ్డలకు అన్యాయం జరుగుతుందని, ఆమరణ దీక్షకు వెళతానని అన్నాను. అందరూ వారించారు. కానీ నా ప్రాణాలు ముఖ్యం కాదని "కేసీఆర్ చచ్చుడో... తెలంగాణా వచ్చుడో" అంటూ దీక్షకు వెళ్లాను. ఏ ఊర్లో ఉన్న వాళ్లు ఆ ఊళ్లో కథానాయకులై ముందుకు ఉరకాలన్నాను. అలాగే తెలంగాణా బిడ్డలు కదం తొక్కారు. యూనివర్శిటీలన్నీ యుద్ధభూములుగా మారినాయి. 54 సంవత్సరాల చరిత్రలో రాష్ట్రం ఇస్తామని కేంద్రం ప్రకటించింది. పార్లమెంటులో ఉభయసభల్లోనూ ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది..?ఇవాళ్టికి తెలంగాణా ప్రజలందరూ ఒకటి కావడానికి 54 ఏళ్లు పడితే... సీమాంధ్ర నాయకులకు ఒక్క గంటే పట్టింది. చిరంజీవి, పెద్దజీవి, చిన్నజీవి షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి కేంద్రాన్ని వెనకడుకు వేసేట్లు చేశారు. సీమాంధ్ర నాయకులు ప్రభుత్వాన్ని పడగొడతామని బ్లాక్ మెయిల్ చేశారు. మరి మన తెలంగాణా నాయకులు లేకపోతే ప్రభుత్వం ఉంటుందా...? అని కాంగ్రెస్ నాయకుల ఇంటికి వెళ్లాం. చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్  తెదేపా నాయకులు నాటకలాడారు. వీపు చూపించి పారిపోయారు. వాళ్లు రాజీనామా చేసినట్లయితే ఈనాడు మనకు ఈ స్థితి వచ్చేది కాదు. తెలంగాణలోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల దద్దమ్మలే ఇందుకు కారణం. ప్రజలు తెచ్చుకున్న తెలంగాణాను పోగొట్టారు. ఆంధ్ర ముఖ్యమంత్రులను చూస్తే తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు లాగులు తడుస్తాయి. ఎందుకంత భయం..? రాజీనామా చేసిన వారిని తెలంగాణా ప్రజలు కడుపులో పెట్టుకుని గెలిపించుకోలేదా..? అది మీ కళ్లకు కనబడటం లేదా..?ఈ దద్దమ్మలు, వాజమ్మల వల్ల తెలంగాణా రాదు. మీ వల్లనే తెలంగాణా వస్తుంది. డిసెంబరు 31 దాకా చూద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో అది చేద్దాం... పోలీసులలాఠీలకు.. తూటాలకు భయపడేవారు తెలంగాణాలో లేరు. జై తెలంగాణా.." అంటూ ముగించారు కేసీఆర్.

No comments:

Post a Comment