Friday, December 3, 2010

అధిష్ఠానం చెప్పడంతో మంత్రులు వెనక్కితగ్గారు.

హైదరాబాద్; అధిష్ఠానం జోక్యంతో ఎట్టకేలకు తాత్కాలికంగా చల్లబడింది. మంత్రుల కూర్పులో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి అనుసరించిన వైఖరి పట్ల సీనియర్లు, జూనియర్ మంత్రులు భగ్గుమన్నారు. వారికి నచ్చచెప్పే పనిని ఆర్థిక మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి, రెవెన్యూ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి కె జానారెడ్డిలకు ముఖ్యమంత్రి అప్పగించినా, ఎటువంటి ఫలితం కనిపించలేదు. దీంతో అధిష్ఠానమే రంగంలోకి దిగి అసంతృప్త మంత్రులను, ముఖ్యమంత్రిని మందలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారం పది రోజుల్లో సర్దుబాటు చేస్తామని, అప్పటి వరకూ ఓపిక పట్టాలని అధిష్ఠానం చెప్పడంతో మంత్రులు వెనక్కితగ్గారు. ఒక దశలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు కావాలని మంత్రులు అనుకున్నారు. అయితే మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలని, వివాదంపై ఎవరూ మీడియాకు ఎక్కకూడదని అధిష్ఠానం ఆదేశించింది. దీంతో, గురువారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశానికి అసంతృప్తులు సైతం హాజరయ్యారు. అధిష్ఠానం ఆదేశాలకు తలొగ్గి ప్రస్తుతానికి సర్దుకుపోయేందుకే అసంతృప్త మంత్రులు నిర్ణయించినా, పర్యాటక మంత్రి వట్టి వసంతకుమార్ మాత్రం రాజీనామాకే కట్టుబడి ఉన్నారు. అయితే శాసన సభ్యత్వానికే రాజీనామా చేయాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్న వట్టి, మంత్రి పదవికి చేసిన రాజీనామా విషయంలో మాత్రం రాజీ పడలేదు. తాను ఏ పరిస్థితిలో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వివరించి, ఆమె తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతవరకూ మంత్రివర్గానికి దూరంగా ఉండాలన్న మొదటి నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన నాటకీయ పరిణామాలు ఇలా ఉన్నాయి.

No comments:

Post a Comment