Thursday, November 24, 2016

నోట్లరద్దు విమర్శల పాలవుతుందా...!!?


ప్రజల సొమ్ము జాతీయం చేస్తారా? టైమ్స్‌ ప్రశ్న, విజయం సాధించామంటున్నారా? చీప్‌ జస్టిస్‌ ఠాగూర్‌ పార్లమెంటులో ప్రతిపక్షాల సమిష్టి సమరం సంగతి అటుంచితే మోడీ ప్రభుత్వం నోట్లరద్దు నిర్ణయంపై విపరీతమైన విమర్శల పాలవుతున్నది. ఇందాకటి పోస్టులో వ్యాఖ్యానించినట్టు అగ్ర తెలుగు పత్రిక మినహాయిస్తే మిగిలినవన్నీ విమర్శనాత్మక వైఖరినే తీసుకున్నాయి. బుధవారం(23వ తేదీ) టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సంపాదకీయం చాలా సూటిగా ప్రభుత్వ చర్యను తప్పు పట్టింది. నల్లడబ్బును అంటుకునే చర్యలు తీసుకున్నది లేదు గాని ప్రజల సొమ్మును జాతీయం చేసినట్టు కనిపిస్తుందని ఆ పత్రిక రాసింది. తన రాజకీయ స్వభావాన్ని బట్టి ఇది 1990లకు ముందున్న సరళీకరణ పూర్వపు దశలోకి తీసుకువెళ్లినట్టు కనిపిస్తుందని కూడా రాసింది. ప్రజాపక్ష ఆర్థిక వేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ కూడా మరో కోణంలో ఇలాటి ప్రశ్నే వేశారు. మీరు ఇంతకాలం చెప్పిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఓపెనింగ్‌ లన్నీ ఏమైపోయాయి?సామాన్యులపై సర్జికల్‌ స్ట్రయిక్‌ ఎందుకు? హిందూస్తాన్‌ టైమ్స్‌ కూడా నోట్లరద్దు వల్ల అనుకున్న ఫలితాలు కలిగే అవకాశం లేదని స్పష్టం చేసే చాలా అధ్యయనాలను ఇచ్చింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ, గూగుల్‌ ఇండియా కన్సల్టెన్సీ, మూడీ సంస్థతో సమానమైన ఫిచ్‌, హెచ్‌ఎస్‌బిసి వంటివన్నీ వివరాలతో సహా ఇదే చెబుతున్నాయి. చిన్న వ్యాపారాలకు కరెన్సీ అందుబాటులో లేకపోవడం వల్ల దీర్థకాలిక నష్టం వుంటుందని వీరంతా హెచ్చరిస్తున్నారు. 
ఇక ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కెసి చక్రవర్తి మరింత స్పష్టంగా సోదాహరణంగా ఈ నిర్ణయం దుష్పలితాలు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు రుణాలు ఇచ్చేశక్తి తగ్గి డిపాజిట్లపై ఇవ్వాల్సిన వడ్డీ భారం పెరుగుతుందని ఆయన తెలిపారు. 17 లక్షల కోట్టు నల్లధనం కాదు. అది పన్ను చెల్లింపుదారుల చేతుల్లోకి పోతే తెల్లదే అవుతుంది. అక్రమధనాధిపతులు తమ సొమ్ము చాలా త్వరితంగా ప్రజల చేతుల్లోకి వచ్చేట్టు చేయగలరు. రిజర్వు బ్యాంకు దగ్గరకు ధనం చేరినా అది చెత్తకాగితమే. దాన్ని తిరిగి ముద్రించడానికి చాలా సమయం పడుతుంది. ఇక భారీ రుణ ఎగవేతల విషయంలో ఇప్పటికీ సమాచారం బయిటపెట్టడం లేదు. ఇప్పటికే 4 లక్షల కోట్లు రద్దు చేశారు. మరో 5 లక్షల కోట్టు ఎన్‌పిఎలు అంటున్నారు. ఇంకా రెండు లక్షల కోట్టు రద్దు చేసే అవకాశముంది. ఈ జాబితాలు సక్రమంగా వెల్లడించకుండా మనం నోట్లపై యుద్ధంచేస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక అంచనా ప్రకారం వినిమయ దారీ సరుకులు(ఎఫ్‌ఎంసిజి)వ్యాపారం 30 నుంచి 70శాతం పడిపోయే అవకాశముంది.. హైకోర్టులలో కేసుల నిలిపివేయాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీం కోర్టు ఈరోజు తోసిపుచ్చింది. ప్రజలు ఇన్ని సమస్యల్లో వుంటే తలుపులు ఎలా మూసేయగలననిప్రశ్నించింది.ఇప్పటికే విజయం సాధించామని అటార్జీ జనరల్‌ ముకుల్‌ రోహ్తగి చెప్పగా విజయం సాధించారా అని ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాగూర్‌ ఆక్షేపణగా అడిగారు. సహకార బ్యాంకుల సమస్యలపై గాని ఇతరత్రా అంశాలపై గాని ఎవరైనా దిగువ కోర్టులకు వెళ్లవచ్చని అనుమతినిచ్చింది.

Thursday, November 17, 2016

క్యూలైన్లో అమ్మను సామాన్యప్రజలని నిలబెట్టాడు... అంబానీని వదిలేశాడు!?


మ్మను లైన్ లో నిలబెట్టాడు..కానీ అంబానీని నిలబెట్ట లేకపోయాడు'. ఇదే స్లోగన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పెద్దకరెన్సీ నోట్ల రద్దుతో సామాన్యప్రజలంతా బ్యాంకులకు క్యూకడుతుంటే, నల్లకుబేరులు, బిగ్ షాట్స్ మాత్రం బ్యాంకుల మొఖం కూడా చూడకుండా పనులు కానిచ్చేసు కుంటున్నారు.మోదీ ఝుళిపించిన నల్లకుబేరులపై కొరడా సరాసరి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు తాకుతోందితప్ప, అపర కుబేరులు దగ్గరకి కూడా వెళ్లలేక పోతోందన్నది ఈ స్లోగన్ లోని సారాంశమంటూ కొందరు అంటుంటే, మోదీ తల్లిని బ్యాంక్ క్యూలైన్లో నిలబెట్టాడు గాని, అంబానీని నిలబెట్టలేక పోయాడంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.  

తనకు 32ఎకరాల ఇల్లుండవచ్చట! రాష్ట్ర రాజధానికి మాత్రం 32 వేల ఎకరాలు ఎందుకట!?


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం మీద ఇంతెత్తున ఎగిరిపడ్డారు. నాపై కొందరు కరపత్రాలు వేసి, గతంలో తనెప్పుడో కొందరితో దిగిన ఫొటోలను హైలైట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ఎవరు  చేస్తున్నారో తనకు తెలుసునని ఆయన అన్నాడు. నేను నాన్నకు, (చంద్రబాబు), తాత (ఎన్టీఆర్) కు చెడ్డపేరు తెస్తానని, మా కుటుంబంలో నాకు, నాన్నకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఈ కరపత్రాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, కానీ అలాంటిదేమీ లేదని ఆయన పేర్కొన్నాడు. నేను కులమతాలకు అతీతంగా పని చేస్తున్నా అన్నారు.
గతంలో విదేశాల్లో చదువుకుంటూ ఇండియాకు వచ్చినప్పుడు చాలా మంది ప్రముఖులను కలిశాను.. ఆ సందర్భంగా వేల ఫొటో లు దిగాను. వాటిలో ఓ రెండు మూడు ఫోటోలు తీసుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని లోకేష్ వాపోయారు. చెయ్యి నొప్పి కారణంగా ఓ రెండు రోజులు పార్టీ నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు తాను హాజరు కాలేదని, అయితే ఈ విషయంలో తనకు, చంద్రబాబుకు మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయంటూ చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని ఆయన అన్నాడు.  ఆ మధ్య ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పతో తాను చేతులు తిప్పుతూ మాట్లాడినంత మాత్రాన.. ఆయనను దుర్భాషలాడానని ఆ ఘటనను తప్పుడుగా చిత్రీకరించారని లోకేష్ విమర్శించారు. రాష్ట్ర రాజధానికి 32 వేల ఎకరాలెందుకని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు.. అయితే బెంగుళూరులో ఆయనకు 32 ఎకరాల ఇల్లుండవచ్చుగానీ రాష్ట్ర రాజధానికి 32 వేల ఎకరాలుండకూడదా అని లోకేష్ ప్రశ్నించారు.