Wednesday, December 29, 2010

ఎక్కువ మంది ప్రజలను సంతృప్తి పరిచేలా నివేదిక: శ్రీకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై తాము చేసిన అధ్యయనంలో తాము సేకరించిన అంశాలను క్రోఢీకరించి ఎక్కువ మంది ప్రజలు సంతృప్తిచెందేలా నివేదికను తయారు చేశామని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఛైర్మన్ జస్టీ శ్రీకృష్ణ తెలిపారు. ఈ కమిటీ సభ్యులు మంగళవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తమ నివేదిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. తమ 11 నెలల విస్తృత అధ్యయనంలో కమిటీకి సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. 
రాష్ట్ర విభజన అంశంపై తాము చేసే సూచనలు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాయన్నారు. నివేదికను రూపొందించడం ప్రసవవేదనలా ఉంటుందన్నారు. పుట్టేది ఆడపిల్లా? మగపిల్లవాడా? అనే విషయం తెలుసుకోవాలని సహజంగానే అందరికీ ఆతృత ఉంటుందన్నారు. నివేదికలోని అంశాల గురించి ఆరాతీయడానికి ప్రయత్నించవద్దని ఆయన మీడియాకు ముందుగానే విజ్ఞప్తి చేశారు. 
నివేదికలో పేర్కొన్న అంశాలను కేంద్రమే వెల్లడిస్తుందని, ఇందుకోసం మరో నాలుగైదు రోజులు వేచి ఉండాలన్నారు. తాము ముందుగా ప్రకటించినట్టుగానే గడువులోగానే అంటే డిసెంబరు 31వ తేదీన తుది నివేదికను కేంద్ర హోంమంత్రి చిదంబరానికి సమర్పించనున్నట్టు తెలిపారు. ఈ నివేదికను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న అన్ని అంశాలను పరిశీలించినట్లు శ్రీకృష్ణ తెలిపారు. 
అయితే, శాంతిభద్రత పరిరక్షణ బాధ్యత మాత్రం రాజకీయనేతలపైనే ఉందన్నారు. నివేదిక అనుకూలంగా ఉన్నా.. వ్యతిరేకంగా ఉన్నా శాంతిభద్రతలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారని, దీనికి కట్టుబడి ఉండాలని కమిటీ సభ్యులు కోరారు. నివేదిక సమర్పించిన తరువాత ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉండదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. 
ఇకపోతే.. కమిటీ సభ్య కార్యదర్శి వీకే.దుగ్గల్ మాట్లాడుతూ.. తమ కమిటీ చేసిన సిఫారసులు నిష్పక్షపాతంగా ఉంటాయన్నారు. నివేదికను రెండు భాగాలుగా ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. నివేదిక భారీగా ఉంటుందని ఆయన తెలిపారు. నివేదిక రూపొందించడం కోసం తాము అన్ని జిల్లాలు తిరిగామని చెప్పారు. ప్రతి అంశాన్ని తూలనాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment