Monday, December 20, 2010

నా తండ్రి లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండేదా: వైఎస్.జగన్ ప్రశ్న!!

తన తండ్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బతికిబట్ట కలిగేదా అని కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తన తండ్రి మండుటెండలో రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర పార్టీకి పునర్జీవం కల్పించారన్నారు. అందుకే 2004లో ప్రజలు పట్టంకట్టారన్నారు. ఆ తర్వాత ఆయన ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మెచ్చి 2009లో ప్రజలు మళ్లీ అధికారాన్ని అప్పగించారని జగన్ చెప్పుకొచ్చారు. సోమవారం జమ్మలమడుగులో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వల్లే కేంద్ర రాష్ట్రాలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన తండ్రి ఎంతో కష్టపడటమే కాకుండా ప్రాణాలు కూడా వదిలారన్నారు. తన తండ్రి మరణాంతరం ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవడం ఆయన పుత్రునిగా తన ధర్మమన్నారు. అందుకే పావురాళ్ళ గుట్టపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టానన్నారు. ఈ యాత్రకు ఎన్నో అడ్డంకులు సృష్టించినా సహించానన్నారు. తన వాళ్లను పార్టీ నుంచి బయటకు పంపించినా ఊరుకున్నానని అన్నారు. కానీ తన కుటుంబాన్ని చీల్చేందుకు సోనియా గాంధే స్వయంగా కుట్ర పన్నడాన్ని జీర్ణించుకోలేక పోయినట్టు చెప్పారు. గత ఏడాదిన్నర కాలంలో తనను, తన కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో అవమానాలకు గురి చేసిందన్నారు. వాటన్నింటినీ దిగమింగి పార్టీలోనే కొనసాగానన్నారు. అయితే, తన బాబాయికి మంత్రిపదవి ఆశచూపి తనను అణగదొక్కేందుకు ఎపుడేతే కుట్ర పన్నారో ఇక ఆ పార్టీలో కొనసాగరాదని నిర్ణయించుకుని బయటకు వచ్చినట్టు స్పష్టం చేశారు. ఏదిఏమైనా.. మరో నెలరోజుల్లో మన పార్టీ వస్తుందన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో సొంత పార్టీపైనే పోటీ చేస్తామన్నారు. ఆ తర్వాత మూడేళ్లు ఓపిక పడితే తర్వాత 30 ఏళ్లు వైఎస్ రాజశేఖరుని పాలన అందించడమే కాకుండా, వందేళ్ళ పాటు వైఎస్ఆర్‌ను మర్చిపోకుండా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అప్పటి వరకు కార్యకర్తలు, నేతలు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment