Wednesday, December 15, 2010

ఆంధ్రప్రదేశ్‌పై పట్టు 'చేయి' జారినట్టేనా: కాంగ్రెస్ మథనం!!!

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిణామాలపై కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్ర మథనపడుతోంది. కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఏపీలో ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఫలితంగా.. ఏపీ రాజకీయాలు 'హ(స్తం)స్తిన'లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో పాటు రాష్ట్ర పెద్దలు వ్యవహారశైలితో విసిగిపోయిన చోటామోటా నేతలు సైతం తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. "పిల్లి పిరికిదైతే ఎలుక ఎకసెక్కాలు ఆడినట్లు" అనే చందంగా చిన్న చిన్న నేతల వ్యవహారశైలి ఉంది. ముఖ్యంగా, కాంగ్రెస్ అధినాయకత్వాన్నే సవాల్ చేసిన యువనేత, ఆ పార్టీ మాజీ రెబల్ స్టార్, పులివెందుల పులిబిడ్డ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మరీ రెచ్చిపోతున్నారు. ఇది అధిష్టానాన్ని మరింత కుంగదీయడమే కాకుండా, ఆందోళనకూ గురి చేస్తోంది. ప్రజానేత వైఎస్ఆర్ జీవించి ఉన్నంత కాలం నిశ్చింతగా గడిపిన హైకమాండ్.. ఇపుడు రాష్ట్ర వ్యవహారాలపై ప్రతి రోజూ సమీక్ష చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో రోజురోజుకూ అదుపుతప్పుతున్న పార్టీ నేతలకు ఎలా కళ్లెం వేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. జగన్‌ వెంట సాగేందుకు నేతలు క్యూ కట్టడం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని మరింత ఆందోళన కలిగిస్తోంది. జగన్ మాయలో పడిన వారిని బుజ్జగించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే కార్యరంగంలోకి దిగారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా తల ఎగురవేసే నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందే కానీ, తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. సొంత పార్టీ నేతల వ్యవహారశైలి ఇలా ఉంటే.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ప్రభుత్వంపై కాలుదువ్వుతున్న వైఎస్.జగన్మోహన్ తలనొప్పి కూడా ఎక్కువైంది. ప్రభుత్వ పనితీరును, గత ఎన్నికల్లో తన తండ్రి ఇచ్చిన వాగ్దానాల అమలును నిలదీస్తూ ప్రజల్లో జెట్‌స్పీడ్ వేగంతో దూసుకెళుతున్నారు. తాజాగా రైతు సమస్యలపై రాష్ట్ర రాజకీయ రాజధాని బెజవాడలో 48 గంటలు నిరాహార దీక్ష చేస్తానంటూ చేసిన ప్రకటన రాష్ట్ర నాయకత్వంలో వణుకు పుట్టిస్తోంది. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనక పోయినప్పటికీ.. జగన్ వెంట జనం బారులు తీరుతుండటాన్ని కాంగ్రెస్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఇదే పరిస్థితి 2014 వరకు కొనసాగిన పక్షంలో కాంగ్రెస్ కంచుకోటల జాబితా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేజారి పోవడం ఖాయమనే తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. అందుకే పార్టీ ట్రబుల్ షూటర్‌, కాంగ్రెస్ భీష్మాచార్యుడుగా అభివర్ణించే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర పరిణామాలపై స్వయంగా ఆరా తీస్తున్నారు. ఆయనతో పాటు.. పార్టీ అధినేత్రి సోనియా గాధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌లు కూడా ఎప్పటికపుడు సమాచారాన్ని సేకరిస్తూ పరిస్థితులను బేరీజు వేస్తూ భవిష్యత్ వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. అయితే, రాజకీయ నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం 2014 నాటికి బలహీనమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటల జాబితా నుంచి ఆంధ్రప్రదేశ్ మాయం కావడం తథ్యమని వారు జోస్యం చెపుతున్నారు.

No comments:

Post a Comment