Friday, December 17, 2010

అందమైన రాష్ట్రం.. అందరికీ న్యాయం చేస్తాం: శ్రీకృష్ణ కమిటీ

 ఆంధ్రప్రదేశ్ చాలా అందమైన రాష్ట్రమని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు వీకే.దుగ్గల్ అభిప్రాయపడ్డారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఈ కమిటీ గురువారం హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెల్సిందే. ఉదయం నుంచి బిజీబిజీగా గడిపిన కమిటీ సాయంత్రం 4.30 గంటలకు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వీకే.దుగ్గల్ మాట్లాడుతూ ఏపీ చాలా అందమైన రాష్ట్రమని, ఇక్కడ ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవన్నారు. అయితే, తాము కేంద్రానికి సమర్పించనున్న నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు చెప్పారు. ఈ నివేదిక ఎలా ఉన్నప్పటికీ ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఈ నివేదిక తయారు చేయడం తమకు ఒక సవాల్‌తో కూడుకున్నదిగా పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేశామని, పూర్తి న్యాయం చేస్తామని భావిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో తమ పర్యటన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు, బ్యూరోక్రాట్లు, మీడియా, ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించిందన్నారు. అంతేకాకుండా ఈనెలాఖరు నాటికి నివేదిక సమర్పిస్తామన్నారు. నివేదిక సమర్పించిన తర్వాత శాంతి భగం కలుగకుండా వ్యవహరించాలన్నారు. గత యేడాది డిసెంబరులో హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయని, ఇవి మళ్లీ పునరావృత్తం కాకుండాఉండేందుకే అందరినీ సంయమనం పాటించాలని కోరుకుంటున్నట్టు కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లో అనేక పరిశోధనలు చేశామన్నారు. అన్ని పార్టీలు, అన్ని వర్గాలను కలిసి సమాచారాన్ని సేకరించామన్నారు. 40 గ్రామాల్లో పర్యటించినట్టు కమిటీ సభ్యురాలు రవీంద్రకౌర్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, కొత్త సంవత్సర శుభాకాంక్షలను జస్టీస్ శ్రీకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులంతా పాల్గొన్నారు

No comments:

Post a Comment