Wednesday, April 24, 2013

విశాఖపట్నంలో వస్తున్నా మీకోసం పాదయాత్ర ......


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. కశింకోట మండలం పిసినికాడ నుంచి ప్రారంభమైన యాత్ర కొత్తూరు కూడలి,ఎన్జీవో కాలనీ సుంకరమెట్ట,శంకరం గ్రామాల మీదుగా కొనసాగింది. పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు. దారివెంట రైతులు, యువకులతో ముచ్చటించారు.
 ప్రభుత్వం అనవసర వివాదాలు సృష్టించకుండా విశాఖ ప్లాంటుకు ఓబులాపురం గనులను కేటాయించి, బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దళితులకు ద్రోహం చేస్తున్న సీఎం కిరణ్ దళిత బంధు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై తమ పార్టీకి స్పష్టత ఉందని,ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సినీనటుడు నందమూరి తారకరత్న బాబుతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. 
అటు చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.  ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా సమావేశంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని భవిష్యత్ తెలుగుదేశం పార్టీదేనని తుమ్మల అన్నారు.
మనిషిని నడిపించేది మైండ్‌సెట్
నిషిని నడిపించేది మైండ్‌సెట్. మైండ్ సెట్ ఎలా ఉంటే మనిషి అటే నడుస్తాడు. అది మంచి మార్గంలో కావచ్చు లేదంటే దుర్మార్గపు ధోరణిలో కావచ్చంటూ తన అనుభవాలను, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను చంద్రబాబు కార్యకర్తల వద్ద వెల్లడించారు. నియోజకవర్గ సమీక్షలో





భాగంగా గాజువాకకు చెందిన యువశ్రీ అనే మహిళా కార్యకర్త మీరు తినరు ఎవరినీ తిననీయరంటూ చేసిన వాఖ్యలపై చంద్రబాబు సుదీర్ఘంగానే స్పందించారు. ఒక ఉన్నతమైన ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చాను. క్రమశిక్షణకు, నిబద్ధతకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నాను. నేను అవినీతి పరుణ్ణయినా, నాఅనుచరులు అవినీతిపరులైనా తెలుగుదేశం పార్టీ ఇప్పుడీ పరిస్థితిలో ఉండేది కాదు. తొమ్మిదేళ్ళు అధికారంలో లేకపోయినా పార్టీకోసం ఊరూరా తిరుగుతున్నాను. ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. నేను అవినీతిపరుణ్ణయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రాజశేఖర రెడ్డి తన విశ్వరూపాన్ని చూపించేవాడు. ఎన్నో కమిషన్లు వేయించాడు. కోర్టుల్లో కేసులు వేయించి వేధించాడు. ఒక్క కేసులో కూడా వారికి సరైన ఆధారం దొరకలేదు. అందుకే ఇప్పుడు మనం ప్రజల దగ్గరకు ధైర్యంగా పోగలుగుతున్నాం. లేదంటే జగన్మోహన రెడ్డి మాదిరి జైల్లో ఉండాల్సి వచ్చేది. ఇక ఒకే మైండ్‌సెట్ ఉన్నవారు ఒకే గూటికి చేరుతారని, అందులో భాగంగానే కొంతమంది పార్టీ లీడర్లు వైకాపాలో చేరుతున్నారని వాఖ్యానించారు. అటువంటి వారు కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమే ఉన్నారన్నారు. టెక్నాలజీ, మోటివేషన్ వంటి అంశాల్లో తాను నిష్ణాతుణ్ణని, తనకు ఎవరూ మభ్యపెట్టలేరని పేర్కొన్నారు.

Saturday, April 20, 2013

చంద్రబాబుకు 64వ జన్మదినం సందర్బంగా............................



నేడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి 64వ జన్మదినం. శుక్రవారం పాదయాత్రలో 200రోజులు పూర్తి చేసుకున్న బాబు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజల మధ్యే  బాబు జన్మదినం జరుపుకుంటారని భావించినా ఢిల్లీలో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటనతో కలత చెందిన ఆయన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

అదే ఉత్సాహం. అదే గుండె నిబ్బరం. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంకా ఏదో చేయాలన్న తపన. 63ఏళ్లు పూర్తి చేసుకుని 64వ ఏట అడుగు పెడుతున్నా నవయువకునిలా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం అధినేతగా, పార్టీ సారథిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇప్పుడు పాదయాత్ర బాటసారిగా బహుముఖ పాత్ర పోషిస్తున్నారు నారా వారు వినూత్న పథకాలతో, ప్రజాకర్షక కార్యక్రమాలతో రాష్ట్రంలో ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుది. దేశ, విదేశాల్లో మన రాష్ట్ర కీర్తి పతాకను రెపరెపలాడించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తల శక్తిని అందించడానికి విశేష కృషి చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని నారావారిపల్లెలో 1950, ఏప్రిల్  20న ఖర్జూరనాయుడు, అమ్మాణమ్మ దంపతులకు జన్మించారు చంద్రబాబు.
వ్యవసాయ ఆధారిత కుటుంబంలో పుట్టినా ఉన్నత చదువులు చదివారు. నారావారిపల్లె చిన్న పల్లెటూరు. పాఠశాల లేదు. అందుకే పక్కనే ఉన్న శేషాపురంలో ప్రాథమిక విద్యను, ఆ తర్వాత తిరుపతి ఎస్ వీ యూనివర్శీటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలతో ఉండే చంద్రబాబు చదువుకొనే రోజుల్లోనే నారావారి పల్లెలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి జన్మభూమి పథకానికి బాటలు వేశారు.

1972లో గ్రామ యువకుల సాయంతో ఐదు కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించి శ్రమదానానికి బీజం వేశారు. విద్యార్థి నాయకుడి ఉన్న రోజుల్లోనే 1978లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంజయ్య మంత్రివర్గంలో మంత్రిపదవి చేపట్టారు. మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్  కూతురు భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత కూడా చంద్రబాబు కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఒకదశలో అధిష్టానం అవకాశమిస్తే తన మామ ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో తెలుగుదేశంలో చేరారు. 

1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఎన్టీఆర్  అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు నాదెండ్ల భాస్కరరావు శిబిరానికి వెళ్లకుండా చంద్రబాబు కీలక పాత్ర పోషించి ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించారు. పార్టీ శ్రేణులకు శిక్షణతో పాటు పార్టీ నిర్మాణంలోనూ బాబుదే ముఖ్యభూమిక అంటారు నేతలు.

1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. ఏడాదయ్యాక పార్టీ, పాలనా వ్యవహారాల్లో లక్ష్మిపార్వతీ జోక్యం పట్ల నాయకుల్లో నిరసన వ్యక్తమైంది. తర్వాత 1995లో చంద్రబాబు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త శకం ప్రారంభమైంది. 

ముఖ్యమంత్రిగా జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంకు ఒప్పందం మేరకు సంస్కరణలకు బీజం వేశారు. సాంకేతిక విప్లవానికి ఆద్యుడిగా నిలిచారు. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరొందారు. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ ఇంతలా అభివృద్ధి చెందడానికి చంద్రబాబే కారణంగా చెబుతారు ఐటీ నిపుణులు. దీంతో పాటు మైక్రోసాఫ్ట్  దిగ్గజం బిల్ గేట్స్ ను, నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ లను రాష్ట్రానికి రప్పించారు. మొత్తంగా పరిపాలనలో తనదైన ముద్ర వేశారు.

తన హయాంలో మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించారు చంద్రబాబు. దీంతో తిరుపతి పర్యటనలో ఉన్న బాబుపై 2003లో మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారాయన. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 2004 అధికారానికి దూరమయ్యారు. 2009ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. రెండుసార్లు అధికారానికి దూరమైనా పార్టీని పటిష్టంగా నిలపడంతో బాబు కృషిని విస్మరించలేమంటారు నేతలు.

ప్రజలు కష్టాల్లో ఉన్నారంటూ వారి సుఖదుఖాలను తెలుసుకునేందుకు ఆరునెలల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు, కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2749కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పార్టీ ఆటుపోట్లను సునాయాసంగా ఎదుర్కోవడంలో, సంక్షోభాలను పరిష్కరించడంలో బాబుది అందెవేసిన చేయి అంటూ ప్రశంసిస్తారు తమ్ముళ్లు.

మొత్తంగా అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు 9ఏళ్ళకు పైగా విపక్షంలోనే ఉన్నారు. పార్టీని, నేతలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. అయితే టీడీపీని లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థుల వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చంద్రబాబు అనుకున్న ఫలితాలు సాధించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏమైనా బాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో పలు రకాల కార్యక్రమాల చేపట్టేందుకు పార్టీ సమాయత్తమవుతుంది. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Saturday, April 13, 2013

దాడి / గంటా శ్రీనివాస్‌ భేటీని రాజకీయం చేస్తున్న మీడియా...!!?


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒకవైపు కాలినొప్పి.. మరోవైపు దాడితో తలనొప్పి తప్పట్లేదు. తెదేపా నేత దాడి వీరభద్రరావు గంటా శ్రీనివాసరావుతో భేటీ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే వీరభద్రరావు మాత్రం తాను పార్టీకి విధేయుడిగానే ఉంటా
నని చెప్తున్నారు. అంతేగాకుండా గంటాతో భేటీ కావడం వెనుక రాజకీయం లేదని వీరభద్రరావు స్పష్టం చేస్తున్నారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంపైనే మంత్రిని కలిశానని చెప్తున్నారు. అయితే రాజకీయ పండితులు మాత్రం చంద్రబాబు బీసీలపై చిన్నచూపు చూడటం ద్వారా దాడి తప్పకుండా అసంతృప్తితోనే ఉన్నారని అందుకే చంద్రబాబు పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో అడుగిడుతున్న వేళ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుతో శుక్రవారం టీడీపీనేత దాడి వీరభద్రరావు సమావేశమై పార్టీకి చిన్నపాటి షాక్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. దాడి ఎదురుదాడిని చంద్రబాబు ఏమేరకు పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Monday, April 1, 2013

కోతలతో కొట్లాటలు...!!!???


కాంగ్రెస్ లో విద్యుత్తు ఛార్జీల దుమారం: సర్కారు వైఖరిపై నేతల మండిపాటు
కరెంట్  చార్జీల పెంపు కాంగ్రెస్  పార్టీలో మంటలు రేపుతోంది. చేతికి గట్టిగా షాక్  తగిలింది. స్వపక్షమే విపక్షంలా మారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్  రెడ్డిని టార్గెట్  చేశాయి.  అటు విపక్షాలు లెఫ్ట్  అండ్  రైట్  సర్కార్ ని దుమ్మెత్తి పోస్తున్నాయి. దీంతో సీఎం వెనక్కి తగ్గారు. పేదలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఛార్జీల పెంపు అంశం అధికార పార్టీలోనూ ప్రకంపనలను సృష్టిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీ నేతలు తప్పబడుతున్నారు. ఇంటా బయ
టా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రాష్ట్ర సర్కారు పునరాలోచనలో పడింది.  ఛార్జీల భారం సామాన్యులపై పడబోదని చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కిరణ్ ప్రకటించారు. ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ లో విద్యుత్తు ఛార్జీల దుమారం
సర్కారు వైఖరిపై నేతల మండిపాటు
ఆజాద్‌కు చిరంజీవి లేఖ
పార్టీకి నష్టం కలుగుతుందన్న వీహెచ్
సామాన్యులపై భారం ఉండదన్న బొత్స
చార్జీల మోత మోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్ణయంపై స్వపక్ష నేతలూ నిరసన స్వరాలు అందుకున్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి చిరంజీవి ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు లేఖ రాయడం పార్టీలో కలకలం రేపుతోంది. విద్యుత్ సమస్య, చార్జీల పెంపు అంశంపై చర్చించేందుకు సత్వరమే 'సమన్వయ కమిటీ' సమావేశం ఏర్పాటు చేయాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఎన్నికల ఏడాదిలో ఇంత భారీ ఎత్తున చార్జీలు పెంచడం వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని చిరంజీవి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్తు ఛార్జీల పెంపు అంశం అధికార కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఛార్జీలను పెంచడాన్ని ఎంపి వివేక్ తప్పుపట్టారు. అదే పనిగా విద్యుత్తు చార్జీలను పెంచడం సిగ్గుచేటన్నారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నికలకు ముందు ఛార్జీలను పెంచితే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. పెంపును నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్కారుపై ముప్పేట దాడి కొనసాగుతున్న నేఫథ ్యంలో కాంగ్రెస్ నేతలు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. ఛార్జీల పెంపును పున:పరిశీలిస్తామని రెవిన్యూ మంత్రి ఎన్ .రఘువీరారెడ్డి  ప్రకటించారు.

మరో వైపు పీసీసీ ఛీప్ బొత్స తన దైన శైలిలో స్పందించారు. చార్జీలు పెంచాలన్న నిర్ణయం తీసుకోక ముందే.. ఉపసంహరణ అంశం ఎలా ప్రస్తావిస్తారంటూ మీడియాతో అన్నారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడీ తీవ్రంకావడంతో చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కిర ణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఛార్జీల పెంపు భారం సామాన్యులపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విపక్షాలు ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఏప్రిల్ 4,5 తేదిల్లో ఛార్జీల పెంపుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సీఎం వ్యాఖ ్యలతో ఛార్జీల పెంపుపై సర్కారు వెనక్కి తగ్గుతున్నట్లే కనిపిస్తోంది.

విద్యుత్తు ఛార్జీల పెంపు అంశం రాష్ట్ర రాజకీయాలను అట్టుడికిస్తోంది. సర్కారు తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఐక్య పోరాటానికి సన్నధ్దమవుతున్నాయి.అటు విద్యుత్తు సమస్యపై బిజేపి చేపట్టిన దీక్షలకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. సిద్దాంత వైరుధ్యాలున్నా ప్రజాసమస్యల విషయంలో  కలిసి ఉద్యమిస్తామని నేతలు వెల్లడించారు.