Sunday, December 26, 2010

రాణించని రాజకీయ పార్టీలు

విశాఖపట్నం:ఈ ఏడాది జిల్లాలోని ఏ రాజకీయ పార్టీకి కూడా అంతగా కలిసిరాలేదు. ప్రధాన పార్టీలన్నీ వివిధ సమస్యలతో సతమతమవుతూ... అస్థిర పరిస్థితులను చవిచూడాల్సి వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీలో అయోమయ పరిస్థితులు నెలకొని ఉంటే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పోరాటాలతో ప్రజల వద్దకు వెళ్ళేందుకు విఫలయత్నం చేసింది. ప్రజారాజ్యం పార్టీ దశ....దిశ ఏమిటో తెలియని దుస్థితిలో కొనసాగింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి దేశ, రాష్ట్ర రాజధానుల నుంచి నేతలు దిగివచ్చినా అది సాధ్యం కాలేదు. లెఫ్ట్ పార్టీలు ఈ ఏడాది తమ ఉద్యమాలను కాస్తంత తగ్గించి, దేశ, రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గత ఏడాది నవంబర్‌లో రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఏర్పడిన ప్రతిష్ఠంభన జిల్లాలో మరింత ఎక్కువగా కనిపించింది. రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లాకు పలుసార్లు వచ్చినా ఇక్కడి ప్రజలకు ఒక్క ఉపకారం కూడా చేయలేకపోయారు. రోశయ్య అసమర్థతను స్థానిక ఎమ్మెల్యేలు దిగమింగుకుంటూ వచ్చారు. నిధులు లేక, ప్రజల వద్దకు వెళ్ళలేక ఎమ్మెల్యేలు సతమతమైపోయారు. అకస్మాత్తుగా రోశయ్యను మార్చి, ఆ స్థానంలో కిరణ్‌కుమార్ రెడ్డిని అధిష్ఠానం ప్రతిష్ఠించడంతో స్థానిక నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ఏకైక మంత్రిగా కొనసాగుతున్న బాలరాజుకు తిరిగి పదవి దక్కుతుందో లేదోనన్న టెన్షన్ కొంత కాలం కొనసాంది. ఇంతలోనే జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వీరికి ఆశనిపాతంగా మారింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎం.పి.లు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. అనకాపల్లి ఎం.పి.సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వగైరాలు జగన్‌కు దన్నుగా నిలిచారు. జిల్లాలో జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్ర విజయవంతం చేసే బాధ్యతను వీరిద్దరు తమ భుజాలకెత్తుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, మాజీలను ఒక్కర్కొక్కరుగా జగన్ వైపు లాగేందుకు ముమ్మర ప్రయత్నాలే జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి పార్టీతోపాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా స్తబ్దత ఏర్పడింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. నగర పాలక సంస్థలో అధికార పార్టీకి చెందిన మేయర్ పులుసు జనార్దనరావుకు ఈ ఏడాదీ పదవీ గండం ఏర్పడింది. అయితే ఆయనకు అదృష్టం ఎప్పటికప్పుడు కలిసివస్తుండడంతో ప్రస్తుతానికి ఆ గండం నుంచి కాస్తంత తప్పించుకున్నట్టు కనిపిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ఈ సంవత్సరం ఆఖరులో జిల్లా పర్యనకు వచ్చారు. ఆయన జిల్లాలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు ఎదురవడం గమనార్హం.ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, ఈ ఏడాది అంతా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తునే ఉంది. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పల్లె పిలుపు కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించి వెళ్ళినా, పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఈ ఏడాది జిల్లా పార్టీలో పెను మార్పులు సంభవించాయి. అర్బన్, రూరల్ జిల్లాలను కలిపేసి ఒకే కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా అయ్యన్నపాత్రుడిని నియమించారు. ఆయనకు, బండారు సత్యనారాయణమూర్తికి ఉన్న విభేదాలు ఎప్పటికప్పుడు బయటపడుతునే ఉన్నాయి. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు టిడిపి స్పందించినా, అందుకు తగినట్టుగా ప్రజలు స్పందించకపోవడంతో వీరిలో నీరసం ఆవహించింది.




ప్రజారాజ్యం పార్టీ విషయానికి వస్తే... ఈ పార్టీ ఎటువైపు పయనిస్తోందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకున్నా, పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలను చేపట్టలేకపోయారు. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పలు సందర్భాల్లో జిల్లాకు వచ్చినా పార్టీ ఏమాత్రం ఎత్తిరిల్లకపోవడం గమనార్హం. ప్రజల దగ్గరకు వెళ్ళేందుకు స్పష్టమైన కార్యాచరణను పార్టీ అధిష్ఠానం, కనీసం జిల్లా పార్టీ నాయకత్వమైనా రూపొందించకపోవడం వలన ఈ పరిస్థితి దాపురించింది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్న పీఆర్పీ ఎమ్మెల్యేలకు నిరాసే మిగులుతోంది. జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలిచినందు వలన గంటా శ్రీనివాసరావు మంత్రి అవుతారన్న ప్రచారం జరగడం.. కొంత కాలం తరువాత కాంగ్రెస్ నుంచి పిలుపురాలేదని తేలడంతో పార్టీ క్యాడర్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. పార్టీలో పదవులు పొందిన వారైనా ప్రజా సమస్యలపై కచ్చితమైన కార్యాచరణను రూపొందించకపోవడం వలన పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది.

No comments:

Post a Comment