Monday, February 20, 2012

గంటాశ్రీనివాసరావు కు క్లిష్ట పరిస్థితులు!!!


 మంత్రి గంటాశ్రీనివాసరావు జిల్లాలోనే చక్రం తిప్పుతున్నతన సొంత నియోజకవర్గంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పిఆర్పీ విలీనంతో కాంగ్రెస్ కేడర్ తనకు అండగా నిలుస్తారని భావించినా, పరిస్థితులు అంత అనుకూలంగా కనబడటం లేదు. ఇటీవల మంత్రికి జరిగిన పౌరసన్మాన కార్యక్రమంలో ఈ విషయాలు మరింత ప్రస్పుటమయ్యాయి. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, కాంగ్రెస్‌లోనే కొంత మంది నేతలు కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. ఇద్దరు రాజకీయ ఉద్ధండులపై పై చేయి సాధించిన గంటా, తన ఇలాకాలో పరిస్థితులు ఎంత వరకు సరిదిద్దుకుంటారో ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కొణతాల రామకృష్ణ తన అనుచరులు, కార్యకర్తలతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. దీనితో అనకాపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై ఆ ప్రభావం తీవ్రంగా చూపుతుందని భావించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకాంగ్రెస్‌లో ప్రత్యామ్నాయ నేతగా మెలిగే పరిస్థితి స్పష్టమయింది. గంటాకు మంత్రి పదవిరావడంతో కొణతాల కాంగ్రెస్‌కు దూరమైన లోటు భర్తీ అవుతుందని, స్థానికంగా పార్టీమరింత బలోపేతమవుతుందని జిల్లా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అయితే స్థానికంగా పరిస్థితులు గంటాకు అనుకూలించడం లేదు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శనివారం రాత్రి నిర్వహించిన గంటా పౌరసన్మాన కార్యక్రమానికి మెజార్టీ కాంగ్రెస్ పార్టీనేతలు, కార్యకర్తలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.గంటాతోపాటు ఆయనకు సన్నిహితంగా మెలిగే ప్రజారాజ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలతోనే కార్యక్రమం కొనసాగించారు. మాజీ మంత్రి కొణతాలతో విభేదించి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్ పిఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనమయినప్పటి నుండి గంటాకు అత్యంత విధేయత కలిగిన నేతగా మెలుగుతున్నారు. గంటా పౌరసన్మాన సభకు జగన్‌తోపాటు ఆయన సన్నిహిత వర్గనేతలు, కార్యకర్తలు డుమ్మాకొట్టారు. కొణతాల రామకృష్ణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆయన తమ్ముడు రఘునాథ్ మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. గంటా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా విశాఖకు విచ్చేసిన సందర్భంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తన సన్నిహితులతోపాటు వెళ్తానని కొణతాల సోదరుడు రఘునాథ్ ప్రకటించినప్పటికీ గైర్హాజరయ్యారు. గంటాకు స్వాగతం పలికేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ జగన్ అనూహ్యరీతిలో వాహనాలతో, పార్టీనేతలతో అట్టహాసంగా తరలివెళ్లగా పౌరసన్మాన కార్యక్రమానికి గైర్హాజరవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమయింది. ఆహ్వానపత్రంలో స్థానిక నేత అయిన తనపేరు లేకపోవడంతో కినుకువహించే గైర్హాజరయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే జగన్ తిరుమల యాత్రకు వెళ్లడం వలన హాజరుకాలేకపోయారని గంటా అనుచరులు పేర్కొంటుండగా అదమం జగన్ అనుచరవర్గనేతలు, కార్యకర్తలు సైతం పూర్తిగా సన్మాన కార్యక్రమానికి గైర్హాజరవ్వాలనే లక్ష్యంతోనే దూరంగా ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. సహజంగానే అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో ప్రజారాజ్యం పార్టీ కేడర్ మాత్రమే గంటాకు సన్నిహితంగా మెలుగుతుంది. మంత్రి పదవి వచ్చాక కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా చేరువవుతుందని, అనకాపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ గట్టి బలాన్ని కూడగట్టుకోగలదని భావించారు. అయితే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కె. రాంజీ, మరికొంతమంది అడపాదడపా నేతలు మాత్రమే గంటాకు సన్నిహితంగా మెలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన మెజార్టీపార్టీనేతలు, కేడర్ గంటాకు దూరంగానే మెలుగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న ఆ పార్టీకేడర్‌ను మంత్రి గంటా ఏ మేరకు కలుపుకుని వెళ్లగలరు.. నామినేటెడ్ పదవుల పంపిణీలో పిఆర్పీ, కాంగ్రెస్ కేడర్‌కు ఏ మేరకు సంతృప్తి పరచగలరనే అంశాలు ఆసక్తి కరంగా మారాయి. జిల్లా రాజకీయాల్లోనే అత్యంత అనుభవం కలిగిన ఇద్దరు నేతలపై గంటా ఇంకా పై చేయి సాధించాలంటే స్థానికంగా పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దాల్సి వుంది. లేదంటే మున్సిపాల్టీ, మండల పరిషత్, కోఆపరేటీవ్ తదితర ఎన్నికల విజయాలపై కనే్నసిన గంటాకు అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చే ప్రమాదముందని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

Sunday, February 19, 2012

తొలివిడత పల్స్‌పోలియో కార్యక్రమం

 February 19, 2012


పోలియో రహిత ఆంధ్రప్రదేశ్‌ స్పూర్తితో పల్స్‌పోలియోకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొలి విడత జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రం పోలియో రహితంగా మంచి ఫలితాలను సాధించిందని, రాబోవు కాలంలో కూడా ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఐదేళ్లలోపు పసిపిల్లలకందరికి పోలియో చుక్కలు వేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇంటింటికి కార్యకర్తలు తిరిగి పోలియో చుక్కలు వేసే విధంగా తదుపరి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి వేయడం జరుగుతుందని, బుధవారం నాడు ఏడు నగరపాలక కార్పోరేషన్‌ల పరిధిలో పల్స్‌ పోలియో చుక్కలు వేసే విధంగా కార్యాచరణ రూపొందించబడిందని తెలియచేశారు. 2008 నుండి రాష్ట్రంలో పోలియో పూర్తిగా నిర్మూలించబడిందని ముఖ్యమంత్రి వివరించారు. బిక్షగాళ్లు, వైద్యం అందుబాటులోలేని గిరిజన ఆవాసాలు, మత్స్యకారులు, వలస కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికులు, పట్టన మురికివాడలు, పట్టణాలు, గ్రామాలకు దూరంగా జీవనం సాగించేవారు, పంచాయతీల శివారులో ఉండేవారు, కొత్త కాలనీలు, పర్యాటక బృందాలు, వ్యవసాయ కూలీలు, ఆవాసాలకు దూరంగా పని చేస్తు జీవించే కుటుంబాలలోని పసి పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,766 పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 11,835, గ్రామీణ ప్రాంతాల్లో 44,349 కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో 6,597, 1865 సంచార బృందాలను పోలియో చుక్కలను వేయడానికి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 99,38,713 మంది ఐదేళ్లలోపు పిల్లకు పోలియో చుక్కలు వేయడానికి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్ధలు, ఆశ వర్కర్లు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొంటాయని తెలియచేశారు. ఈ నెల 20న మహాశివరాత్రి పర్వదినం ఉన్నందున అన్ని దేవాలయాల వద్ద పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

---------------------------------------------------------------
The Chief Minister Sri N.Kiran Kumar Reddy has administered pulse polio drops to children at the Camp Office on the occasion of "National Immunisation Day" on Sunday. The Chief Minister said that Andhra Pradesh is Polio-free State since 2008 and appealed to work with the same spirit to achieve zero polio status across the country by 2012. The Chief Minister also released a special brochure on the occasion.

Saturday, February 18, 2012

నేను ఒక్కడిని లేకపోతే మీరు ఎందుకూ పనికిరారు...


వికిపిడియా: నాకు ప్రతి విషయం తెలుసు

గూగుల్: నా దగ్గర అన్నీ ఉన్నాయి









ఫేస్‌బుక్: నాకు ప్రతి ఒక్కరూ తెలుసు




ఇంటర్నెట్: అసలు నేను లేనిది... మీరంతా జీరోలు!








ఎలక్ట్రిసిటి: నోరు మూయండి... నా గురించి మరిచేపోయారు? నేను ఒక్కడిని లేకపోతే మీరు ఎందుకూ పనికిరారు...

Friday, February 17, 2012

విశాఖలో నేవీ హెలికాఫ్టర్ కొండ ఢీ( గ్లాడర్)


మానవ రహిత హెలికాఫ్టర్  ఢీ కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే జన నివాసాల మధ్య పడివుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. సమాచారం తెలుసుకున్న నేవీ అధికారులు నలుగురు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కొండపైకి వెల్లారు. ఈ ప్రమాదం సాంకేతిక కారణమా లేక మరేదైనా ప్రమాదమా అన్నది తెలియాల్సి ఉంది.








 భారత నౌకాదళానికి చెందిన ఓ మానవ రహిత గ్లాడర్  ఓ కొండను ఢీకొంది. ఈ ఘటనలో ఈ గ్లాడర్ మొత్తం కాలి బూడిదైంది. దీనికి సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐఎన్ 901 మానవ రహిత గ్లాడర్ గత కొన్ని రోజులుగా గాజువాక సమీపంలోని గణేష్ నగర వద్ద ఉన్న కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కర్లు కొడుతోంది. సమాచార వ్యవస్థ కోసం నౌకాదళం ఈ విమానాన్ని వినియోగిస్తోంది. దీని ద్వారా వివిధ ప్రాంతాల్లో ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటుంటారు.
పూర్తిగా రిమోట్ సహాయంతో నడిచే ఈ గ్లాడర్ విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్ నుంచి గురువారం  ఫిబ్రవరి 16 తేది న మధ్యాహ్నం బయల్దేరింది. కొండ చుట్టుపక్కల కొంతసేపు చక్కరు కొట్టిన గ్లాడర్ అకస్మాత్తుగా నేలకు అతి చేరువగా వచ్చేసింది. కొండ దిగువ భాగంలో ఉన్న ఇళ్ళకు అతి చేరువుగా వెళుతూ కొండను ఢీకొంది. పెద్ద శబ్దంతో గ్లాడర్ పేలిపోయింది. దీని శకలాలు చాలా దూరం ఎగిరిపడి, పెద్ద మంటలు చెలరేగాయి. దీంతో కొండవాలు ప్రాంతంలో ఉన్న జనం భయంతో ఇళ్ళ నుంచి పరుగులు తీశారు. గ్లాడర్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకపోయినా, కోట్ల రూపాయల విలువైన గ్లాడర్ దగ్ధమైంది. అలాగే కొండ అంచును తగిలి గ్లాడర్ పేలిపోయింది. అదే ఇళ్ళ మధ్య ఈ ప్రమాదం జరిగి ఉంటే, భారీ ప్రాణ నష్టం వాటిల్లి ఉండేది. సంఘటనా స్థలానికి చేరుకోడానికి నేవీ అధికారులకు చాలా కష్టసాధ్యమైంది. హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని ఘటనా స్థలానికి చేరువలో దించినా, కొండపైకి వెళ్లడానికి చాలా అవస్థలుపడాల్సి వచ్చింది. దీనిపై స్పందించిన నేవీ అధికారులు ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

Tuesday, February 14, 2012

గ్రేటర్ విశాఖ... నగరపాలక సంస్థగా మారింది!!!???


 *జీవీఎంసీలో వికేంద్రీకరణ రగడ:
 కమిషనర్ పోకడపై గుప్పుమంటున్న విమర్శలు
 * విభాగ అధిపతుల అధికారాలకు పగ్గాలు 
 * జీవిఎంసీలో వెల్లువెత్తుతున్న విమర్శలు
 
   జీ.వి.ఎమ్.సి కి కొన్ని నెలల క్రితం వచ్చిన కమీషనర్ రామాంజనేయులు మొదటి నుంచి వినూత్న విధానాలతో ముందుకెళుతున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో కౌన్సిల్ పూర్తి పదవీకాలం ముగియనుంది. దీంతో అధికార గణానిదే పూర్తి పెత్తనం కానుంది. ఇప్పటికే కమీషనర్ పరిపాలనపై తన పట్టు సాధించారు. పరిపాలనా సౌలభ్యంకోసం వికేంద్రీకరణ చేపట్టామని అందులో భాగంగానే జోన్లు, వార్డులు, ఏరియాలుగా విభజించామని రామాంజనేయులు చెప్తున్నారు.

   తే మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన వివిధ శాఖల అధిపతులు వికేంద్రికరణ నేపద్యంలో వారి పట్టు కోల్పోతున్నారనే విమర్శలు బయలదేరాయి. ఈ నెల 14నుంచి వార్డు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కమీషనర్ వెల్లడించడంతో అన్నితానై వ్యవహరిస్తున్న కమీషనర్ తీరుతో విభాగాధిపతుల అధికారాలకు కత్తెర పడింది. జీవిఎంసిలో అత్యంత కీలక పాత్రలు పోషించే అడిషనల్ కమీషనర్, ఛీఫ్ సిటీ ప్లానర్, ఛీఫ్ ఇంజనీర్, వైద్యఆరోగ్య అధికారులు వికేంద్రీకరణ నేపద్యంలో  క్రమంగా జోనల్ కమీషనర్ల హస్తాల్లోకి జారిపోతున్నారు. క్షత్రస్థాయి అధికారుల సైతం వీరిని లెక్కచేయడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కమీషనరే సుప్రీం అయినప్పటికీ ఈ తరహా సంస్కరణలు ప్రధాన అధికారులపై వేటుగా భావిస్తున్నారు. ఈ నేపద్యంలో కీలక అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారారని కమీషనర్ కార్యాలయం పరిధిలో విమర్శలు గుప్పుమంటున్నాయి.
 నగరపాలక సంస్థ, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థగా మారింది. వౌలిక సదుపాయాలు కల్పిస్తే, నగరం అందంగా మారిపోతుందని, ఈ సుందరమైన నగరాన్ని మరింత అభివృద్ధి చేసి జనాన్ని ఉద్ధరిస్తారని కార్పొరేటర్లుగా పంపిస్తే.. వారు చేసింది ఏంటి? వారి జేబులు నింపుకొని, జీవీఎంసీ ఖాజానాకు కన్నం పెట్టారు. ఐదేళ్ల పాటు వీరికి అవకాశం కల్పిస్తే, నగర ప్రజల జీవితాల్లో ఏమాత్రం వెలుగు నింపకపోగా, వారి స్వార్థాన్ని మాత్రమే చూసుకుని రేపో, మాపో కుర్చీలు దిగిపోనున్నారు. నగరపాలక సంస్థ అష్టకష్టాల్లో ఉందని నగరంలోని అట్టడుగు వ్యక్తికి కూడా తెలుసు. తన ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా, జీవీఎంసీ వారు ఇచ్చి నోటీసుల మేరకు పన్ను చెల్లిస్తూ వస్తున్నాడు. పన్ను కట్టపోతే ఉన్న చిన్నపాటి గూడు, సామాను ఎక్కడ ఛిద్రం చేస్తారోనన్న భయమో! లేక సగటు మనిషిగా ఆయనకు ఉన్న బాధ్యతో కానీ పన్ను చెల్లిస్తూ వస్తున్నాడు. మరి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి పన్ను చెల్లించాలన్న ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? ఒకరు కాదు..ఇద్దరు కాదు.. డజన్లకొద్దీ ప్రజా ప్రతినిధులు ఆస్తి పన్ను ఎగవేసిన జాబితాలో ఉన్నారు. వీరిలో కొంతమంది మహనీయులు ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ మాట్లాడే మాటలకు, చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతన లేదన్నది ఈ ఎగవేతతో తేలిపోయింది.
జీవీఎంసీ బరువు బాధ్యతలన్నీ తమ భుజస్కందాలపైనే ఉన్నాయన్నట్టు, పత్రికల వారికి వినిపించేలా ఆర్థిక పరిస్థితుల గురించి ఏకరవుపెడుతుంటారు మన కార్పొరేటర్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావల్సిన బకాయిలను వెంటనే రాబట్టాలని, అవసరమైతే తామంతా ఒక బృందంగా ఏర్పడి వెళ్లి ఆయా సంస్థల యాజమాన్యాల వద్ద ప్రాధేయ పడదామని సూచనలు ఇస్తుంటారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు తదితర సంస్థలు పన్ను చెల్లించకపోవడాన్ని సమయం దొరికినప్పుడల్లా తప్పుపడుతుంటారు.
గుదిబండలాంటి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకాన్ని నెత్తిన పెట్టుకుని మూడు వందల కోట్ల రూపాయల వరకూ అప్పులపాలైనపోయి, నెలకు నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ, అసలు చెల్లించుకుంటున్న జీవీఎంసీ ఖజానా దుస్థితి కార్పొరేటర్లకు తెలియంది కాదే! మరి వీరు చేస్తున్నదేంటి? బాధ్యతగల పదవుల్లో ఉంటూ వీరు పన్ను చెల్లించకపోవడం సరైనదే అంటారా? వేలు, లక్షల్లో బకాయిపడ్డ వీరు వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం సమాధానం చెపుతారు? ప్రజలు నిలదీస్తే, వీరి పరువేంకాను? ఏళ్ల తరబడి వీరు ఆస్తి పన్ను చెల్లించకపోవడానికి కారణాలేంటి? పదవిని అడ్డం పెట్టుకుని పన్ను ఎగవేశారా? లేక ఆస్తి పన్ను మదింపులో వీరికేమైన అభ్యంతరాలు ఉన్నాయా? అలా ఉంటే, రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారా? ఇవేవీ లేనప్పుడు వేలాది రూపాయల పన్ను ఎగవేయడానికి కారణమేంటి?
చిన్న పురిపాకలో ఉన్న సామాన్యుడు, లేకుంటే చిన్నపాటి ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తున్న సాధారణ వ్యక్తి పన్ను చెల్లించకపోతే, ఆస్తులు జప్తు చేస్తామని రంగు రంగుల నోటీసులు జారీ చేస్తున్న జీవీఎంసీ ఈ మహా నేతలు పన్ను ఎగవేస్తుంటే ఎందుకు మిన్నకుంది? అధికారం, మొహమాటం, లొసుగులు అడ్డొచ్చా? సామాన్యులు పన్ను చెల్లించకపోతే, ఆయా మొత్తాలకు వడ్డీ కూడా విధిస్తున్న జీవీఎంసీ అధికారులు, వీరి నుంచి కనీసం అసలు మొత్తాన్నైనా రాబట్టగలరా? కేవలం 10 రోజుల కాలపరిమితి ఉన్న వీరిని ఇంకా భుజాలపై మోయాల్సిన అవసరం ఉందని జీవీఎంసీ ఉన్నతాధికారులు భావిస్తే, పన్ను వసూళ్ళకు వెనకాడుతారు? అలాంటి మొహమాటాలేవీ లేవనుకుంటే, ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు! ఈ రెంటిలో ఏది జరుగుతుందో వేచి చూద్దాం.

Monday, February 13, 2012

రాజయోగ ద్వారా వ్యవసాయం అభివృద్ధి



వ్యవసాయంలో శాశ్వత యోగిక విధానం అవసరమని పలువురు వక్తలు అభి ప్రాయపడ్డారు. అనేకమంది రైతులు రాజ యోగ ద్వారా వ్యవసాయంపై ప్రయోగాలు చేసి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని వారు వివ రించారు.
బ్రహ్మకుమారీల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లంకెలపాలెం జంక్షన్‌లో 13/02/2012 తేది ఆదివారం జరిగన రైతు చైతన్య సదస్సు లో రాష్ట్ర ఓడ రేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖల మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, రుణాల మాఫీ మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయన్నారు.
యోగిక విధా నం ద్వారా వ్యవసాయంలో దిగుబడి పెరిగితే రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాజయోగి, తపస్వి రాజు భాయీజీ మాట్లాడుతూ రాజయోగ ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఇప్పటికే పలు పరిశోధనలు, ప్రయోగాలు జరిగాయన్నారు. సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 
రైతులు అడుగుతున్నవి చాలా చిన్నచిన్న విషయాలని, వాటిని నెరవేర్చాలని కోరారు. ఒత్తిడిని అధిగమించడానికి యోగ చాలా ముఖ్యమని ఇది మనకు బలాన్ని, కొత్త శక్తిని ఇస్తుందని అంటూ రైతులకు ఆ విధమైన శక్తి అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, మళ్ల విజయప్రసాద్, కార్పొరేటర్ దుల్ల లక్ష్మి, ప్రముఖులు పైలా జగన్నాథరావు, తోట విజయలక్ష్మి, బొడ్డేడ ప్రసాద్, రౌతు శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, వీవీఎన్‌ఎం రాజా జీ.బి. నాయుడు,  తిప్పల చిన అప్పారావు, వై.వి.నరసింహం, చలపరెడ్డి రామారావు, పైలా శ్రీనువాసురావు, బొండా అప్పారావు,దుల్ల రామునాయుడు,బలిరెడ్డినాగేశ్వరరావు,కరణంరెడ్డి నరసింగరావు,బొబ్బరి నారాయణరావు,కరణం కనకారావు,విందుల చిరురాజు,ఆప్పికొండ మహలక్శ్మినాయుడు,సాలాపు వెంకటఆఫ్ఫారావు బ్రహ్మకుమారీలు బి కె సునీత,బి కె కొండలరావు, బి కె సుధ, బి కె వేణి, రేవతి,బి కె బాలకృష్ణ,బి కె సీత,బి కె శివలీల, బి కె శశికళ,బి కె త్రివేణి,బి కె సోమేశ్వరి,బి కె రమ,బి కె సత్యవతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులకు పదివేల మొక్కలు పం పిణీ చేశారు. 

ఆకట్టుకున్న స్టాళ్లు











రైతు చైతన్య సదస్సులో ఏర్పాటు చేసిన స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు స్టాళ్లను తిలకించి ఆద్యంతం అనుభూతిని పొందారు. 



Saturday, February 11, 2012

వైభవ్ జ్యూయలరీ అధినేత గ్రంధి మనోజ్‌కు కన్నీటి వీడ్కోలు


 వైభవ్ జ్యూయలరీ అధినేత గ్రంధి మనోజ్‌కు 10/02/2012 తేది శుక్రవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖ నుంచి ఈ నెల రెండో తేదీన జైపూర్, హైదరాబాద్, బెంగుళూరు వెళ్లాక ఏడో తేదీన బెంగుళూరులో ఆయన హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన మృత దేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం విశాఖ తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ విషాద చాయలు అలముకున్నాయి. కన్నీరుమున్నీరై విలపిస్తున్న మనోజ్ తల్లిదండ్రులు, భార్యా, పిల్లలను చూసిన వారికి హృదయం ద్రవించిపోయింది. బంధువులు, సన్నిహితులు, సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మనోజ్ మృతదేహాన్ని నేరుగా ద్వారకానగర్ వైభవ్ జ్యూయలరీ కాంప్లెక్స్ వద్దకు తీసుకువచ్చి, సందర్శకుల కోసం ఉంచారు. నగరంలో పలుచోట్ల నుంచి తరలివచ్చిన సందర్శకులు మనోజ్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ఆనందవనం అధిపతి సద్గురు శివానందమూర్తి మనోజ్ మృతదేహానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే కంభంపాటి హరిబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి జెవివి సత్యనారాయణమూర్తి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పారిశ్రామికవేత్త మట్టపల్లి చలమయ్య తదితరులు సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు. సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల మల్లిక్, పైడా కృష్ణప్రసాద్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. శుక్రవారం నగరంలో బంగారు, వస్త్ర దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి సంతాపాన్ని తెలియజేశారు.


Friday, February 10, 2012

వైభవ్‌ సంస్థల అధినేత గ్రంధి మనోజ్‌కుమార్‌ దారుణహత్య !


మూడ్రోజుల క్రితం అదృశ్యమైన మనోజ్‌ 

 హసన్‌ జిల్లాలో శవమై తేలిన మనోజ్‌

వైభవ్‌ సంస్థల అధినేత గ్రంధి మనోజ్‌కుమార్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన కర్ణాటకలోని సకలేశ్వర్‌ అటవీ ప్రాంతంలో శవమై తేలాడు. మనోజ్‌ మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 


ప్రస్తుత తమిళనాడు గవర్నర్‌ రోశయ్యకు సమీప బంధువు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన వైభవ్‌ జువెల్లర్స్‌ అధినేత హతమవడంతో విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు వ్యాపారి మనోజ్‌ హత్యకు నిరసనగా విశాఖలో వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసేయాలని నిర్ణయించారు. 

మనోజ్ హత్య కేసులో వీడిన మిస్టరీ: కారు డ్రైవరే హంతకుడు.. పోలీసుల విచారణలో వెల్లడి



 విశాఖ వైభవ్ జ్యూవెలర్స్ అధినేత మనోజ్ కుమార్ హత్యకేసులో మిస్టరీ వీడింది. మనోజ్ కుమార్ ను హత్య చేసింది క్యాబ్ డ్రైవరే అని పోలీసు విచారణలో తేలింది. దీంతో డ్రైవర్ తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వజ్రాల కోసమే మనోజ్ ను చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. కర్నాటక హాసన్ జిల్లా సమీపంలో లో మనోజ్ ను చంపి ఓ కొండపై నుంచి పడేశామని నిందితులు ఒప్పుకున్నారు. పోలీసులు నిందితులను సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. బంగారం వ్యాపారి అయిన మనోజ్.. జైపూర్ లో భారీగా బంగారం, వజ్రాలు కొనుగోలు చేశాడు. అనంతరం శృతి హాసన్ తో యాడ్ కోసం.. ముంబై వెళ్లేందుకు బెంగళూరు వెళ్లాడు. రెండు రోజుల క్రితం బెంగళూరు ఎయిర్ పోర్టులో మనోజ్ అదృశ్యమయ్యాడు.

మనోజ్‌ను ఎందుకు హత్య చేశారు? 
అసలు మనోజ్ కుమార్ బెంగళూరు ఎందుకు వెళ్లారు? ఆయన్ను దుండగులు ఎందుకు అపహరించారు?. ఎందుకు హత్య చేశారు? వివరాల్లోకి వెళితే..


జ్యుయలరీ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తుండటంతో వ్యాపారాన్ని బెంగళూరుకు విస్తరింపజేయాలని మనోజ్ భావించారు. నూతనంగా షోరూం ఏర్పాటు చేసేందుకు మనోజ్ కుమార్ బెంగుళూరు వెళ్లారు. స్థల సేకరణకు ఆయన ఎంజిరోడ్డు, కోరమంగళ, బసవనగుడి, మల్లేశ్వర ప్రాంతాల్లో ఆరా తీశారు. కొందరు భూ వ్యాపారులను కలిసి వారితో చర్చించారు.

బంగారం, వజ్రాలు కొనుగోలు చేసేందుకు ఈనెల 5న మనోజ్ కుమార్ విశాఖ నుండి హైదరాబాద్ వచ్చారు. ఆరవ తేదిన జైపూర్ వెళ్లారు. అక్కడ భారీగా బంగారం, వజ్రాలు కొనుగోలు చేసి బెంగుళూరు వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి బెంగళూరులోని ఓ హోటల్ లో బసచేసి.. ముంబై వెళ్లేందుకు 7వతేది తెల్లవారుజామున ప్రైవేటు ట్యాక్సీలో బెంగళూరు విమానాశ్రయానకి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్నట్లు అక్కడి సిసి కెమెరాల్లోనూ రికార్డు అయింది. అయితే.. ఆ తరువాత నుంచి ఆయన ఆచూకి లభ్యం కాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 

స్థలంపై ఆరా తీసే సమయంలో.. జైపూర్ లో కొనుగోలు చేసిన బంగారం, వజ్రాలు మనోజ్ తోపాటే వున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే.. మూడు గ్యాంగులు ఆయన్ను అనుసరించినట్లు సమాచారం. డబ్బు, ఆభరణాలకోసమే మనోజ్ ను హత్య చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. బెంగుళూరు హోటల్ లో వున్నప్పుడు ఎవరెవరితో మాట్లాడారు అనే దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బెంగళూరులో మనోజ్ ప్రయాణించిన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ మనోజ్ పై రెండు సార్లు హత్యాయత్నం జరగడంతో.. ఆ దిశగా కూడా కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖ పోలీసులతో చర్చించి ఆ వివరాలను సేకరిస్తున్నారు.

Thursday, February 9, 2012

కాంగ్రెస్ అధిష్టానానికి కాపులపై ఇంత ప్రేమ ఎందుకు?"


పీసీసీ నాయకత్వం కాపుకు’, ‘మంత్రివర్గవిస్తరణలో ఇద్దరు కాపులు’, ‘కొత్త సమాచార కమిషనర్లలో ఇద్దరు కాపులు’. అసలు కాపులకు ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళను ఈ స్థాయిలో ఎందుకు అందలాలెక్కిస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో ఇదో పెద్ద చర్చ అయి కూర్చుంది. మరోవైపు, ఉన్నట్లుండి కాపులకు లభిస్తున్న ఈ గుర్తింపుపై మిగిలిన కులాల్లో(ముఖ్యంగా వెనకబడిన వర్గాలలో) కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. అయితే కాపువర్గాలు మాత్రం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న కుల రాజకీయ చదరంగంలో తమ వర్గం పావులాగా మారడం వలన తాము ఇలా అందరి వ్యతిరేకతను మూటకట్టుకోవలసి వస్తోందని వాపోతున్నాయి.
 ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలలో రాజ్యమేలుతున్న కులరాజకీయాల ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‍లో కూడా అమలుచేసే ప్రణాళికలో భాగమే కాంగ్రెస్ అధిష్టానానికి కాపులపై ఈ కొత్త ప్రేమ అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు కమ్మయువత, ప్రజారాజ్యం పెట్టినపుడు కాపుయువత ఆవేశంతో ఎలా ఊగిపోయారో, ఇప్పుడు వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీపట్ల రెడ్డి యువత కూడా అంతే ఆవేశంగా ఉన్నారన్న విషయం ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు తెలిసింది. దానికితోడు వైఎస్ చనిపోయినపుడు ఆయన అంతిమసంస్కారాలు మొత్తం క్రైస్తవ పద్ధతిలో జరగడం, వైఎస్ కుటుంబసభ్యులు అందరూ చర్చిలలో బైబిల్ పట్టుకుని ప్రార్ధనలు చేయడం అంతా ఛానల్సులో ప్రత్యక్షంగా చూసిన క్రిస్టియన్ వర్గం కూడా జగన్ మోహన రెడ్డివైపు మొగ్గు చూపే అవకాశం ఉందని హైకమాండ్‍కు కబురందింది. తమ సంప్రదాయఓటుబ్యాంకులో సింహభాగంగా ఉండే వర్గాలు దూరమైపోతున్నందున దీనిని పూడ్చుకోవడంకోసం సోనియా బృందానికి చిరంజీవిమీద(ఆయన వెనక ఉన్న అతిపెద్ద సామాజికవర్గంపైన) అకస్మాత్తుగా ప్రేమ అంకురించింది. రాష్ట్రంలో సంఖ్యాపరంగా రెడ్లతో సమానంగానో, వారికంటే ఎక్కువగానో(బలిజ, ఒంటరి, మున్నూరుకాపులతో కలుపుకుంటే) ఉండే కాపులకు మంచిస్థానం కల్పించడంద్వారా ఆ వర్గంవారిని ఆకర్షించాలని చూస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, కాపుల ప్రయోజనాలను కాపుకాచేది తామేననిపించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం.
అయితే ఈ పరిణామాలపై కాపువర్గం మాత్రం సంతృప్తిగాలేదు. ఈ పదవుల పందేరం తమకు, మిగిలిన వర్గాలకు మధ్య విబేధాలు రగిలించేవిధంగా ఉందని కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి రెడ్లు, కమ్మలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని, సంఖ్యాపరంగా రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన తమ కులంపై - కాంగ్రెస్ పార్టీకి కొత్తరాజకీయ సమీకరణాలరీత్యా ప్రేమ అంకురించి రెండు, మూడు పదవులు ఇచ్చినంత మాత్రాన తమకు న్యాయం జరిగినట్లు కాదని కాపువర్గం నాయకులు అంటున్నారు. పైగా ఈ రెండు, మూడు పదవుల వలన తమ వర్గం బావుకున్నదేమీ లేకపోయినా మీడియాలో రచ్చ జరుగుతోందని, బీసీలు, తదితర కులాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపులకు ఇప్పుడు ఇచ్చిన పదవుల్లో బీసీలు కూడా ఉన్నారని వారు గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనుకబడినవర్గానికి చెందిన తూర్పుకాపు కులంవారని, కొత్తమంత్రి రామచంద్రయ్య కూడా బీసీ వర్గానికి చెందిన బలిజకులస్తుడని, ఇక విజయనిర్మల అసలు కాపే కాదని తెలిపారు. ఆమె కేరళరాష్ట్రంనుంచి వలసవచ్చి స్థిరపడ్డవారని వివరించారు. చిరంజీవి అనుభవరాహిత్యంవలన, కాపులను సంఘటితపరిచే సరైన నాయకత్వం, కులవేదిక లేకపోవడం వలన సమాజంలో పలచనబడిపోతున్నామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ కాపుసంఘాల నాయకులు, కులాన్ని డబ్బుచేసుకోవడం, ప్రభుత్వంలో పైరవీలు చేసుకోవడం, నాయకత్వలక్షణాలు లేక సంకుచిత ధోరణితో లోలోపల కొట్టుకోవడంతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారని వాపోతున్నారు. చాకలి, మంగలి, మాదిగ వంటి కులవృత్తులవారుకూడా, తమ కులాన్ని గురించి ఎవరైనా మాటవరసకు తక్కువగా ప్రస్తావించినా క్షమాపణ చెప్పేదాకా ఊరుకోకపోతుండగా, కాపులను ఎవరు ఎన్ని తిట్టినా ఖండించే దిక్కులేదంటున్నారు. ఇటీవల బాలకృష్ణ వివిధ సభలలో చిరంజీవిని ప్రస్తావిస్తూ, వాడు, వీడు అంటూ హేయంగా మాట్లాడితే, రాష్ట్రస్థాయిలో ఖండించే కాపు నాయకడు ఒక్కడు కూడా లేకపోవడాన్ని నాయకత్వలేమికి ఉదాహరణగా వారు చూపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలించి కాపుల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడతాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశమయింది. సామాజిక న్యాయం అనే నినాదంతో చిరంజీవి 'ప్రజారాజ్యం'పార్టీని పెట్టినపుడు కాపులతోబాటు, వెనకబడినవర్గాలు కూడా ఆసక్తి చూపాయి. అయితే, ధృడసంకల్పం లేకుండా, బెరుకు బెరుకుగా పార్టీని పెట్టిన చిరంజీవి మొదట్లో ఉవ్వెత్తునవచ్చిన అద్భుత ప్రజాదరణను నిలుపుకోలేకపోయారు. నిజాయతీగా బ్లడ్ బ్యాంకును నడుపుతున్నప్పటికీ వ్యతిరేకపార్టీలు దానిమీద నిందారోపణలు చేస్తే తిప్పికొట్టే నాధుడు ప్రజారాజ్యంలో ఒక్కడూ లేకపోయారు. ఆ తర్వాత వైరివర్గాలు ఇంకా రెచ్చిపోయి ఆ పార్టీని కాపుపార్టీగా ముద్రవేసేసి, టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేశాయి. దాంతో మెల్లమెల్లగా బడుగు, బలహీనవర్గాలు ప్రజారాజ్యానికి దూరమయ్యాయి. కాపులు కూడా ప్రజారాజ్యానికి గంపగుత్తగా ఏమీ ఓట్లేయలేదు. గోదావరిజిల్లాలో కాపులు నిర్ణయాత్మకంగా ఉండేచోట్లకూడా ప్రజారాజ్యం ఓడిపోవడమే దీనికి నిదర్శనం. అమాయకంగా, అనుమానంగా చిరంజీవి, అతితెలివితో ఆయన బావమరిది అల్లుఅరవింద్ చేసిన పనులవలన ఆ పార్టీ, ఎన్నికలనాటికి దిగజారిపోయి అతికొద్ది అసెంబ్లీస్థానాలకే పరిమితమైపోయింది. ప్రజారాజ్యం పెట్టిన తొలినాళ్ళలో అపూర్వరీతిలో సంఘటితమైన కాపులు, ఇప్పుడు అదేస్థాయిలో తమ హస్తంతో చేయి కలుపుతారని కాంగ్రెస్ పెద్దలు ఆశిస్తున్నారు. కమ్మలు తెలుగుదేశాన్ని, రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భావించినట్లుగానే(వాస్తవానికి రెడ్లు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రెండింటిలోనూ గణనీయమైన పదవులే పొందినప్పటికీ, కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తమ సొంతపార్టీగా భావిస్తుండటం విశేషం), కాపులు కాంగ్రెస్ పార్టీని తమదిగా భావించాలని(ఓన్ చేసుకోవాలని) వారి ఆకాంక్ష. మరి అది నేరవేరుతుందో, లేదో వేచి చూడాలి.

చిరంజీవి ఇంటికి సీఎం కిరణ్...?!!


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో అటు డీఎల్ అసంతృప్తితో సీఎంపై ఫైర్ అవడం, ఇంకోవైపు మోపిదేవి వెంకట రమణ చిక్కుల్లో ఇరుక్కున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం చిరు ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. 

కాగా చిరంజీవితో ముఖ్యమంత్రి భేటీ సందర్భంగా పలు కీలక విషయాలను ప్రస్తావించినట్లు సమాచారం. అందులో మొదటిది తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రజారాజ్యం ఎమ్మెల్యేల అంశం. 

ప్రజారాజ్యం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు మొన్నటి మంత్రివర్గ విస్తరణలో మొండి చేయి చూపారు. అయితే చిరంజీవి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు కూడా న్యాయం జరిగేట్లు చూస్తామని హామీ ఇచ్చారు. 

ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ విప్ పదవిని ఇవ్వాలని చిరంజీవి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే చీఫ్ విప్‌గా వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకటరమణా రెడ్డి, విప్‌లుగా మోహన్, శ్రీనివాస్‌లు పేర్లు ముందుకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 

మరోవైపు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఉపఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో జగన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు చిరంజీవితో ఎన్నికల ప్రచారం చేయించాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారనీ, ఈ అంశంపై కూడా చిరంజీవితో చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చిరంజీవికి దగ్గరగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరుగుతున్నట్లు అవగతమవుతోంది.




Wednesday, February 8, 2012

మద్యం సిండికేట్ల ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వివరణ !!???

 సిండికేట్లతో సంబంధం లేకున్నా ACBకి నా పేరు చెప్పడం దుర్మార్గం
 రాజాబాబూ నా క్లోజ్‌ ఫ్రెండ్‌
రమణ క్రిమినల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న వ్యక్తి
మద్యం సిండికేట్లను కట్టడి చేశాం
 MRPకి విక్రయించని షాపులపై కేసులు పెట్టాం
వ్యాపారస్థులు, సిండికేట్లకు నేను కంట్లో నలుసులా మారాను
స్పష్టమైన విచారణ జరిపించండి, ఆరోపణలు వాస్తవమైతే రాజీనామా చేస్తా? 
---------------------------
నిజం నిరూపించుకోవడానికి ఎలాంటి విచారణకైనా సిద్ధమే!
గంజాయి స్మగ్లర్‌, డెకాయిట్‌, మర్డర్‌ కేసులు ఉన్న  రమణ అనే క్రిమినల్ ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఏసీబీ రిమాండ్ రిపోర్టులో తన పేరు చేర్చడాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఖండించారు. నివేదికలో పేరు చేర్చే ముందు తనను ఒకసారి వివరణ అడిగితే బాగుండేదన్నారు. మద్యం సిండికేట్లకు తాను కంట్లో నలుసుగా మారడంవల్లే తనపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని.. అందులో దోషిగా తేలితే..మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మోపిదేవి స్పష్టం చేశారు.



రాజీనామాకు సిద్ధపడుతున్న డిఎల్




మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామాకు సిద్ధపడుతున్నట్లుగా సమాచారం. తన శాఖలో కత్తిరింపుపై ఆయన పూర్తి అవమానభారంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన పరిధిలో ఉన్న శాఖల్లో ప్రాధాన్యత కలిగిన వాటిని కత్తిరించి, ప్రాధాన్యత లేని శాఖలను మాత్రమే తన వద్ద అట్టిపెట్టడం పట్ల ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. తన అసంతృప్తిని ఆయన మంగళవారం ఉదయమే ప్రకటించారు. కిరణ్ తనను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్న డిఎల్ మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఆయన మంగళవారం రాత్రి కడప జిల్లా నుండి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనను కలవనున్నారని సమాచారం. ఆయనను సంప్రదించిన తర్వాత రాజీనామాపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. సహజంగా ముక్కుసూటి వ్యక్తిత్వం కలిగిన డిఎల్ ముఖ్యమంత్రితో కొన్ని పథకాలపై విభేదించారు. ప్రధానంగా రూపాయికి కిలో బియ్యం, 108 నిర్వహణపై ఆయన సిఎంతో విభేదించారు. తనకు అండగా ఉంటాడని భావించి మంత్రివర్గంలోకి తీసుకున్న డిఎల్, తనకు మేకులా మారడంతో సిఎం రూటు మార్చారని అంటున్నారు.
శంకర రావుతో పాటు డిఎల్ రవీంద్రా రెడ్డిని కూడా మంత్రివర్గం నుండి తొలగించేందుకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి అధిష్టానాన్ని అడిగినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే కడప జిల్లాలో బలమైన నేతగా ఉన్న డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రివర్గం నుండి తొలగిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన అధిష్టానం అందుకు అనుమతించలేదని సమాచారం. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే డిఎల్ వంటి బలమైన నేత అవసరం ఉంటుందని అధిష్టానం సిఎంకు సూచించిందని సమాచారం. గత ఉప ఎన్నికల్లోనూ జగన్‌పై పోటీకి ఎవరూ ముందుకు రాని సమయంలో, అధిష్టానం ఆదేశించడంతో డిఎల్ పోటీ చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న అధిష్టానం డిఎల్‌ను తొలగించేందుకు ససేమీరా అన్నదని సమాచారం. దీంతో ముఖ్యమంత్రి వెనక నుండి నరుక్కొస్తున్నారని అంటున్నారు. డిఎల్‌కు కేబినెట్లో క్రమంగా ప్రాధాన్యత తగ్గించడం ద్వారా ఆయనను తొలగించవచ్చునని సిఎం భావిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Tuesday, February 7, 2012

కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీలో పట్టుదొరికింది???


ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీలో పట్టుదొరికింది. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ విషయంలో విఫల మయినప్పటికీ, మిగిలిన అన్ని అంశాల్లోనూ కిరణ్‌ సూచనలను అధిష్ఠానం గౌరవించింది. ఫలితంగా.. తాజా స్వల్ప మంత్రివర్గ విస్తరణలో కిరణ్‌ తన వారిని నియమించుకోగలిగారు. అదే సమ యంలో శాసనసభకు సంబంధించి చీఫ్‌ విప్‌, విప్‌లను కూడా తన వర్గీయులనే నియమించుకోవడం ద్వారా ఢిల్లీలో తన పలుకుబడి పెరిగిందన్న సంకేతాలిచ్చారు.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించాలని సోనియా, పటేల్‌, ఆజాద్‌ వద్ద ఎంత ప్రయత్నించినా అవి నెరవేరలేదు. దానితో మళ్లీ నిరాశ చెందవలసి వచ్చింది.
 కిరణ్‌.. మంత్రివర్గం, శాసనసభకు సంబంధించిన మూడు పదవులనూ తన వారిని ఇప్పించుకునేందుకు చేసిన లాబీ ఫలించింది. కిరణ్‌కు ఆ విషయంలో నాయకత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా క్యాబినెట్‌లో తన వర్గీయులు ఉండాలన్న కిరణ్‌ కోరిక ఫలించినట్టయింది. ముగ్గురు మంత్రులు, ఒక చీఫ్‌ విప్‌, ఇద్దరు విప్‌ల నియామకాల్లో పూర్తిగా కిరణ్‌ మాటే చెల్లుబాటు కావడంతో ఢిల్లీ నాయకత్వం ఆయనకు దన్నుగా నిలిచిందని స్పష్టమవుతోంది. బడ్జెట్‌ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణకు అనుమతిస్తామని హామీ ఇవ్వడం కూడా కిరణ్‌కు కలసివచ్చే అంశమే. ఉప ఎన్నికలు ఉన్నందున ఈ సమయంలో విస్తరణ మంచిదికాదని వారించారు. తెలంగాణలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్న కిరణ్‌ సూచనకు ఆమోదం తెలిపింది.
ఆ ప్రకారంగా… కిరణ్‌ తనకు సన్నిహిత మిత్రుడయిన కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవి ఇప్పించగలిగారు. నిజానికి కెప్టెన్‌ కోసం ఆయన ప్రతిసారీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉత్తమ్‌కు స్పీకర్‌, చీఫ్‌ విప్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులు ఇప్పించేందుకు కిరణ్‌ శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు తన మిత్రుడికి క్యాబినెట్‌లో చోటు ఇప్పించుకోగలిగారు. అధిష్ఠానానికి సైతం ఉత్తమ్‌ సేవలు తెలియడంతో ఆయన నియామకానికి మార్గం సుగమం అయింది.
ఇక తనకు నమ్మకస్తుడిగా ఉన్న కొండ్రు మురళికి మంత్రి పదవి ఇప్పించుకోవడంలో కిరణ్‌ విజయం సాధించారు. ఇటీవలి కాలంలో చురుకుగా పనిచేస్తున్న కొండ్రుకు మాల సామాజికవర్గంతో పాటు విధేయత అక్కరకువచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసం తర్వాత, అసంతృప్తితో ఉన్న మాలలను కొండ్రుకు మంత్రి పదవి ఇప్పించడం ద్వారా బుజ్జగించగలిగారు. ఇటీవలి కాలంలో కొండ్రు సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వికారాబాద్‌ ఎమ్మెల్యే ప్రసాదరావు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోటానే కావడం గమనార్హం. నిజానికి ఆయన పేరు కొద్దిరోజుల నుంచే తెరపైకి వచ్చింది. చురుకుగా వ్యవహరించే మాదిగ వర్గానికి చెందిన ప్రసాదరావును తీసుకోవడం ద్వారా.. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు చెక్‌ పెట్టే వ్యూహానికి తెరలేపారు. తాజాగా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించగా, అందులో ఇద్దరు దళితులు ఉండటంతో కిరణ్‌ సర్కారు దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న సంకేతాలు పంపించగలిగారు.
ఇక తనకు కంట్లో నలుసులా మారిన మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డికి ఉన్న వైద్య, విద్య, ఆరోగ్యను రెండుగా విభజించి డీఎల్‌ను దెబ్బకొట్టారు. దానిలో కీలకమైన వైద్య, విద్య, 104, 108 సర్వీసును ను తనకు విశ్వసనీయుడయిన కొండ్రు మురళీకి కట్టబెట్టి అందరినీ విస్మయపరిచారు. బొత్సను దెబ్బకొట్టేందుకు కాపు నేత కన్నాకు వ్యవసాయశాఖతో ప్రమోషన్‌ ఇచ్చారు. ఫలితంగా, ఇప్పటివరకూ ఆ శాఖ నిర్వహిస్తోన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు చెక్‌ పెట్టారు. కీలకమైన హౌసింగ్‌ను తన మిత్రుడయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. ఇదిలాఉండగా.. శాసనసభకు సంబంధించిన నియామకాల్లోనూ కిరణ్‌ చక్రం తిప్పారు. చీఫ్‌ విప్‌గా తనకు విశ్వసనీయుడయిన గండ్ర వెంకటరమణారెడ్డిని నియమించనున్నారు. మంత్రి పదవి కోసం చివరి వరకూ ప్రయత్నించిన గండ్రను సంతృప్తి పరిచేందుకు ఆయన చీఫ్‌ విప్‌ కట్టబెట్టనున్నారు.
విప్‌లుగా తనకు అనుకూలురయిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, పీఆర్పీకి చెందిన బాల్కొండ ఎమ్మెల్యే అనిల్‌కు అవకాశం కల్పించనున్నారు. నిజానికి, అనిల్‌ చాలాకాలం నుంచి కిరణ్‌ శిబిరంలోనే ఉన్నారు. చిరంజీవి పీఆర్పీ నుంచి కేవలం ఇద్దరికే మంత్రి పదవులు సిఫారసు చేశారని, తెలంగాణ నుంచి ఎవరికీ సిఫారసు చేయలేదని తెలుసుకున్న వెంటనే అనిల్‌, ముఖ్యమంత్రి వైపు మొగ్గుచూపారు. నాటి నుంచీ ఆయనకు విధేయుడిగా ఉండటంతో విప్‌ పదవి ఆయనను వరించనుంది. అనిల్‌కు విప్‌ వస్తుందని చాలారోజుల నుంచీ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ, మళ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికలో జగన్‌ వర్గీయులు వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రమాదమని గ్రహించారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి భట్టికి చెప్పి నచ్చచెప్పినట్లు సమాచారం.
కొత్త మంత్రుల బయోడేటాలు
రాష్ట్ర మంత్రులుగా కొండ్రుమురళీ మోహన్‌, కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌ 06/02/2012 తెది సోమవారం ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కూడా 50 ఏళ్ల లోపువారే కావడం విశేషం. వారి జీవిత విశేషాలు ఇలా ఉన్నాయి.
కొండ్రు మురళి : శ్రీకాకుళం జిల్లా లావేటిపాలెంలో 1969 జూలై 8 న జన్మించారు. తండ్రి పేరు కె అప్పారావు. బిఇ, ఎంబీఎ చదివిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. రాజాం నుంచి 2004 ఎన్నికల్లో తొలిసారిగా ఎచ్చెర్ల నియోజగవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి 2009 లో అదే జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో సీనియర్‌ తెదేపా నాయకురాలు, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పని చేసిన కె ప్రతిభా భారతిని ఓడించడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పడు ఆయనను ప్రభుత్వ విప్‌గా నియమించారు.
ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి: నల్గొండ జిల్లా సూర్యపేటలో 1962 జూన్‌ 20 న జన్మించారు. తండ్రి పేరు పురుషోత్తమరెడ్డి. బిఎస్‌సి డిగ్రీతో పాటు రక్షణ శాఖలో పలు పీజీ కోర్సులను చేశారు. ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలెట్‌గా పని చేసి పదవీ విరమణ చేసిన తర్వాత వ్యవసాయం వృత్తిగా స్వీకరించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకు ముందు కోదాడ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో హూజూర్‌నగర్‌ నుంచి గెలుపొందారు. ఎపి ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ సెల్‌ చైర్మన్‌గా పని చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

గడ్డం ప్రసాద్‌కుమార్‌ : రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండల కేంద్రానికి చెందిన వారు. వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిఎ వరకు చదివారు. ఆయనకు భార్య శైలజ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి పేరు జి ఎల్లయ్య. చిన్నప్పటి నుంచి దళిత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.