Thursday, December 16, 2010

నదీ తీరం... జన కెరటం...

ఆదిలాబాద్;ప్రాణహిత పుష్కరాలకు ఇంకా రెండు రోజుల గడువుమాత్రమే వుండడంతో పల్లెలు, పట్టణాలు ఇంటిల్లిపాదితో పుణ్యస్నానాల కోసం తరలి వస్తూ తరించిపోతున్నారు. పవిత్ర ప్రాణహిత నదీతీరం ఉప్పొంగిన భక్తిపారవశ్యంతో పులకించి పోతుండగా, స్నానఘట్టాలన్నీ భక్తుల రద్దీతో కిటకిట లాడుతున్నాయి. పిల్లాపాపల కేరింతలు, కర్పుర హారతులు, భజనలు, కీర్తనలు పండితుల వేదఘోష, పితృతర్పనాలతో పుష్కరఘాట్లన్ని ప్రత్యేక శోభను సంతరించుకుంటున్నాయి. 10వ రోజైన బుధవారం ఒక్క అర్జునిగుట్టలోనే లక్షా 20వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. జిల్లావాసులే గాకుండా పొరుగునే గల ఛత్తీస్‌ఘడ్, మహారాష్టత్రో పాటు మధ్యప్రదేశ్, సరిహద్దులోని అయిరి, అల్లపల్లి, మద్దేడి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుండి పుష్కరాల కోసం ఉత్సాహంగా తరలివచ్చారు. కృష్ణా, గుంటూర్,విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి భక్తుల రద్దీ మరింత పెరిగింది. బుధవారం భక్తుల సంఖ్య నేపధ్యంలో వేద పండితులు, అయ్యవార్ల సంఖ్య కూడా అదనంగా పెరగడం కనిపించింది. పితృతర్పనాలకు విపరీతమైన గిరాకీ పెరగడంతో చెన్నూర్‌కు చెందిన పండితులంతా అర్జునిగుట్టలోనే విడిది చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన విద్యార్థి మృతి సంఘటన నేపధ్యంలో 108 అంబులెన్సులు, వైద్య శిబిరాలు, ఆక్సిజన్ సిలెండర్లను అందుబాటులోకి తెచ్చి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు,రిస్క్ టీం సిబ్బంది రక్షణ చర్యలపై మరింత దృష్టిసారించారు. ఇదిలా వుంటే వేమనపల్లిలో జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఈ నదీతీరానికి అంతగా ప్రాచుర్యం ఇవ్వకపోవడం వల్ల భక్తుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. తుమ్మిడిహెట్టిలో సమస్యలు యథాతధంగానే వున్నా, ఇన్‌చార్జి అదికారులైన డ్వామా పిడి శ్రీ్ధర్, డిపిఓ అనిల్‌కుమార్ పత్తాలేక పోవడంపై ఆగ్రహంవ్యక్తమైంది. అరకొరగా మహిళలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించడం వల్ల దుస్తులు మార్చుకోవడానికి సైతం పడరాని పాట్లు పడ్డారు. ఎమ్మెల్యే సమ్మయ్య అసౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్ నుండి అర్జునిగుట్టకు జనం విపరీతంగా రావడంతో భక్తుల సౌకర్యార్థం బుధవారం స్పీడ్ స్టీమర్‌ను ఏర్పాటుచేశారు. కాళేశ్వరం నుండి పడవల్లో పుణ్యస్నానాలకు ఇక్కడికి వస్తుండడం గమనార్హం.

No comments:

Post a Comment