Tuesday, December 28, 2010

నవ్విపోదురు గాక మాకేంటి.. ఇదేనా 125 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర?!!


125 ఏళ్ల ఘనమైన చరిత్ర అని గొప్పగా చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఎ సర్కార్ కుంభకోణాలమయంగా మారింది. దేశ ఖజానాను యధేచ్చగా లూఠీలు చేస్తున్నా.. తెలిసీ తెలియనట్టు వ్యవహరిస్తోంది. కేంద్రంలో పరిస్థితి ఆ విధంగా వుంటే.. మన రాష్ట్రంలో ఆ పార్టీ పరువు బజారున పడిందనే చెప్పొచ్చు. 
తెలంగాణా ఉద్యమంతో మానసికంగా నిట్టనిలువునా చీలిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరి నోటికి వచ్చినట్లు వారు మాట్లాడటం ఇటీవల కాలంలో సర్వసాధారణమైపోయింది. వీరిని ఎలాగోలా సర్దుకుంటూ వచ్చిన హైకమాండ్‌కు వైఎస్‌.జగన్ తిరుగుబావుటా పెద్ద గుదిబండలా మారింది. జగన్ ఆ పార్టీ, ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ మాటల మాయో.. వైఎస్సార్ పట్ల సానుభూతో... కాంగ్రెస్ పార్టీపట్ల వ్యతిరేకతో తెలియదు కానీ జగన్ ఎక్కడ సభ పెట్టినా జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
పార్టీ నుంచి బయటకు వెళ్లిన జగన్ వెంట అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బాహాటంగా నడుస్తున్నారు. పైపెచ్చు అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అంతగా మాట్లాడితే రాజీనామా చేయడానికైనా సిద్ధమని తెగేసి చెపుతున్నారు. ఇంత జరుగుతున్నా హైకమాండ్ చేష్టలుడిగి చూస్తుండిపోవడం తప్పించి ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. 
ఇదిలావుండగా తాజాగా తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రాంత ఎంపీలు విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ దీక్ష చేపట్టారు. ఈ దీక్షతో అసలు రాష్ట్రాన్ని పాలిస్తున్నది... కాంగ్రెస్ పార్టీనా...? లేదంటే ప్రతిపక్ష పార్టీనా..? అని సామాన్య పౌరుడిలోనూ ఒక చిన్న సందేహం కలుగుతోంది. అధికారం తమ చేతిలోనే ఉన్నా... ఆ అధికార పార్టీకే చెందిన ఎంపీలు దీక్ష చేపట్టడంతో పాటు ప్రభుత్వం కళ్లు ఉన్న కబోదిలా మారిపోయిందనీ, చెవులున్నా చెముడు ఉన్నట్లు ప్రవర్తిస్తోందనీ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. 
కొసమెరుపు ఏమిటంటే... అధికార పార్టీకి చెందిన ఎంపీలు చేస్తున్న దీక్షకు తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ప్రకటించడం. అంటే ప్రభుత్వంలోనూ గ్రూపులు... లుకలుకలున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చరమాంకంలో ఉన్నదేమో అనిపిస్తోంది... ఏదేమైనా శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కానీ ఆ పార్టీ అసలు రూపు ఏమిటో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటివరకూ ఇంకా ఎన్ని రకాల మలుపులు కుదుపులకు లోనవుతుందో వేచి చూడాల్సిందే. ఇదే.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పండు ముదుసలి కాంగ్రెస్ పరిస్థితి.

No comments:

Post a Comment