Sunday, December 12, 2010

నాకంటే విశ్వసనీయుడెవరు...?

తనకు మించిన విశ్వసనీయత గల నాయకుడెవరూ ఈ దేశంలో లేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. తనకు విశ్వసనీయత లేదంటూ కొన్ని పత్రికలు కావాలని ప్రచారం చేస్తున్నాయని ఇటువంటి వార్తలు రాస్తున్నవారు విశ్వసనీయత గురించి తనకు చెబితే మరిన్ని విషయాలు తెలుసు కుంటానని ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభలోని తెదేపాపక్షం కార్యాలయంలో శుక్రవారం తనను కలిసిన విలేఖరులతో పిచ్చాపాటిగా మాట్లాడిన బాబు విశ్వసనీయతపై పాత్రికేయులకు క్లాస్‌ తీసుకున్నారు. విశ్వసనీయత అంటే అర్థమేంటో తనకు చెప్పాలని చంద్రబాబు విలేఖరులను నిలదీశారు. 32 ఏళ్ళ రాజకీయ జీవితంలో తాను ఎన్నో కార్యక్రమాలు అమలు చేశానని సంక్షేమంలో, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపానని ఆయన అన్నారు. నాయకత్వ లోపంతో ఇటు రాష్ట్రం, అటు కేంద్రం కునారిల్లుతోందని అంటూ 2-జి స్పెక్ట్రమ్‌ అవినీతిలో ఏం చేయాలో తెలియక సోనియాగాంధీ దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని దుయ్యబట్టారు. తాను తన రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూశానని అయితే వెనుకడుగు వేయకుండా ఆ సంక్షోభాలను అధిగమించానని చెప్పారు. విశ్వసనీయతకు అర్థమేంటో చెప్పాలని ఆయన కోరారు.''నా కన్నా విశ్వసనీయత కలిగిన రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరున్నారు'' అని చంద్రబాబు ప్రశ్నించారు. విశ్వసనీయత లేకపోతే తొమ్మిదేళ్ళపాటు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తానని ఆయన ప్రశ్నించారు. ప్రవర్తనలో, ముందు చూపులో, పాలనలో సమయానుకూలంలో ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అన్నింట్లో తానే ముందంజలో ఉన్నానని ఆయన చెప్పారు. 32 సంవత్సరాలలో రాజకీయంలో తాను ఉన్నానని, ఇంతగా పాలనా దక్షత విశ్వసనీయత గల నాయకులు ఎవరున్నారో చెప్పాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిది సంవత్సరాలలో ఒక్క కుంభకోణం కూడా లేదని అయితే దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం పూర్తిగా కుంభకోణాల మయమైందని ఆరోపించారు.కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఇందుకు కారణం ప్రజారాజ్యం, లోక్‌సత్తా పార్టీలతోపాటు కమ్యూనిస్టు పార్టీలు, తెరాస అని ఆయన చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా చీలిపోయాయని దీంతో అధికారాన్ని చేపట్టలేకపోయామని చంద్రబాబు అన్నారు. తెరాసతో తాము కలిసి పోటీ చేయడం వల్ల తమకు నష్టం ఏర్పడిందని ఆయన చెప్పారు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు కూడా పత్రికలు ఆయన అధికారంలోకి వస్తారని సంపాదకీయాలు రాశాయని తీరా పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందేనని అన్నారు. విశ్వసనీయత అంటే ప్రజల సొత్తును దోచిపెట్టడం కాదని అలా దోచిపెడితే దేశం ఎక్కడికి వెళుతుందని ఆయన ప్రశ్నించారు. తమకెందుకులే అనుకుంటే దేశం ఏమి కావాలని కూడా ఆయన ప్రశ్నించారు.వాయుగుండం ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి  తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళి వేరుశనగ పంట పండుతుందా అని రైతులను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే తనతో ఉన్న రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి జోక్యం చేసుకుని ఈ పంట ఈ ప్రాంతంలో పండదని ఇక్కడి రైతులు కేవలం వరిని మాత్రమే పండిస్తారని చెప్పడంతో ముఖ్యమంత్రి నాలుక కరుచుకున్నారని చంద్రబాబు చెప్పారు.

No comments:

Post a Comment