Sunday, December 5, 2010

కిరణ్,రెడ్డి సర్కారు,.. మూణ్ణాళ్ళ ముచ్చటేనా!!!

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు మూణ్ణాల ముచ్చటగా మారనుందా.? ఈ మాటలు విపక్ష పార్టీలకు చెందిన నేతల నోటి వెంట రావడం లేదు. స్వయానా అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఎవరూ ఊహించలేకుండా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రత్యర్థి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏ క్షణం ఎలాంటి ముప్పు వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసిన కొంతమంది సీనియర్ నేతలు తమ మనోగతాన్ని బహిరంగపరుస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ముఖ్యమంత్రి కేకేఆర్ .. రాజకీయంగా చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత. కేకేఆర్‌తో పోల్చుకుంటే జిల్లాలో మంచిపట్టున్న నేత. వైఎస్సార్, రోశయ్య ప్రభుత్వాల్లో రాష్ట్ర అటవీ శాఖామంత్రిగా పని చేశారు. ఈయన ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఇకపై తాను రాజకీయాలు చేయనున్నట్టు బాహాటంగానే ప్రకటించారు. ఏమాత్రం అనుభవం లేని కిరణ్ కుమార్.. అధిష్టానం ఆదేశంతో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారని ఆరోపించారు. అందుకే ఆయనను ముఖ్యమంత్రిగా తాను ఊహించుకోలేనని ప్రకటించారు. ఇదే విషయాన్ని తాను తేటతెల్లం చేసి, మంత్రి పదవి వద్దని చెప్పారు. అలాగే, కోస్తాంధ్రకు చెందిన ఎంపీ సబ్బం హరి (అనకాపల్లి) కూడా ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఆయన ఎలాంటి మంత్రిపదవులు చేపట్టుకుండా ఏకంగా ముఖ్యమంత్రి కావడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఆయన అనుభవంరాహిత్యం మంత్రివర్యులకు శాఖల కేటాయింపులో కొట్టొచ్చినట్టు కనిపించిందన్నారు. పైపెచ్చు... సీఎం ఏకపక్షంగా వ్యవహరించడం ఆయనకూ మంచిదికాదని హితవు పలికారు. ఇకపోతే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి అయితే, కిరణ్ కుమార్ సర్కారు మూణ్ణాళ్ల ముచ్చటగా అభివర్ణించారు. మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. పైపెచ్చు.. కిరణ్‌పై విమర్శలు సైతం గుప్పించారు. అనుభవంలేని వ్యక్తిని సీఎం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే, సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు సైతం కిరణ్‌కు ఏమాత్రం సహకారం అందించేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. మంత్రుల శాఖల కేటాయింపులో తమను మాటమాత్రమైనా సంప్రదించలేదని వారు గుర్రుగా ఉన్నారు. పైపెచ్చు.. సీఎం ఢిల్లీ తొలి పర్యటనలో పలువురు ఎంపీలు అపాయింట్‌మెంట్ అడిగినా కేకేఆర్ నిరాకరించారు. మరికొందరు సీనియర్ ఎంపీలను నిలబెట్టి మరీ మాట్లాడారు. దీన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే.. శాఖల కేటాయింపులపై మంత్రుల్లో భగ్గుమన్న అసంతృప్తిని చల్లార్చాల్సిందిగా అధిష్టానం ఎంపీలను ఆదేశించింది. అయితే, ఒక్క ఎంపీ కూడా నోరు మెదపకుండా... తమకెందులే అన్న చందంగా వ్యవహరించారు. దీంతో అధిష్టానమే స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్తులను బుజ్జగించాల్సి వచ్చింది. ఇలాంటి అసంతృప్తులు పార్టీలో చాలామందే ఉన్నారు. వారు ఎపుడు ఎటువైపుకు మొగ్గుతారో ఊహించడం కష్టం. ఇదిలావుండగా, నిన్నటి కాంగ్రెస్ ఎంపీ, నేటి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుసుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంత్రిపదవులు దక్కక అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు జగన్‌తో రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఇలాంటి వారంతా జగన్ శిబిరంలోకి ఎపుడైనా దూకే అవకాశం ఉంది. దీన్ని కొంతమంది సీనియర్ నేతలు గ్రహించడం వల్లే కిరణ్ సర్కారు మూణ్ణాళ్ళ ముచ్చటేనని చెపుతున్నారు.

No comments:

Post a Comment