Friday, December 17, 2010

రైతు సమస్యలపై నేటినుంచి బాబు దీక్ష

రైతాంగ సమస్యలపై అందరూ అనుకున్నట్లే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తారో లేదో..ఆరోగ్యం సహకరిస్తుందో లేదో ఈ వయస్సులో దీక్ష చేపట్టడంపై పునరాలోచించుకోండంటూ పార్టీ శ్రేణులు చేసిన విజ్ఞప్తిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. గురువారం శాసనసభ సమావేశాలు ముగిశాక నిరవధిక దీక్ష చేపట్టే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలతో అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు సుదీర్ఘంగా సమాలోచన చేశారు. అనంతరం సమావేశం వివరాలను టీడీ ఎల్పీలో సీనియర్లు కే. యర్రన్నాయుడు, వేణుగోపాలాచారిఎల్‌. రమణ, దాడి వీరభద్రరావు, పల్లె రఘు నాథరెడ్డిలు విలేకరులకు వెల్లడించారు. శుక్రవారం సచివాలయం సమీపంలో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చంద్రబాబు సహా పలువురు సీనియర్‌ నేతలు ఉదయం 10.30 గంటలకు నిరవధిక నిరహార దీక్ష చేపడతారన్నారు. మిగిలిన నేతలు రోజుకు కొందరు చొప్పున దశల వారీగా దీక్షలో చేరుతారన్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు నిరవధిక నిరాహార దీక్షలకు కూర్చుంటారని యర్రన్నాయుడు తెలియజేశారు.దీక్ష కూర్చోడానికి ముందుగా చంద్రబాబు తొలుత అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి, ట్యాంక్‌బండ్‌ వద్ద నున్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పిస్తారని, అక్కడి నుండి హుస్సేన్‌ సాగర్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు ఆయన శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుండి నేరుగా ఆదర్శ్‌నగర్లో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకుని నిరవధిక నిరాహార దీక్షను చేపడతారని యర్రన్నాయుడు వెల్లడించారు. దీక్షకు ముమ్మరంగా ఏర్పాట్లుచంద్రబాబు దీక్షకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. రాష్ట్ర జాతీయ మీడియా కవరేజీలో నిమగ్నం కానుండడంతో నేతలు టీవీ ఛానళ్ల ప్రతనిధులకు సంపూర్ణ సహకారాలు అందించేం దుకు కృషి చేస్తున్నారు. దీక్షకు వివిధ జిల్లాల నుండి తరలి వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు తమ వాహనాలను ఇందిరాపార్కు వద్ద నున్న ఎన్టీఆర్‌ స్టేడియంలో పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే దీక్షకు తరలి వచ్చే వారు బస చేసేందుకు ఇందిరాపార్కు వద్దే ఉన్న పలు కళ్యాణమండపాలను బుక్‌ చేశారు. భోజనం ఇతర సౌకర్యాలను పార్టీ నేతలు చూసుకుంటున్నారు.కాగా మీడియాను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి అనుమతిస్తారా ? లేదా అన్న విషయంపై ఇంకా సందిగ్థం వీడలేదు. ఇది వరకు తెలంగాణ జేఏసీ కార్యాలయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఉండడం, మీడియా లైవ్‌ టెలికాస్ట్‌ చేసే ఓబీ వాహనాలను ఆదర్శ్‌నగర్‌ ప్రధాన రోడ్డుపైనే నిలుపడంతో అప్పటి స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్‌ వద్ద ఓబీ వాహనాలు నిలిపేందుకుగానీ వీల్లేదంటూ అక్కడ నిషేధాన్ని విధిం చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు దీక్షపైనా ప్రభుత్వం అదే విధానం అనుసరిస్తే టీవీ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాల సంగతేంటని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలకు వినియోగించే ఓబీ కార్లను అక్కడ నిలిపేందుకు అనుమతించక పోతే ఏంటన్న అంశంపైనా నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరుపు తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుండి సచివాలయం వరకు ఓఎఫ్‌సీ కేబుల్‌ వేసి సెక్రటేరియట్‌ నుండి ప్రత్యక్ష ప్రసారా లను అందించే విధంగా ఏర్పాట్లు చేయవచ్చంటున్నారు.

No comments:

Post a Comment