Thursday, December 2, 2010

శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర సంబరాలు...

విశాఖపట్నం; ఈనెల 6వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు జరిగే శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర సంబరాలు ఘనంగా నిర్వహించాలని విశాఖ దక్షిణ శాసన సభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్‌ కమిటీ వారికి, అధికార్లకు విజ్ఞప్తి చేశారు. అమ్మవారి మండపంలో నిర్వహించిన సమన్వయ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికార్లు సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగ కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం మరింత సజావుగా, వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సమన్వయ కమిటి ఛైర్మన్‌, అదనపు జాయంట్‌ కలక్టరు ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ శాఖల అధికార్లు నిర్వర్తించ వలసిన పనులను వారికి తెలియజేయడం జరిగిందన్నారు. ఆయా శాఖలు వారికి కేటాయించిన విధుల నిర్వహణకు తగిన ముందస్తు ప్రణాళికలు తయారు చేశారని తెలిపారు. పోలీసు, నగరపాలకసంస్థ, విద్యుత్‌, ఆరోగ్య తదితర శాఖల అధికార్లతో వారు తీసుకున్న చర్యలను గూర్చి సమీక్షించారు. ఈ నెల 4వ తేదీ నాటికి విధులు నిర్వర్తించే సిబ్బందిని సిద్దం చేసి ట్రయిల్‌ చూసుకోవాలని ఆదేశించారు. పోలీసు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనరు కృష్ణమూర్తి, ఎసిపి కృష్ణమూర్తి నాయుడు, దేవాదాయ శాఖ డిప్యూటి కమిషనర్‌ విజయకుమారి, ఆలయ కార్య నిర్వాహణాధికారి డి.భ్రమరాంబ, కమిటి ఛైర్మన్‌ కంటుముచ్చు తాతారావు, ఇతర సభ్యులు, వివిధ శాఖల అధికార్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment