Saturday, December 6, 2014

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఉంటేనే సాయం...!!


ఆంధ్ర ప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యంగా ఉంటేనే కేంద్రం మద్దతు ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు స్నేహపూరితంగా ఉండి చక్క టి పరిపాలన అందించాలని అప్పుడే తాము అన్నివిధాలా ఆదుకుంటామని మోడీ తెలంగాణ ఎంపీలకు చెప్పారు. న్యూ ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌ రెడ్డి, సీనియర్‌ నేత కే.కేశవరావు నేతృత్వంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, వి నోద్‌కుమార్‌, బాల్కాసుమన్‌, సీతారామ్‌ నా యక్‌, పాటిల్‌, కొండావిశ్వేశ్వర రెడ్డిలు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి తెలంగాణ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా విద్యుత్‌, నీరు, పెండింగ్‌ ప్రాజె క్టులు, ఉమ్మడిగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల విషయంలో ఏర్పడిన వివాదాలను ఎంపీలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో జరగనున్న సిఎంల సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రుల తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకం గా భేటీ కానున్నారు. ప్రధానమంత్రిని కలిసి న తర్వాత ఎంపీలు కే.కేశవరావు, జితేందర్‌ రెడ్డిలు ఎపి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించాలని ప్రధానమంత్రిని కోరినట్లు చెప్పారు. తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ది చెందటానికి రాయితీలు ప్రకటించాలని కోరగా ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రధానంగా 28 అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రాణహిత చెవెళ్ళకు జాతీయ హోదా, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులకు కేంద్రం సహాయం, ఐఏఎస్‌, ఐపిఎస్‌ల కేటాయింపుల ప్రక్రియ వేగంగా జరగాలి. హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం,అదనపు విద్యుత్‌ కేటాయింపు వంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. అయితే ఇరు రాష్ట్రాలు సంతోషంగా, సఖ్యంగా ఉండి ప్రజలకు మంచి పాలన అందించిన రోజు నుంచి కేంద్రం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని నరేంద్రం మోడీ తెలంగాణ ఎంపీలకు స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియకుండానే హైదరాబాద్‌లో ఉన్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఎన్‌టిఆర్‌ నామకరణం చేశారని, ఇది చాలా అవమానకరంగా సిఎం భావిస్తున్నారని ఎంపీలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. అయితే ఈ విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రితో తాను మాట్లాడతానని పిఎం పేర్కొన్నారని ఎంపీలు మీడియాకు తెలిపారు. రైల్వేలోని పెండింగ్‌ అంశాలపై కూడా ఎంపీలంతా కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్‌ ప్రభును కలిసి చర్చించారు. రైల్వే పరీక్షలో జరుగుతున్న పేపర్‌ లీకేజి, విద్యార్ధులకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.