Saturday, January 22, 2011

పల్స్‌పోలియోకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది...


 విశాఖపట్నం : పల్స్‌పోలియోకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జనవరి 23వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.46 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యం. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 40 వేల మంది పిల్లలు పెరిగారు. ఈసారి పొలాల్లోని గడ్డివాములు, ఊరికి దూరంగా జరుగుతున్న నిర్మాణాల్లో పాల్గొనే వారి పిల్లలకూ పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించారు. వలస వచ్చిన వారి పిల్లలను గుర్తిస్తారు. ముందుగా అలాంటి వారికి పోలియో చుక్కలు వేయడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చని భావిస్తున్నారు. 102 సంచార బృందాలు, 102 తాత్కాలిక శిబిరాల ద్వారా అందరికీ చుక్కలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా మైదాన ప్రాంతంలో రెండు లక్షల మంది, విశాఖ అర్బన్ ప్రాంతంలో లక్షన్నర మందికి, గిరిజన ప్రాంతంలోని 74 వేల మందికి పోలియో చుక్కలు వేసేందుకు 14,508 మంది వేక్సినేటర్లను నియమించారు. వేక్సినేటర్‌కు రోజుకు రూ. 75 చొప్పున మూడు రోజులకు చెల్లిస్తారు. వేక్సినేటర్లను పర్యవేక్షించే 393 మంది సూపర్‌వైజర్లకు గరిష్టంగా రూ. 225 వరకూ చెల్లిస్తారు. విశాఖ అర్బన్, ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందుకోసం 465 శిబిరాలను ఏర్పాటు చేశారు. పల్స్‌పోలియో కార్యక్రమానికి అంతా సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జి.సావిత్రి కోరారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన వ్యాక్సీన్‌ను సరఫరా చేశామని తెలిపారు. ఆమె కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. అయిదేళ్లలోపు వయసున్న పిల్లలందరికీ చుక్కలు పడేలా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. ఏ పనిలో వున్నా, ప్రయాణంలో ఉన్నా పిల్లల ఆరోగ్యం కోసం రెండు చుక్కలు వేయించాలని హితవు పలికారు. ఉద్యోగుల పెన్‌డౌన్, ఇతర ఆందోళన కార్యక్రమాల ప్రభావం పల్స్‌పోలియోపై పడే అవకాశాలు లేవన్నారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్యామల, సర్విలెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.ఎన్.అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment