Wednesday, January 26, 2011

పరిటాల రవి హత్యలో జగన్ హస్తం, సిఎం వ్యాఖ్యలే నిదర్శనం: చంద్రబాబు


పరిటాల రవి హత్యలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పాత్ర ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో తేటతెల్లమయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం గుంటూరు జిల్లాలో వ్యాఖ్యానించారు. రైతుకోసం యాత్ర పేరుతో రెండురోజుల గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు బాపట్లలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల హత్య జరిగి ఆరేళ్లయినా కేసు ఓ కొలిక్కి రాలేదన్నారు. హత్య కేసులో సిబిఐ విచారణ సరిగా లేదన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలో వరుస హత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను ఇంతవరకు పట్టుకోలేక పోవడం దారుణమన్నారు. కృష్ణా జలాల్లో రాబోయే యాభై సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ నష్టపోనుందని అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి నీతిమాలిన చర్యల వల్ల, చేతకానితనం వల్లే ఈ నష్టం జరిగిందని ఆరోపించారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ వేలకోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించి పత్రికలు, ఛానల్లు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక పోతుందని అన్నారు. ధరలు అదుపు చేయటంలో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నాయన్నారు. దోపిడీదారులు దోచుకున్న ధనాన్ని ప్రభుత్వం రికవరీ చేయలేకపోతుందని అన్నారు.పరిటాల రవి హత్య కేసులో పూర్తి విచారణ జరిపించాలని టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమ విజయవాడలో డిమాండ్ చేశారు. హవాలా కేసులో జగన్‌కు సంబంధం ఉన్న కారణంగా ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని ఆయన కోరారు. జగన్ కొత్త పార్టీ పెట్టడానికి తండ్రి హయాంలో దోచిన వేలకోట్ల రూపాయలను బెంగుళూరులో, ఇడుపులపాయలో దాచిపెట్టారని ఆరోపించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే జగన్ అక్రమ ఆస్తులను అన్నింటిని వెలికి తీయాలని సవాల్ చేశారు.

No comments:

Post a Comment