Monday, January 3, 2011

నేటి నుంచి విశాఖ ఓదార్పు

యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖ జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు పది రోజుల పాటు ఇది సాగనుంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణాన్ని తట్టుకోలేక ఈ జిల్లాలో అసువులు బాసిన 18 మందికి చెందిన కుటుంబ సభ్యులను యువనేత పరామర్శించి ఓదారుస్తారు. జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల్లో 789 కిలోమీటర్ల మేర ఆయన పర్యటించనున్నారు. మన్యంలోని పాడేరు, హుకుంపేట, కొయ్యూరు మండలాల్లోనూ జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పలుచోట్ల వైఎస్ అభిమానులు ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని ఓదార్పుయాత్రకు వస్తున్న జగన్‌తో ఆవిష్కరింపచేయనున్నారు.
ఇప్పటిదాకా 103 వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేయగా.. అనేకచోట్ల అభిమానులు మరిన్ని విగ్రహాలను సిద్ధం చేసి యువనేతతో ప్రారంభింపజేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. జగన్ తొలిరోజు పద్మనాభనగర్‌లో కంపర బాబూరావు, రాంపురంలో గండి భూలోకయ్య, లింగాల తిరుగుడులో దొడ్డి కోటేశ్వరరావు కుటుంబాలను పరామర్శిస్తారు. మార్గమధ్యంలోని 14 వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. యువనేత యాత్రకు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామృకృష్ణ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కొద్దిరోజులుగా విశాఖలోనే ఉంటూ యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
జగన్‌కు విశాఖ జిల్లా అండగా నిలిచింది. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆది నుంచీ యువనేతకు బహిరంగంగా మద్దతునిస్తున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా తన మద్దతు ప్రకటించారు. వీరితో పాటు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ గొర్లె రామ్మూర్తినాయుడు, పద్మ, పెద్దసంఖ్యలో జెడ్పీటీసీ సభ్యులు కూడా జగన్‌కే సంఘీభావం తెలిపారు. నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాలపాప తన నియోజకవర్గంలో జరిగే యాత్రలో పాల్గొంటారని తెలిసింది. యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు తన కుమారుడిని యాత్రకు పంపుతున్నారు.
ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు, మాజీ గండి బాబ్జీ, కర్రి సీతారాము, గూనూరు మిలట్రీనాయుడు(ఎర్రునాయుడు), పూడి మంగపతిరావు, కుంభా రవిబాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎం.నాగార్జున, ఏపీటీఎస్ మాజీ చైర్మన్ కొయ్యా ప్రసాదరెడ్డి, ఆర్‌ఈసీఎస్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కూడా యువనేత వెంటే ఉంటామని ఇదివరకే వెల్లడించారు. ప్రజారాజ్యం విశాఖ నగర ఉపాధ్యక్షుడు విళ్లా శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు బాసటగా నిలిచారు. ఇక నగరానికి సంబంధించి జీవీఎంసీకి చెందిన 15 మంది కార్పొరేటర్లూ జగన్‌కు జై కొట్టారు. వీరంతా ఓదార్పుయాత్రలో పాల్గొంటున్నారు.తొలిరోజు యాత్ర ఇలా..
జగన్ సోమవారం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారు. ఎన్‌ఏడీకొత్తరోడ్డు, గోపాలపట్నం జంక్షన్, శొంఠ్యాం, గుర్రం పాలెం, పెందుర్తి, రాంపురం, సబ్బవరం జంక్షన్, ఆరిపాక, చినయాతపాలెం, లింగాలతిరుగుడు, అడ్డూరు మీదుగాయాత్ర సాగుతుంది. మధ్యలో సాయంత్రం 5.00 గంటలకు సింహాచలం కొండపై శ్రీలక్ష్మీ నృసింహస్వామిని యువనేత దర్శించుకుంటారు. అర్ధరాత్రి 12.30 గంటలకు కె.కోటపాడులో జరిగే సభతో తొలిరోజు యాత్ర ముగిస్తారు.

No comments:

Post a Comment