Sunday, January 16, 2011

మృతుల్లో 18 మంది తెలుగువారు

'శబరిమల'లో పెను విషాదం
* సంఘటనా స్థలానికి హెలికాప్టర్‌లో చేరుకున్న కేరళ సీఎం
* 104 మంది భక్తుల మృతి
* 55 మృతదేహాల గుర్తింపు
* మృతుల్లో ఒక శ్రీలంక జాతీయుణ్ని గుర్తించిన పోలీసులు
* 26 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి 
* మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా 
కేరళలోని పులిమేడ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 104 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 15 మందికిపైగా తెలుగువారున్నారు. వీరి మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. పులిమేడ్‌ ప్రాంతంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 18 మంది తెలుగువారు మృతిచెందారు. మృతుల్లో నిజామాబాద్‌ జిల్లా భోదన్‌కు చెందిన రాజ్‌కుమార్‌, కన్న, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన గణేష్‌, పట్నాల సూరీ, పట్నాల రాంబాబు, నేతూరి రాజు, గోవింద్‌, మెదక్‌జిల్లా గజ్వేల్‌కు చెందిన తండ్రీకొడుకులు రామచంద్రం, అరుణ్‌, కరీంనగర్‌ జిల్లా మానకొండూరుకు చెందిన దొమ్మాటి సర్వేశం, కృష్ణజిల్లాకు చెందిన బత్తిన ప్రసాద్‌ వివరాలు ఇప్పటివరకు తెలిశాయి. అధికారికంగా మృతుల సంఖ్య 104 అయినా... అనధికారికంగా 150 వరకు ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల్లో 26 మందికి పోస్టుమార్టం పూర్తయింది. మృతుల్లో 22 మంది తమిళనాడుకు చెందినవారు, ఒక శ్రీలంక జాతీయుడు ఉన్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రుల సంఖ్య 250కి పైగా ఉంది. వీరికి కొట్టాయం వైద్య కళాశాలు, తమిళనాడు తేనిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్సలు అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల్లో తమిళనాడుకు చెందినవారు అధికంగా ఉండటంతో సహాయక చర్యల్లో తమిళనాడు ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.పులిమేడ్‌ ఘటనను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎమర్జెన్సీగా ప్రకటించినా... కేరళ ప్రభుత్వంలో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి వరకు కేరళ హోం, దేవాదాయ, ఆరోగ్యశాఖ మంత్రులు సంఘటనాస్థలానికి చేరుకున్నా... తెల్లవారు జామున 4.30కి గానీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. కేరళ సీఎం అచ్యుతానందన్‌ ఈ రోజు ఉదయం హెలికాప్టర్‌ ద్వారా సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. శబరిమల పరిసరాల్లో ఇది మూడో అతిపెద్ద ప్రమాదమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 1998లో పంపానది సమీపంలోని హిల్‌టాప్‌లో తొక్కిసలాట, కొండచరియలు విరిగిపడ్డ సందర్భంలో 56 మంది మృతిచెందారు. గత ఏడాది వరదల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. కొట్టాయం నుంచి ఎరుమేలి రోడ్డులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లారీ బోల్తా పడడంతో 30 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంవత్సరం వెండిపెరియార్‌ - పులిమేడ్‌ మధ్య జరిగిన రెండు ప్రమాదాల్లో ఇప్పటి వరకు 104 మంది మృతిచెందినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

No comments:

Post a Comment