Saturday, January 8, 2011

జన సమీకరణ కాదు.. జన సంక్షేమం ముఖ్యం

 సభలు, సమావేశాలకు జనాలను సమీకరించే కంటే జన సంక్షేమాన్ని కాంక్షించడం ఎంతో ముఖ్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు వ్యాఖ్యానించారు. పాడేరు మండలం మినుములూరు గ్రామంలో 15 లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన మంచినీటి పథకానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో జగన్ చేపడుతున్న ఓదార్పు యాత్రకు చేస్తున్న జన సమీకరణపై పరోక్ష విమర్శలు గుప్పించారు. సభలకు జనాలు రావాలంటే అబద్దపు మాటలు చెప్పాలని, అటువంటి చేసి జనాలను రప్పించుకునే కంటే వచ్చిన పది మందితోనైనా కార్యక్రమాలను నిర్వహించి వారి సంక్షేమానికి ఏం చేశామని, చూసుకోవడం అవసరమని ఆయన అన్నారు. తాను బలప్రదర్శనను కోరుకోవడం లేదని, మంచిని కోరుకున్న పది మంది ఉన్నా చాలని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చి ముఖం చూపించి మాయమాటలు చెప్పడం కాదని ఆయన ఎద్దేవా చేశారు. తాను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దాదాపు రెండు సంవత్సరాల వ్యవధిలో ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను అమలు చేసినట్టు ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, కాఫీ తోటల పెంపకం, గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో తాము విజయం సాధించామని ఆయన అన్నారు. మన్యంలో నెలకొన్న మంచినీటి ఎద్దడిని నివారించేందుకు బృహత్తర కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, పాడేరు నియోజకవర్గంలోనే ఎనిమిది కోట్ల రూపాయలతో నీటి పథకాల పనులను మంజూరు చేశామని ఆయన తెలిపారు. గిరిజన గ్రామాల అవసరాలను గత ప్రభుత్వాలు తీర్చలేకపోయినప్పటికీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని అవసరాలను తీర్చగలుగుతున్నట్టు ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తున్న తమ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎన్నో పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అమలు చేసిన కార్యక్రమాల ఫలాలు ప్రస్తుతం పొందగలుగుతున్నారని ఆయన చెప్పారు. మినుములూరు ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మారుమూల గ్రామాలకు త్వరలోనే రహదారి సౌకర్యం కల్పించే పనులను ప్రారంభించనున్నట్టు బాలరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎస్.సత్యనారాయణ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.ఆర్.డి.ప్రసాదరావు, గ్రామీణ నీటి సరఫరా పథకం విశాఖపట్నం సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.సంపత్‌రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాదరావు, స్థానిక ఎం.పి.డి.ఒ. జి.వి.చిట్టిరాజు, జెడ్పీటీసీ రొబ్బా ఉషారాణి, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, మినుములూరు సర్పంచ్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment