Friday, January 14, 2011

ఊరంతా సంక్రాంతి...

పండు వెన్నెల‌ నిండు గుండెలో నింపుకుని...
పంటచేల సొగసు పట్టుచీరగా చుట్టుకుని...
దరహాస ధనరాశులు తోడుగా తెచ్చుకుని...
ఘల్లుఘల్లున కాలి అందెలు రవళించగా...
అరుదెంచినదిగో సంక్రాంతి లక్ష్మి...
నవరాగ పుష్పాలు శిగలో చుట్టుకుని...
మమకార మంజరీ మంజులాంజన దీప్తి...
నేత్రాంచలంబుల తీర్చిదిద్ది...
సంధ్యారుణ ఛాయ తిలకంబుగా తీర్చి...
నడిచి వచ్చెనదిగో... తల్లి సంక్రాంతి శుభలక్ష్మి...’’
ముచ్చటైన మూడురోజుల ఉత్సవ శోభ తిలకించి పులకించిన ఓ కవి... అభినందన సూచకంగా సంక్రాంతి లక్ష్మికి ఆ విధంగా అక్షరార్చన చేసాడు.
నిజానికి ప్రతి పండుగా శోభస్కరమే. గడపతొక్కి వచ్చే హితులు... సన్నిహితులు... స్నేహితులు... ఆత్మీయ అతిథుల సందళ్లతో... ప్రతి ఉత్సవం రమణీయం... కమనీయం.
అపురూపం అనిర్వచనీయం.
దైనందిన జీవనంలో వైవిధ్యతను మోసుకొస్తాయి పండుగలు.
వెల్లువెత్తే ఉత్సాహాన్ని తీసుకొస్తాయి ఇవి.
వరుసపెట్టి వచ్చే అన్ని రోజులూ వేరు... సరదాల సంబరాలు తెచ్చే పండగ రోజులు వేరు.
పండగంటే గుండెల్లో జాతరే. అంతకుముందురోజువరకూ అతి భారంగా క్షణాలు నెట్టుకొచ్చినా... పండగ పూట ద్విగుణీకృత ఆనంద తన్మయత్వంలో మునిగితేలుతారంతా. ఉన్నంతలో ఉత్సవాన్ని చక్కగా జరుపుకోవాలనే ఆశిస్తారు. అభిలషిస్తారంతా. అయితే, అన్ని పండగలూ ఒక ఎత్తు...తెలుగిళ్ల లోగిళ్లలో సంక్రాంతి పండగ మరో ఎత్తు. ప్రతి పండగా ఒకట్రెండు రోజులుంటే... ముచ్చటగా మొదటి రోజు బోగీ, రెండోరోజు సంక్రాంతి, మూడోరోజు కనుమ అంటూ వరుసగా పండగ సంతోషాల్ని ఆహ్వానిస్తారు. అయితే, సంక్రాంతి పండగ వట్టి మూడురోజులేనా... అంటే, కాదనే సమాధానం వస్తుంది.


నిజానికి... ఇది నెల్లాళ్ల పండగ. ఇల్లేలే మహారాణులు, ఆడపడుచులు సంక్రాంతి నెల ముందునుంచీ... హడావుడి పడ్తుంటారు. ప్రతి సాయంత్రం రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతి లక్ష్మికి రోజుకో తీరుగా స్వాగతం పలుకుతుంటారు. కార్పోరేట్ సంస్కృతి ఊరువాడాని చుట్టేసిన ప్రస్తుత నేపధ్యంలో కూడా... ఇప్పటికీ తెలుగిళ్లలోగిళ్లలో సంక్రాంతి పండగ చూడముచ్చటైన పండగే. ఈ ధాన్యలక్ష్మి ఇంటికొచ్చే పండగ. అంటే, ఓ పక్క ఏరువాక... మరోపక్క ‘‘డూడూ బసవన్న... దొడ్డ దొరండీ బసవన్న... అయ్యగారికీ దణ్ణంపెట్టు... అమ్మగారికీ దణ్ణం పెట్టు...’ అంటూ ఇంటింటికీ బసవన్నల రాక... అత్తారింటికొచ్చే కొత్త అల్లుళ్ల పెదాలపై సదా వెలిగే వెనె్నల రేక... ‘శ్రీరమారమణ గోవిందో హరి...’ అంటూ అంత గొంతెత్తి ఆలపించే హరిదాసుల సందడి మరోపక్క. ఇలా... సంక్రాంతి పండగంటే సర్వశోభాయమానం అనిపిస్తుంది.
ధనుర్మాసంలో వైష్ణవ సంప్రదాయానే్న అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. మధ్యమధ్యలో శివారాధన కూడా ద్యోతకమవుతుంటుంది. గంగిరెద్దు అంటే... శివుని వాసనంగా కొలుస్తారు. తలుస్తారు. దానిని ఆరాధించడం ఈ పండగలోని విశిష్టతే. దీని వెనుక ఓ కథ కూడా ఉందంటారు.

No comments:

Post a Comment