Sunday, January 30, 2011

తెలంగాణ సమస్య పరిష్కారంపై కేంద్రం కసరత్తు

తెలంగాణ సమస్యకు సత్వర పరిష్కారం కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు గాను ఫిబ్రవరిలో మరోమారు సమావేశానికి హోం మంత్రి చిదంబరం రెడీ అవుతున్నారు. అయితే వచ్చే నెలలో జరిగే సమావేశానికి రాష్ట్రంలోని పార్టీలన్నీ హాజరు అవుతాయా అన్నది సస్పెన్స్‌గా మారింది. బడ్జెట్ సమావేశాల ముందే ఏపిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థతికి తెరదించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలతో మరో దఫా అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి సమాయత్తమవుతోంది. శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరు సిఫార్సులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని యుపిఎ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళుతున్న హోంమంత్రి చిదంబరం ఈ నెల 30న ఢిల్లీ తిరిగి రానున్నారు. ఫిబ్రవరి 1న జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ అంశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్..వారి ముందు ప్రస్తావనకు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించారు. దీంతో తెలంగాణపై ప్రాధమికంగా యుపిఎ ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఇక జనవరి 6న నిర్వహించిన అఖిల పక్ష భేటీకి కేవలం ఐదు పార్టీలు హాజరు కాగా, వచ్చే నెలలో నిర్వహించబోయే సమావేశానికి అన్ని పార్టీలు హాజరు అవుతాయని కేంద్రం ఆశిస్తోంది. రిపబ్లిక్ వేడుకల నేపధ్యంలో హోం శాఖ వర్గాలు బిజీగా వుండటంతో తెలంగాణపై కొంత మేర స్థబ్దత ఏర్పడిందని ఆ వర్గాలు అంటున్నాయి. 

No comments:

Post a Comment