Friday, January 28, 2011

గందరగోళం లో ఆంధ్రప్రదేశ్


తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తప్ప మరేదానికి ఒప్పుకోమని ఆ ప్రాంత నేతలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలు .. నేతల సమాలోచనలతో శీతాకాలంలోనూ రాష్ట్రంలో వేడివేడి వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై కేంద్రం మనసులో ఏమున్నా ప్రత్యేక రాష్ర్టం తప్ప సమస్యకు వేరే పరిష్కారం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గట్టి పట్టుదలతో ఉండగా.ప్రధాన ప్రతిపక్షం మాత్రం అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు కొత్త కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టబోతోంది. రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులనుంచి బయటపడేందుకు అధిష్టానం తీవ్రంగా యోచిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్టీల ఏకాభిప్రాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందలో భాగంగా ఢిల్లీలో రాత్రి కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది. శ్రీకృష్ణకమిటీ రిపోర్టుతో పాటు తెలంగాణ అంశంపై ఈ మీటింగ్ లో దాదాపు గంటసేపు చర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో మరోమారు సమావేశం నిర్వహించిన తర్వాతే , మిగిలిన వారితో చర్చలు జరపాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి రావద్దని జోరుగా పావులు కదుపుతున్నారు.ప్రణబ్‌లాంటి పెద్దలు ఢిల్లీలో కూర్చోబెట్టి ఎన్ని చెప్పినా బిల్లు పెట్టకపోతే రాజీనామే శరణ్యమని ఎంపీలు హెచ్చరిస్తున్నారు. దీంతో అఖిలపక్షం భేటీలోగా ఎంపీలతో మరోమారు సమావేశమవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఇదిలావుంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉద్యమానికి ఒక రూపం ఇచ్చేందుకు ఆ ప్రాంత నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దశల వారిగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. నెలాఖరు నాటికి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయలను చెప్పిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచించాలన్నది వారి భావన. ఏదేమైనా పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే ఎంతకైనా తెగించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రెడీ అయ్యారు. రాజీనామాలే కాదు ఆమరణ దీక్షలకు కూడా వారు మానసికంగా సంసిద్ధులవుతున్నారు. కాంగ్రెస్‌ నేతల పరిస్థితి ఇలావుంటే టీడీపీ వారిది మరోలా వుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన స్వేఛ్చతో తెలంగాణా అంశంపై ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్న నేతలు సోమవారం నాడు విస్తృతస్థాయి సమావేశంలో చర్చించి భవిష్య కార్యాచరణను ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. కాలయాపనతో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కుట్ర పూరిత వ్యూహాన్ని ప్రజల ముందు ఉంచాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అన్ని ప్రాంతాలలో సమిష్టిగా బస్సు యాత్ర నిర్వహించి సభలు నిర్వహించడం ద్వారా మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను ఎండగట్టాలన్నది వ్యూహం. రెండు మూడు రోజుల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించి ఉద్యమబాట పట్టాలని ప్రణాళికను రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

No comments:

Post a Comment