Saturday, January 8, 2011

నిర్ణయం నిదానంగానా త్వరగానా ఇప్పుడేమిటీ? కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

తెలంగాణ అంశానికి సంబంధించి జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ సూచించిన పరిష్కారమార్గాలలో దేనిని ఎంచుకోవాలన్న విషయంలో ఒక నిర్ణయం తీసుకొనేందుకు తొందరపడరాదనే కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది.
 ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధికార నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులపై ప్రాథమిక పరిశీలన జరిపినప్పటికీ నివేదిక వెలువడిన అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకొనే పరిణామాలు, ఈనెలాఖరులోగా మరోసారి రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలతో నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానంతరమే దీనిపై దృష్టి పెట్టాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలియవచ్చింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, ఎ.కె.ఆంధోనీ, పి.చిదంబరం, అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌ పాల్గొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదికను బహిర్గతం చేసిన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను హోం మంత్రి చిదంబరం వివరించినట్లు సమాచారం. కమిటీ నివేదికను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు అందించామని, కమిటీ నివేదికపై లోతుగా చర్చించేందుకు ఈ నెలలోనే వారితో మరోసారి సమావేశం కానున్నామని, పార్టీలన్నింటితో చర్చించిన తర్వాతే ప్రభుత్వం యఒయక నిర్ణయం తసుకొంటుందని సమావేశానంతరం విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా చిదంబరం వెల్లడించారు.
తెలంగాణ ప్రాంత ప్రజల అనుమానాలు, భయాందోళనలను తొలగించేందుకు తగిన రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యుత్తమ పరిష్కార మార్గంగా జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ సూచించిన విషయం విదితమే. అయితే, తప్పనిసరైతే, గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజానీకం అంగీకారం తీసుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చునని కూడా కమిటీ సిఫార్సు చేసీంది.
కమిటీ నివేదికను బహిరంగ చర్చ కోసం ప్రజల ముందుంచినందున రాబోయే రోజుల్లో కమిటీ సిఫార్సులపై వ్యక్తమయ్యే అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చోటుచేసుకొనే పరిణామాల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తునట్లు తెలిసింది. జనవరి నెలాఖరులోగా నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన రెండవ అఖిలపక్ష సమావేశంలో కూడా రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడికాకపోతే ఆ తర్వాత కూడా మరిన్ని సమావేశాలను నిర్వహించాలని, అంతిమంగా, జాతీయ స్థాయిలో కూడా పాలక యుపిఎ భాగస్వామ్యపక్షాలను సంప్రతించాలని అధిష్ఠానం ప్రభుత్వానికి సూచించింది.
పాలకపార్టీకి నష్టం కల్గించని రీతిలోనే నిర్ణయం : తెలంగాణపై అంతిమ పరిష్కారం ఏదైనా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాల పరిరక్షణకు తోడ్పడేదిగానే ఉండేలా చూస్తామని పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు వెల్లడించారు. గత ఏడాది కాలంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన తెలంగాణ అంశంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కాలంలో పార్టీకి ఎంతో కొంత నష్టం తప్పకపోయినప్పటికీ దానిని కనీసస్థాయికి పరిమితం చేసేందుకు తోడ్పడుతుందా లేదా అన్న అంశమే తుది నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయమని ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకొంటున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు అధిష్ఠానానికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి అంచనాలతో అధిష్ఠానం ఏకీభవిస్తున్న సూచనలు మాత్రం కనిపించడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత యువనేత రాహుల్‌ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌ తెలంగాణ డిమాండ్‌ను అంగీకరిస్తే తెలంగాణలో విజయం సాధించడం మాట అటుంచి కోస్తా, రాయలసీమల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదని మరో ఎఐసిసి సీనియర్‌ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. ‘తెలంగాణ ఏర్పాటైతే టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, బిజెపి, వారి మిత్రులే పోరాడి కాంగ్రెస్‌ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని తెలంగాణ ప్రజలను నమ్మించడం వారికి పెద్ద కష్టం కాదు, ఫలితంగా, వచ్చే సార్వత్రిక ఎన్నికలలలో తెలంగాణలో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌ స్థానాలేమైనా లభిస్తాయా అన్నది సందేహాస్పదమే, అదేసమయంలో, వేర్పాటువాదుల వత్తిడికి లొంగి రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్‌ పార్టీయే అన్న అపప్రదను మూటకట్టుకోవాల్సి రావడంతో కోస్తా, రాయలసీమల్లో కూడా కాంగ్రెస్‌కు ఒక్క పార్లమెంట్‌ స్థానం కూడా దక్కే పరిస్థితి ఉండకపోవచ్చు’ అంటున్న ఆ నాయకుడు ఏంచేస్తే ఏమి జరుగుతుందన్న విషయాన్ని అత్యంత జాగ్రత్తగా బేరీజు వేసుకొని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
దీనికితోడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉధృతమయ్యే వేర్పాటు ఉద్యమాలతో వేగడమెలా అన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో దాదాపు రెండు డజన్లకు పైగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నప్పటికీ తెలంగాణపై తీసుకోనున్న నిర్ణయాన్ని బట్టి అవి తిరిగి తెరపైకి రావడం ఆధారపడి ఉంటుందన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌ ఉద్యమం ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.
చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని ఈమధ్య కాలంలో పదేపదే ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు కూడా తెలంగాణపై నిర్ణయం అంత తొందరగా వచ్చేది కాదని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. తెలంగాణతో సహా చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని చెప్పామే తప్ప కాంగ్రెస్‌ పార్టీ వాటికి అనుకూలమని ఎప్పుడైనా చెప్పామా? అన్న ఎదురు ప్రశ్న వారినుండి తాజాగా ఎదురౌతుండడం గమనార్హం.

No comments:

Post a Comment