Thursday, January 20, 2011

త్వరలో తాడి గ్రామాన్ని తరలిస్తాం

విశాఖపట్నం ;ఎట్టకేలకు ప్రభుత్వం మెట్టు దిగింది. ఫార్మాసిటీ కాలుష్య భూతంతో అల్లాడిపోతున్న తాడి గ్రామాన్ని తరలించేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని రాంకీ ఫార్మాసిటీ యాజమాన్యం, తాడి గ్రామ పంచాయతీ, ఏపీఐఐసీ, రెవెన్యూ వర్గాలతో విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్ ప్రటించారు. తాడి తరలింపు విషయమై గ్రామస్థులు పలుమార్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోగా ప్రకటన చేస్తామని ఏపీఐఐసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ హామీ ఇచ్చారు.ఈ మేరకు ఇదే విషయం మాట్లాడడానికి ఎంపీపీ మాధంశెట్టి నీలబాబు నేతృత్వంలో తాడి గ్రామస్థులు, రామ్‌కీ యాజమాన్యం కలెక్టరేట్‌లో జేసీతో బుధవారం సమావేశమయ్యారు. రాంకీ ఫార్మా సిటీ అనుకుని వున్న తాడి శివారు చినతాడి, బీసీ కాలనీల తరలించే ప్రక్రియ ప్రారంభిస్తామని జేసీ ప్రకటన చేశారు. తాడి గ్రామాన్ని తరలిస్తే ప్రత్యామ్నాయంగా గ్రామస్థులకు పునరావాసం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థల సేకరణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తాడి, చినతాడి, పెదతాడి, బీసీ కాలనీలకు సంబంధించి గ్రామస్థులకు ఒకేచోట కాలనీ నిర్మించాలని కోరుతున్నారు. సుమారు రెండొందల ఎకరాల భూమి సేకరించి ఇవ్వాలని వారు కోరారు. పునరావాసం కల్పించేందుకు అవసరమైన స్థలాన్ని మూడు రోజుల్లో గుర్తించాలని పరవాడ, గాజువాక రెవెన్యూ అధికారులకు జెసీ ఆదేశించారు.రామ్‌కీ వర్గాలు గ్రీన్‌బెల్ట్ పరిధిలో ఉన్న చినతాడి, బీసీ కాలనీలను సేకరించేందుకు సుముఖత వ్యక్తం చేశాయని, తొలి విడతగా తాడి బీసీ కాలనీ, చినతాడిలను తరలిస్తామని స్పష్టం చేశారని పరవాడ ఎంపీపీ నీలబాబు ''కు తెలిపారు. గ్రామం తరలింపు ప్రకటన పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ సమావేశంలో ఏపీఐఐసీ డిప్యూటీ జెడ్ఎం ప్రసాద్, రామ్‌కీ సీఎండీ లాల్ కృష్ణ, నిర్వాసిత నాయకులు జుత్తుక మాధవరావు, కోమటి అచ్చిబాబు, పాలవలస అప్పలాచారి, కోమటి సత్తిబాబు, మాధంశెట్టి కన్నబాబు, కె పైడిరాజు, కర్రి సత్తిబాబు పాల్గొన్నారు.

No comments:

Post a Comment