Sunday, January 30, 2011

చేనేత సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా – చిరు


రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వంపై సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తెస్తామని ప్రజారాజ్యం పార్టీ అద్యక్షుడు చిరంజీవి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని రాఘవేంద్రస్వామి కళ్యాణమండపంలో జరిగిన చేనేతల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ తాను ప్రాజారాజ్యం పార్టీని స్థాపించగానే తొలుత దృష్టిపెట్టింది చేనేత పరిశ్రమపైనేనన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, చేనేత పరిశ్రమలు పట్టుకొమ్మలన్నారు. నేడు అవి నీరుకారిపోతున్నాయన్నారు. ప్రజలకు కట్టుకోవడానికి బట్టలిచ్చి నాగరికతను నేర్పిన నేత కార్మికులు నేడు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మెట్టమెదట అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి 312కోట్ల రూపాయల ప్యాకేజి మంజూరుకు కృషి చేసిన ఘనత తమదేనన్నారు. తాను సిరిసిల్లకు వెళ్ళి వచ్చిన తర్వాత అధికార పార్టీనేతలు వెళ్ళారన్నారు. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల కారణంగానే చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. మరమగ్గాలతో చేనేత పరిశ్రమ అంతరిస్తోందన్నారు.  చేనేత పరిశ్రమను కాపాడడానికి 11రకాల చేనేత వస్త్రలపై కేంద్రప్రభుత్వం రిజర్వేషన్‌ పెడితే అది అమలు కావడం లేదని చిరంజీవి విచారం వెలిబుచ్చారు. పవర్‌ లూమ్స్‌ లో చేనేత వస్త్రలు విపరీతంగా ఉత్పత్తి అవుతుండడంతో చేనేత పరిశ్రమ క్షీణిస్తోందన్నారు. దీనికితోడు మైక్రో ఫైనాన్స్‌ ల బెడద అధికమయ్యాయన్నారు. పట్టుముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత కార్మికులకు గిట్టుబాటు ధరలు లభించక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో కిలో వార్పు ధర 1400లుండగా నేడు రూ.3400లకు పెరిగిందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. దీంతో ఇటీవల ధర్మవరంలో ముగ్గురు చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వారి కుటుంబాలకు తమ పార్టీ తరఫున రూ.25వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. ప్రభుత్వం సబ్సిడీ ధరలకు చేనేత కార్మికులకు పట్టుముడి పదార్థాలను అందించి ఆదుకోవాలన్నారు. ఆప్కో ద్వారా చేనేత చీరలను కొనుగోలు చేయాలన్నారు. ఆప్కో రిబేటు శాతాన్ని 40కి పెంచాలన్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కోఆప్‌ టెక్స్‌ వారు 40శాతం రిబేటుతో విక్రయిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం రిబేటు శాతాన్ని ఆప్కోకు పెంచడం లేదన్నారు. 20శాతం వున్న రిబేటును 40శాతానికి పెంచాలని గతంలో ముఖ్యమంత్రిగా వున్న రోశయ్యను తాను కోరగా ఆయన స్పందించి 30శాతానికి పెంచారన్నారు. ఆ ఘనత కూడా తనకే దక్కిందన్నారు. కనుక 40శాతం రిబేటుకు పెంచేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. సిరిసిల్ల మాదిరి అనంతపురం జిల్లా చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. సమావేశంలో చేనేత కార్మికుల పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆర్‌. అశ్వత్థ నారాయణ, పి. సుబ్రహ్మణ్యం, ఎస్‌. పురుషోత్తం గౌడ్‌, పి. రామాంజ నేయులు, జి. జ్ఞానలోలుడు, ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వర్‌ రావ్‌, డి.టి.నాయక్‌, వి.పద్మ, కె.శ్రీకాంత్‌ రెడ్డి, తదితరులు ప్రసంగించారు. సమావేశంలో ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సదాశివరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి. చలపతి, నాయకులు టి.జె.ప్రకాష్‌, రమాదేవి, యువరాజ్యం అధ్యక్షుడు రాజు, ఎల్‌.పి.బాబు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment