Monday, January 17, 2011

పోలవరం,ప్రాణహిత పూర్తయితే ప్రతిరోజూ సం క్రాంతే!

అండగా ఉంటాం ..అధైర్యం వద్దు
ఆశానహ దృక్పథంతో పండుగ చేసుకోండి
రూ.50వేల కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం
ఖరీఫ్ నాటికి కౌలు రైతులకూ రుణ కార్డులు

మూడేళ్లలో 43 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
రైతులకు ముఖ్యమంత్రి బహిరంగ లేఖ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.50 వేల కోట్ల వరకు పంట రుణాలు అందిస్తాం. ఖరీఫ్ నాటికి కౌలు రైతులకు రుణ అర్హతా గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. వచ్చే మూడేళ్లలో 43 ప్రాజెక్టులను పూర్తి చేసి... 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. త్వరలోనే పోలవరానికి జాతీయ హోదా లభిస్తుంది. ప్రాణహిత ప్రాజెక్టుకూ జాతీయ హోదా లభించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులు పూర్తి చేస్తే రైతులకు ప్రతి రోజూ సంక్రాంతే'' అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రైతులకు ముఖ్యమంత్రి ఒక బహిరంగ లేఖ రాశారు.ప్రభుత్వం రైతుకు అండగా నిలబడుతుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని తన లేఖలో పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వ్యాఖ్యానించారు. కర్షకులకు ఎంతో ఎంతో ప్రియమైన సంక్రాంతి పండుగను ఆశావహ దృక్ఫదంతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. "రైతన్న ఆపదలో ఉంటే ఆదుకోవటం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఇది రైతుల ఆదరణతో, వారి అండతో నిలబడ్డ ప్రభుత్వం. యుపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల క్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది'' అని సీఎం వివరించారు.ఆరేళ్ల క్రితం వరకూ వ్యవసాయంపై నిర్లక్ష్య ధోరణుల కారణంగా రైతులు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని... 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారని తెలిపారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించారని చెప్పారు. వైఎస్ బాటను ఆదర్శంగా తీసుకుని... వ్యవసాయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. "రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా 29 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరిగేలా ఉచిత విద్యుత్‌ను ఈ ప్రభుత్వమే అమలు చేసి కొనసాగిస్తోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ఇటీవలే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు సీడబ్ల్యూసీ సాంకేతిక మండలి అనుమతి లభించింది.ఇక జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు రావడమే తరువాయి. తెలంగాణలో 16.5 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటిని కల్పించే జలహారం ప్రాణహిత -చేవేళ్లకు అన్ని రకాల అనుమతులు సాధించి, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది'' అని సీఎం వివరించారు. "రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కౌలు రైతులకు కూడా రుణ అర్హత కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికి కౌలు రైతులకూ బ్యాంకు రుణాలు పొందే అవకాశం దక్కుతుంది' అని ముఖ్యమంత్రి తన లేఖను ముగించారు.

No comments:

Post a Comment