Thursday, January 20, 2011

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి మొండిచేయి

రగిలిపోతున్న అధికార పార్టీ ఎంపీలు
అవమానంతో రించి, చివరికి ఉసూరనిపించారంటూ మండిపాటు
ఎటూ కాకుండా పోయామంటున్న తెలంగాణ ఎంపీలు
విధేయత వృథాయేనా అంటూ సీమాంధ్ర నేతల ఆవేదన
పార్టీ గడ్డు స్థితిలో ఉన్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆగ్రహం
 రాష్ట్ర ఎంపీలకు అవకాశం ఖాయమన్న జోస్యాలు తప్పయ్యాయి. కనీసం ముగ్గురికైనా అందలం అందుతుందన్న అంచనాలు వమ్మయ్యాయి. తమకు తప్పక న్యాయం జరుగుతుందన్న ‘సీనియర్ల’ ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. రాష్ట్ర ఎంపీలకు మరోసారి తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. 32 మంది ఎంపీలతో యూపీఏ సర్కారుకు ఆయువుపట్టులా నిలుస్తున్నా, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి చోటు కూడా దక్కని వైనం కాంగ్రెస్ ఎంపీలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ముఖ్యంగా పునర్ వ్యవస్థీకరణలో తమకు స్థానం తప్పదని చివరి దాకా నమ్మకం పెట్టుకున్న అరడజను మంది సీనియర్ ఎంపీలైతే దీన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు. కేబినెట్‌లోకి తీసుకుంటామంటూ కొన్ని నెలలుగా ఊరించి, తీరా ఇప్పుడు కనీసం మాట కూడా చెప్పకుండా, తమ అభిప్రాయాలను, అభిమతాలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించిన తీరును వారు సహించే పరిస్థితుల్లో లేరని తెలుస్తోంది. పార్టీ అధిష్టానానికి బద్ధులై ఉంటామని ప్రతిసారీ ప్రకటించే పలువురు ఎంపీలు కూడా సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. పలు కారణాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్న తరుణంలో కూడా మంత్రి పదవుల విషయంలో అధిష్టానం ఇంతటి నిష్క్రియాపరత్వం ప్రదర్శించడం సీనియర్ ఎంపీలకు మింగుడు పడటం లేదు. పార్టీని ధిక్కరిస్తున్న వారినీ, విధేయులనూ ఒకే గాట కట్టేసిందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. అసలు రాష్ట్రం నుంచి కొత్తగా ఎవరి పేరునూ కనీసం పరిశీలనకు కూడా తీసుకోకపోవడం వెనక బలమైన కారణాలేమున్నాయా అని ఎంపీలంతా తర్జనభర్జనల్లో మునిగిపోయారు.

No comments:

Post a Comment