Thursday, January 20, 2011

రచ్చబండకు పీఆర్పీ మద్దతు

సీఎంతో భేటీకి తొమ్మిది మందే హాజరు
ఆపత్కాలంలో సర్కారుకు మద్దతిస్తామని వెల్లడి
 రచ్చబండ కార్యక్రమం ప్రభుత్వపరమైనదని, అందులో పాల్గొనడం తమ బాధ్యత అని పీఆర్పీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం నాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పలువురు పీఆర్పీ ఎమ్మెల్యేలు కలిశారు. రచ్చబండ కార్యక్రమం త్వరలోప్రారంభం కానున్న నేపథ్యంలో వీరు సీఎం వద్దకు వెళ్లారు. అయితే ఈ భేటీకి తొమ్మిదిమందే హాజరయ్యారు. ప్రభుత్వం సంక్షోభంలో పడితే మద్దతిస్తామని ఈ సందర్భంగా వారు సీఎంకు మరోసారి స్పష్టం చేశారు. బండారు సత్యానందరావు, ఈలి నాని, శ్రీధర కృష్ణారెడ్డి, అన్నె రాంబాబు, అవంతి శ్రీనివాస్, యలంపల్లి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్, చింతలపూడి వెంకట్రామయ్య, వంగా గీత సీఎంను కలిశారు. గంటా శ్రీనివాసరావు కూడా హాజరుకావాల్సి ఉన్నా.. ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం విజయవాడలో ప్రమాదానికి గురికావడంతో హుటాహుటిన ఆయన అక్కడికి వెళ్లారు. సీఎంతో భేటీకి ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని పార్టీ కార్యాలయం మెసేజ్‌లు పెట్టినా.. తొమ్మిది మందే రావడం చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, జగన్‌కు జై కొట్టిన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు ఇద్దరు డుమ్మా కొట్టారు. తిరుపతి వెళ్లిన కన్నబాబు, గోవాలో ఉన్న పంతం గాంధీ మోహన్ ఈ భేటీకి రాలేకపోయారని ఎమ్మెల్యే సత్యానందరావు చెప్పారు. హైదరాబాద్‌లో ఉండీ కొందరు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు ఆయన ఘాటుగానే స్పందించారు. 'కొందరు హైదరాబాద్‌లోనే ఉండి రాకపోవచ్చు. ఇంకొందరు ఇతర పార్టీల కార్యక్రమాల్లో ఉండి రాకపోయి ఉండవచ్చు' అన్నారు. సీఎంతో ఎమ్మెల్యేల భేటీకి ముందు అధినేత చిరంజీవి ఇంట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలే హాజరయ్యారు.

No comments:

Post a Comment